బ్రాండ్‌ మీది.. ప్రమోషన్‌ మాది

5 Oct, 2020 07:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యాపారం, ప్రొడక్ట్స్, సంస్థలు, స్టార్టప్‌ కంపెనీలు, సరికొత్త డిజైన్స్‌ ఇలా ఏదైనా సరే మార్కెట్‌లో ఓ ‘బ్రాండ్‌ ’గా స్థిరపడాలనుకుంటాయి.. దానికి నాణ్యత, ట్రెండ్‌ని సెట్‌ చేసే లక్షణాలు ఉంటే సరిపోదు. అది జనాలకు చేరాలి.. మెరుగైన ప్రచారం కల్పించాలి. దానికి అనువైన మార్గం డిజిటల్‌ మార్కెటింగ్‌. అయితే ఒకప్పుడు నగరంలో బ్రాండ్‌ ప్రమోషన్‌కి బెంగళూర్, నోయిడా తదితర ప్రాంతాలకు చెందిన ఆన్‌లైన్‌ ప్రమోటర్స్‌ని ఆశ్రయించేవారు. ప్రస్తుతం నగరవాసులు కూడా సోషల్‌ మీడియా, డిజిటల్‌ మార్కెటింగ్‌లో రాణిస్తున్నారు. అందులో భాగంగా బ్రాండ్‌ ప్రమోషన్‌లో కొత్త ట్రెండ్స్‌ సెట్‌ చేస్తూ ముందుకు వెళ్తోంది ‘వీ ఆర్‌ వెరీ.ఇన్‌’..

టెక్నాలజీ పెరిగాక ప్రచార మాద్యమాలు కూడా కొత్త పుంతలు తొక్కాయి. ప్రస్తుతం షాపింగ్‌ మొదలు చదువుల వరకు అన్నీ ఆన్‌లైన్‌ పరమయ్యాయి. కొత్త డిజైన్‌ వేర్స్‌ నుంచి వస్తువుల నాణ్యత వరకు ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు, కొత్త స్టార్టప్‌లు, ఫ్యాషన్, విద్య, వైద్యం, వినోదం.. అందరూ బ్రాండ్‌ మార్కెటింగ్‌కి జై అంటున్నారు. దీని కోసం నగరంలో కొన్ని సంవత్సరాలుగా వేలకు పైగా ప్రమోటర్స్‌ పుట్టుకొచ్చారు. ఆన్‌లైన్, సోషల్‌ మీడియా వేదికగా వీరిదే హవా అంతా.. యాడ్స్, అడ్వర్టైజ్‌మెంట్, సోషల్‌మీడియా ప్రమోషన్, డిజిటల్‌ మార్కెటింగ్‌ ఇలా ఎన్నో మార్గాల ద్వారా బ్రాండ్‌లను పాపులర్‌ చేస్తుంటారు. ఈ రంగంలో రాణించాలంటే అన్ని రకాల సామాజిక, సాంకేతిక మూలాలపై అవగాహన, కాలానుగుణమైన హంగులను అలవర్చుకునే నేర్పు అతి ముఖ్యం. దీని ఆవశ్యకత తెలుసుకున్నాక నగరవాసులు కూడా ఈ మాద్యమంపై ఆసక్తి చూపిస్తున్నారు. 

వీ ఆర్‌ క్రియేటివ్‌.. 
ఈ క్రమంలో నగరానికి చెందిన సాయి బత్తిన, చైతన్య కొదుమూరి అనే యువకులు వినూత్న ఆలోచనలతో ‘వి ఆర్‌ వెరీ.ఇన్‌’ బ్రాండింగ్‌ ప్రమోషన్‌ ప్రారంభించారు. మొదలుపెట్టిన అతితక్కువ కాలానికే మార్కెట్‌లో వీరి ఐడియాలజీకి మంచి మార్కులు పడుతున్నాయి. ప్రమోషన్‌ విధానంలోని నూతన పంథా, ఈ–మెయిల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సోషల్‌మీడియా యాప్స్‌లలో క్రియేటివ్‌ ప్రమోషన్స్‌తో బ్రాండ్‌గా మారాలనుకునే వారిని ఆకర్శిస్తున్నారు. ఇప్పటి వరకు లెనిన్‌ హౌస్, ఫ్లై యువర్‌ డ్రీమ్స్, నవ అగ్రీటెక్‌లాంటి వాటికి బ్రాండింగ్‌ ప్రమోషన్‌ చేస్తూనే కొత్త స్టార్టప్‌లకు, పొలిటికల్, సెలబ్రిటీల పాపులారిటీ పెంచే ప్రమోషన్లకి, వెబ్‌ డిజైనింగ్‌కి పని చేస్తున్నారు. ఫ్యాషన్‌ డిజైనింగ్, వ్యాపారం, హెల్త్‌ సర్వీసెస్, అబ్రాడ్‌ ఎడ్యుకేషన్, సామాజిక అవగాహన, ఫొటోగ్రఫీ, సామాజిక సేవ ఇలా విభిన్న రంగాలపై బ్రాండ్‌ ప్రమోషన్‌ చేయడం వీరి ప్రత్యేకత. కొత్త తరహాలో రాజకీయ నాయకులకు కూడా వ్యక్తిగత బ్రాండ్‌ ప్రమోషన్‌ చేస్తున్నారు. ఇందులో సాయి బత్తిన, చైతన్య కొదుమూరితో పాటు మరికొందరు మిత్రులు 30 మంది ఫ్రీలాన్సర్‌లు పని చేస్తున్నారు.  

‘సోషల్‌’  సేవ.. 
‘విఆర్‌ వెరీ.ఇన్‌’ బ్రాండ్‌ ప్రమోషన్‌తో పాటు సామాజిక సేవనూ ప్రోత్సహిస్తున్నారు. ప్రాడక్ట్‌ సేల్స్‌పై వచ్చే నికర లాభంలో కొంత సామాజిక సేవకు కేటాయించేలా కంపెనీలను ఒప్పించి వారి నాణ్యత, మన్నిక తదితర అంశాలతో పాటు ఈ విషయానికి ప్రమోషన్స్‌లో ప్రాధాన్యం ఇవ్వడంతో సేల్స్‌ పెరగడమేకాకుండా సామాజిక సేవకూ వారధులుగా నిలుస్తున్నారు. ఓ ’చిరిగిన చొక్కానైనా వేసుకో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో‘ అనే నానుడి ఆధారంగా ’ఓ మంచి చొక్కా కొనుక్కో.. ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వు‘ అంటూ ఓ క్లాతింగ్‌ బ్రాండ్‌కి వినూత్నంగా ప్రమోషన్‌ చేశారు. ఆ బ్రాండ్‌ వస్త్రాల లాభం నుంచి నిరుపేద బాలలకు నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. స్వతాహా వీరిరువురు మంచి రైటర్స్‌ కావడంతో విఆర్‌ వెరీ.ఇన్‌ పేజ్‌ ద్వారా సామాజిక అంశాలపై అవగాహన పెంచేలా ఆర్టికల్స్‌ షేర్‌ చేస్తుంటారు. మహిళల రక్షణ, ఆరోగ్యం, సామాజిక సమస్యలకు చెందిన అంశాలపై తమ ఆర్టికల్స్‌తో అవేర్‌నెస్‌ పెంచుతున్నారు. అంతేకాకుండా వీరి పేజ్‌కి ఎన్ని లైక్స్, షేర్స్‌ వస్తే అన్ని రూపాయలను నిరుపేద విద్యార్థుల చదువులకు సహాయంగా అందిస్తున్నారు.   

సినిమా కోసం వచ్చి.. 
నిజానికి సాయి బత్తిన, చైతన్య కొదుమూరి సినిమాపై ప్రేమతో వచ్చినవారే.. అక్కడే వీరి స్నేహం చిగురించింది. ఇంకా సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే షార్ట్‌ ఫిల్మ్‌లకు కూడా ఓ వేదిక ఉండాలని ప్రైమ్‌షో.ఇన్‌ ప్రారంభించారు. దీన్ని కూడా ఒటీటీ వేదికలా మార్చి షార్ట్‌ ఫిల్మ్‌కి ఆసరాగా నిలుస్తున్నారు. వీరికున్న సినిమా పరిచయాలను బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగం చేసి వీరి డిజిటల్‌ మార్కెటింగ్‌ను జనాలకు మరింత చేరువ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు