రక్తమోడిన రోడ్లు

20 Oct, 2021 05:10 IST|Sakshi
ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కారు

రెండు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

ముగ్గురికి గాయాలు

కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఘటనలు

ఆళ్లగడ్డ/కావలి:  కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని జాతీయ రహదారి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.  వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా శిరివెళ్లకు చెందిన ముల్లా అబ్దుల్‌కలాం (31), అఫ్జల్‌ (19) సెంట్రింగ్‌ పని నిమిత్తం సోమవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు వెళ్లారు. మిలాద్‌ ఉన్‌నబీ పర్వదినం జరుపుకునేందుకు మంగళవారం ఉదయం సొంత గ్రామానికి మోటార్‌ సైకిల్‌పై బయలు దేరారు.

ఆళ్లగడ్డ శివారులోకి వచ్చేసరికి వారి గ్రామానికే చెందిన మిత్రులు ఉసేన్‌బాషా ఉరఫ్‌ జాబిర్‌(20), సులేమాన్‌ శిరివెళ్ల వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. మోటార్‌ సైకిల్‌ ఆపి వారితో మాట్లాడుతుండగా నంద్యాల వైపు నుంచి చాగలమర్రి వెళ్తున్న కారు ముందు టైరు పగిలి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టి రోడ్డు పక్కనున్న వారిపై పడింది. ఈ ఘటనలో అబ్దుల్‌ కలాం, అఫ్జల్, ఉసేన్‌బాషా అక్కడికక్కడే మృ త్యువాత పడ్డారు. సులేమాన్‌ తీవ్రంగా గాయప డగా కర్నూలు వైద్యశాలకు తరలించారు. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి..
తిరుపతి నగరం పద్మావతీ పురం కేఆర్‌ నగర్‌కు చెందిన తనమాల రవి, ఆయన భార్య భార్గవీలత (45), ఆయన తల్లి రాజేశ్వరమ్మ (65), వారి బంధువు ఇరగల వెంకటరమణయ్య (65), బంధువుల చిన్నారి సాయి కలసి కారులో ప్రకాశం జిల్లా ఉలవపాడులో జరిగిన వివాహానికి హాజరయ్యారు. శుభకార్యం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. కారును రవి నడుపుతున్నారు.

కావలి పట్టణంలోని ముసునూరు వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్‌ లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొంది. కారు కంటైనర్‌ కిందభాగంలో ఇరుక్కుపోయి నుజ్జునుజ్జు అయ్యింది. కారులో వెనుక సీట్లో కూర్చొని ఉన్న భార్గవీలత, రాజేశ్వరమ్మ, ముందు సీట్లో కూర్చొని ఉన్న వెంకటరమణయ్య అక్కడికక్కడే మరణించారు. రవి, ముందు సీట్లో కూర్చుని ఉన్న సాయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కావలి రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు