రెండు ముక్కలైన ఆటో

23 May, 2022 01:34 IST|Sakshi
ఘటనా స్థలంలో నుజ్జునుజ్జయి రెండు ముక్కలైన ఆటో  

ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం

అక్కడికక్కడే ముగ్గురి దుర్మరణం 

వరంగల్‌–ఖమ్మం రహదారిపై ఘటన 

మామునూరు: గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో డ్రైవర్‌తోపాటు ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆటో నుజ్జునుజ్జు కావడంతోపాటు రెండు ముక్కలైంది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకు వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై రామకృష్ణాపురం క్రాస్‌రోడ్డు సమీపంలో ఈ ఘటన జరి గింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం అల్లీపురం గ్రామానికి చెందిన సింగారపు సమీదా, సాంబయ్య దంపతుల రెండో కొడుకు 23 ఏళ్ల ఎస్‌కే యాకూబ్‌పాషా (సింగారపు బబ్బులు) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

పాషా ఎప్పటిలాగే తెల్లవారు జామున 3 గంటలకు ఆటో తీసుకుని ఇంటి నుంచి వరంగల్‌ బస్టాండ్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండపెల్లి గ్రామానికి చెందిన పల్లపు పద్మ(35), ఆమె సమీప బంధువు, హనుమకొండ వినాయకనగర్‌కు చెందిన పల్లపు మీనా(27) కలసి వ్యక్తిగత పనిపై వరంగల్‌ బస్టాండ్‌కు చేరుకున్నారు.

అక్కడినుంచి యాకూబ్‌పాషా ఆటోలో ఇద్దరు మహిళలు వర్ధన్నపేటకు వెళ్లి.. తిరిగి అదే ఆటోలో వరంగల్‌కు బయలుదేరారు. ఆటో రామకృష్ణాపురం సమీపానికి రాగానే.. వరంగల్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో పద్మ, మీనా, డ్రైవర్‌ యాకూబ్‌పాషా అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం గురించి తెలు సుకున్న ఏసీపీ నరేశ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌నాయక్, ఎస్సైలు రాజేశ్‌రెడ్డి, కృష్ణవేణి, రాజన్‌బాబు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం పోలీసులు మృతదేహాలను ఎం జీఎం మార్చురీకి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌నాయక్‌ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఆ వాహనాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఏసీపీ నరేశ్‌కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు