‘ట్రైనీ ఎస్‌ఐ’పై ఎస్‌ఐ లైంగికదాడి!

4 Aug, 2021 01:46 IST|Sakshi
నిందితుడు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)

విచారణకు ఆదేశించిన వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి 

కుటుంబ సభ్యులతో కలసి ఫిర్యాదు చేసిన ట్రైనీ ఎస్‌ఐ 

ఎస్‌ఐని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ నాగిరెడ్డి

సాక్షి, వరంగల్‌ క్రైం/మరిపెడ/మహబూబాబాద్‌ రూరల్‌: ఆమె ట్రైనీ ఎస్‌ఐ.. స్టేషన్‌కు వచ్చి 15 రోజులే అయ్యింది. వచ్చిన నాటి నుంచే ఆమెపై ఆ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కన్నేశాడు. చివరగా లైంగికదాడికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో వరంగల్‌ సీపీని కలసి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన ఉన్నతాధికారులు సదరు ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా, పోలీస్‌శాఖలో ప్రకంపనలు సృష్టించింది. ట్రైనీ ఎస్‌ఐ ఫిర్యాదు ఆధారంగా వివరాలిలా ఉన్నాయి.

శిక్షణలో భాగంగా మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు 15 రోజుల క్రితం మరిపెడ స్టేషన్‌కు వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సోమవారం అర్ధరాత్రి పెద్దమొత్తంలో నల్లబెల్లం ఉన్నట్లు సమాచారం వచ్చిందని శ్రీనివాస్‌రెడ్డి సదరు ట్రైనీ ఎస్‌ఐని వెంటబెట్టుకుని వెళ్లాడు. నిర్జన ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఆమెను బలవంతం చేశాడు.

కాగా, ఆమె శరీరంపై భౌతికగాయాలు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ప్రభుత్వం ఎస్‌హెచ్‌ఓకు కేటాయించిన వాహనం నడపడానికి డ్రైవర్‌ ఉంటాడు. కానీ.. అర్ధరాత్రి మారుమూల ప్రాంతంలో నల్లబెల్లం ఉందని, శ్రీనివాసరెడ్డి.. ట్రైనీ ఎస్‌ఐని మాత్రమే వెంటబెట్టుకొని వెళ్లినట్లు సమాచారం. ఇతర సిబ్బంది ఉన్నా తీసుకెళ్లలేదు. ఇది పక్కా పథకం ప్రకారం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్పందించని అధికారులు.. 
శ్రీనివాసరెడ్డి తీరును ఆ ట్రైనీ ఎస్‌ఐ మహబూబాబాద్‌ పోలీస్‌ అధికారులకు విన్నవించుకున్నట్లు సమాచారం. వారు ఆమె విజ్ఞప్తికి స్పందించకపోగా ‘నీకు ఉజ్వల భవిష్యత్‌ ఉంది. ఇలాంటి ఫిర్యాదులు ఉద్యోగంలో పనికిరావు. సర్దుకుపోవాలి’ అని చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె ఉద్యోగం వద్దనుకొని తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు వివరించి.. వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషిని కలసి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ నార్త్‌జోన్‌ ఐజీ, వరంగల్‌ ఇన్‌చార్జ్‌ డీఐజీ నాగిరెడ్డి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సంఘటనపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామని సీపీ జోషి పేర్కొన్నారు. విచారణలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఇదిలా ఉండగా ట్రైనీ ఎస్‌ఐ ఎస్సీ కావడంతో శ్రీనివాస్‌ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లల కింద కేసు నమోదైంది. ఎస్‌ఐని మహబూబాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు