స్విమ్స్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో గోడ కూలి మహిళ మృతి 

5 Oct, 2020 07:08 IST|Sakshi

ఇద్దరు కరోనా బాధితులకు గాయాలు

సాక్షి, చిత్తూరు: తిరుపతి స్విమ్స్‌ శ్రీ పద్మావతి స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్‌, మొదటి అంతస్తును కరోనా వార్డుగా వినియోగిస్తున్నారు. పై మూడంతస్తుల నిర్మాణం పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 10.10 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలి విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా వర్కర్‌ రాధిక(37)పై పడింది. అలాగే, కరోనా బారిన పడి చికిత్స కోసం ఆస్పతిలోకి ప్రవేశిస్తున్న మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పెద్ద పెట్టున గోడకూలిన శబ్దానికి సిబ్బంది, కరోనా బాధితులు హడలిపోయారు.

తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న రాధికను అంబులెన్స్‌లో స్విమ్స్‌ అత్యవసర విభాగానికి తరలించగా అప్పటికే మృతిచెందారు. విషయం తెలుసుకున్న మెడికల్‌ సూపరింటెండెంట్ డాక్టర్‌ రామ్‌ ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వారికి కరోనా వార్డులోనే చికిత్స చేస్తున్నారు. గోడ కూలిన ఘటన స్థలాన్ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వీరబ్రహ్మం పరిశీలించారు. గోడ కూలడానికి గల కారణలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులు, వారి కుటంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు