కన్నతల్లిని హతమార్చిన కసాయి కొడుకు 

13 Sep, 2020 07:54 IST|Sakshi

రొంపిచర్ల(నరసరావుపేట): ఆస్తి వ్యవహారంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని అన్నవరంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన కుందేటి తిరుపతమ్మ(85)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె భర్త వెంకయ్య 20 ఏళ్ల కిందట మృతి చెందాడు. తిరుపతమ్మ పేరుతో నాలుగు ఎకరాల పంట భూమి ఉంది. వృద్ధాప్యంలో ఆమె బాగోగులు చూసిన వారికి ఒకరికి ఎకరం పొలం అదనంగా రాసి ఇచ్చేటట్లు గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం చిన్న కుమారుడు కుందేటి ఏడుకొండలు ఆమె బాగోగులు, పోషణ చూస్తున్నాడు.

కొద్ది నెలల కిందట తిరుపతమ్మ పెద్ద కుమారుడు ఆంజనేయులు భార్య మృతి చెందింది. అప్పటి నుంచి వృద్ధాప్యంలో ఉన్న తిరుపతమ్మ ఆలనా పాలనా విషయంలో చిన్న కొడుకు కొంత అశ్రద్ధ చూపుతున్నాడు. ఈ తరుణంలో పెద్ద కుమారుడికి భార్య లేకపోవడంతో ఆంజనేయులు దగ్గరకు వెళ్లాలని తిరుపతమ్మ నిర్ణయించుకుంది. తిరుపతమ్మ ఆలోచనను పసిగట్టిన చిన్న కుమారుడు ఏడుకొండలు తన తల్లి అన్న దగ్గరకు వెళ్లితే ఆమె పొలం తనకు దక్కదని నిర్ణయించుకొని కొద్దిరోజులుగా గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో మద్యం తాగి మత్తులో తల్లితో వాదనకు దిగి కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు తిరుపతమ్మను చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల పోలీసులు అన్నవరం చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.  ఏడుకొండలును అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తిరుపతమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు