అప్పులు తెచ్చిన తిప్పలు.. మహిళ బతికుండగానే ‘చంపేశాడు’

26 Jul, 2021 10:40 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీఐ లక్ష్మి రెడ్డి, చిత్రంలో నిందితుడు రాఘవేందర్‌రెడ్డి

ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అడ్డదారులు

మహిళ చనిపోయిందంటూ రైతు బీమా స్వాహా

వివరాలు వెల్లడించిన సీఐ లక్ష్మిరెడ్డి

సాక్షి, పరిగి: తాను చేసిన అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు బతికుండగానే ఓ మహిళా రైతు చనిపోయినట్లు దస్తావేజులు సృష్టించాడో ప్రబుద్ధుడు. బాధిత మహిళ కుటుంబ సభ్యుల అమాయకత్వం,నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఆమె పేరున వచ్చిన రైతు బీమా డబ్బులు కాజేశాడు. కుల్కచర్ల మండలంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రతిపక్షాలు, దళిత, ప్రజాసంఘాల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు సదరు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివారం పరిగి సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లక్ష్మిరెడ్డి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టాపహాడ్‌కు చెందిన రాఘవేందర్‌రెడ్డి (45) గ్రామంలో వ్యవసాయం చేయటంతో పాటు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాగా ఇటీవలి కాలంలో అతనికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈజీగా డబ్బులు సంపాదించి ఇబ్బందుల నుంచి గట్టెక్కాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. బతికుండగానే చంద్రమ్మ అనే మహిళ చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి ఆమె పేరున వచ్చిన రైతుబీమా డబ్బులు కాజేశాడు.  

బాధితురాలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని..
అదే గ్రామానికి చెందిన ఎనుగొండ చంద్రమ్మ రాఘవేందర్‌రెడ్డి ఇంట్లో చాలాకాలంగా పనిచేస్తూ వస్తుంది. ఆమె కుమారుడు బాలయ్య కూడా నిరక్షరాశ్యుడు. చంద్రమ్మకు ప్రస్తుతం 57 సంవత్సరాలు ఉండటంతో మరో ఏడాదిలో ఆమెకు రైతు బీమా వర్తించకుండా పోతుంది. దీంతో ఆమె బీమాను రెన్యువల్‌ చేయాల్సిన అవసరం కూడా ఉండదని భావించిన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ రాఘవేందర్‌రెడ్డి పక్కా ప్లాన్‌తో ఆమె పేరున రైతు బీమా కాజేశాడు. 

ఫోర్జరీ సంతకాలతో సర్టిఫికెట్‌ తయారీ.. 
బీమా డబ్బులు రావాలంటే బాధితురాలు చంద్రమ్మ చనిపోయినట్టుగా నిరూపించే డెత్‌ సర్టిఫికెట్‌ అవసరమని గుర్తించిన నిందితుడు సర్టిఫికెట్‌ కోసం మహబూబ్‌నగర్‌కు వెళ్లి గ్రామ పంచాయతీ ముద్రలు కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. వాటితో సర్టిఫికెట్‌ తయారు చేసి సంతకాలు ఫోర్జరీ చేశాడు.  సదరు మహళ కుటుంబ సభ్యులు నిందితుడి ఇంట్లో పనిచేసే వ్యక్తులే కావటంతో ఏదో అవసరం ఉందని నమ్మించి వారి నుంచి ఆధార్‌ కార్డులు తెప్పించుకున్నాడు.
అనంతరం అన్ని వివరాలతో రైతు బీమా పోర్టల్‌లో అన్ని పత్రాలు అప్‌లోడ్‌ చేసి రైతు బీమాకు దరఖాస్తు చేశాడు. అనంతరం ఫిజికల్‌గా విచారణ చేయాల్సిన ఏఈఓ సత్తార్‌.. రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ అయిన రాఘవేందర్‌రెడ్డికే ఫోన్‌చేసి చంద్రమ్మ మృతి విషయమై విచారణ చేశాడు. అతను చంద్రమ్మ మృతి చెందిన విషయం వాస్తవమే అని తెలపటంతో ఏఈఓ విచారణ సర్టిఫికెట్‌ కూడా అప్లోడ్‌ చేశాడు.  

నగదు జమవ్వగానే.. 
కొద్దిరోజుల తర్వాత చంద్రమ్మకు నామినీగా ఉన్న ఆమె కుమారుడు బాలయ్య బ్యాంకు ఖాతాలో రైతుబీమా నగదు జమయ్యాయి. విషయం తెలుసుకున్న రాఘవేందర్‌రెడ్డి తాను ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులు నీ ఖాతాలో వేయించానని బాలయ్యను నమ్మించి రూ.5 లక్షల బీమా డబ్బులు బాలయ్య ఖాతా నుంచి తన స్నేహితుడైన మధు ఖాతాలో దఫదఫాలుగా వేయించుకుని తన ఆర్థిక అవసరాలు తీర్చుకున్నాడు. 

రైతుబంధు రాకపోవటంతో.. 
అయితే చంద్రమ్మ మృతి చెందినట్లు సర్టిఫికెట్లు సృష్టించి బీమా డబ్బులు నొక్కేయటంతో ఈ ఏడాది ఆమె ఖాతాలో పడాల్సిన రైతు బంధు డబ్బులు జమకాలేదు. దీంతో ఆమె కుమారుడు బాలయ్య రైతుబంధు డబ్బుల విషయమై రాఘవేందర్‌రెడ్డిని అడిగాడు. పలుమార్లు అడిగినా అతను స్పందించకపోవటంతో వేరే వారికి చెప్పి వ్యవసాయ శాఖ కార్యాలయంలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ విషయమై రెండు, మూడు రోజులుగా ప్రతిపక్షాలు, దళిత, ప్రజాసంఘాలు ఆందోళన బాటపట్టాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈఓ సత్తార్‌పై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు పోలీసులు లేఖ రాశారు. నిందితుడి స్నేహితుడి ఖాతాలో ప్రస్తుతం రూ.80వేలు ఉండగా అవి సీజ్‌ చేయాలని బ్యాంకు అధికారులకు కూడా లేఖ రాశారు. కుల్కచర్ల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, పరిగి ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తదితరులు విలేకరుల సమావేశంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు