క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి 

11 Aug, 2022 13:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడుతూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపిన మేరకు.. గుజరాత్‌ రాజ్‌కోట్‌ ప్రాంతానికి చెందిన తుషార్‌ అమ్రా బెడ్వా(32), పూజా బెడ్వా భార్యభర్తలు. వీరికి 18 నెలల క్రితం వివాహం జరిగింది. నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో తుషార్‌కు ఉద్యోగం రావడంతో నగరానికి వలస వచ్చాడు. బండ్లగూడ జాగీరు ప్రాంతంలోని రాయల్‌ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం పూజా ఏడు నెలల గర్బిణి.

మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుషార్‌ స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లాడు. ప్రతి రోజు క్రికెట్‌ ఆడి రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేవాడు. 8 గంటలైనా రాకపోవడంతో భార్య పూజా తుషార్‌ సెల్‌ఫోన్‌కు ఫోన్‌చేయడంతో స్నేహితులు ఫోన్‌ లిఫ్ట్‌ చేశాడు. క్రికెట్‌ ఆడుతూ తుషార్‌ కిందపడ్డాడని దీంతో తాము స్థానికంగా ఉన్న రినోవా ఆసుపత్రికి తీసుకు వచ్చామని వెల్లడించారు. హుటాహుటిన పూజా ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్లు వెల్లడించారు.

దీంతో విషయాన్ని రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం తుషార్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు మృతదేహానికి రాజ్‌కోట్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   
చదవండి: పెళ్లి మండపంలోకి ప్రియురాలి ప్రవేశం.. తాళి కట్టే సమాయానికి

మరిన్ని వార్తలు