విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే' | Sakshi
Sakshi News home page

విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే'

Published Mon, Oct 5 2020 7:04 AM

Dronamraju Srinivas Passed Away - Sakshi

నిస్వార్థ ప్రజా నాయకుడిని కోల్పోయిన విశాఖ శోకసంద్రంలో మునిగిపోయింది. సమున్నత విలువలకు చిరునామాగా బతికిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఇక లేరన్న చేదు నిజం నగర ప్రజల గుండెల్ని పిండేస్తోంది. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే నేత అర్ధంతరంగా కన్నుమూయడం అందరి మదిలో విషాదం నింపింది.

ఉత్తరాంధ్ర రాజకీయ చాణుక్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు వీఎంఆర్డీఏ తొలి చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఇక లేరనే వార్త అందరినీ కలచివేసింది. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పిలిచే ఆ పిలుపు మూగబోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఆరిలోవ ప్రాంతం హెల్త్‌సిటీలోని పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు.  

జీవితంలో ఎన్నో అడ్డంకులెదురవుతాయి. అవరోధాలు పరీక్ష పెడతాయి. కొందరు సందర్భానుసారం దారి మార్చుకుంటారు. కొద్దిమంది మాత్రం నిర్భయంగా ముందుకు పోతారు.. ఆయన ఆ బాటనే ఎంచుకున్నారు. అందుకే జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. పదవిలో ఉన్నా.. పదవీచ్యుతుడైనా.. ప్రజలతో మమేకమై.. అదే ఆప్యాయత పంచుతూ అందరి మన్ననలు పొందారు. ప్రజల మనిషిగా సేవలందించిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ విశాఖ వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. విద్యార్థి దశ నుంచే ఎన్నో పదవులు అలంకరించి, ప్రజల తరఫున పోరాటాలు చేసి అందరి ప్రశంసలు పొందారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చినా.. తనదైన రాజకీయంతో నగర ప్రజల హృదిలో రాజుగా నిలిచారు. ఆయన మరణం.. ఉత్తరాంధ్రకు తీరని లోటని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నిబద్ధత గల నాయకుడు..
ద్రోణంరాజు శ్రీనివాస్‌ మరణవార్త విన్నాక బాధని వ్యక్తపరిచేందుకు మాటలు రావడం లేదు. ఆయన తండ్రి వారసత్వంతోపాటు నిబద్ధత గల నాయకుడిగా రాజకీయ విలువల్ని కొనసాగించారు. ద్రోణంరాజు మృతి పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రజలకు తీరనిలోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఈ విపత్కర పరీక్ష సమాయాన్ని ఎదుర్కొనేలా ద్రోణంరాజు కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.     – విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు


కుటుంబ సభ్యులతో

తండ్రి, తనయుడు తొలి చైర్మన్లు
ద్రోణంరాజు తండ్రీ తనయులు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వుడా) ఆవిర్భావం తర్వాత తొలి చైర్మన్‌గా 1979లో ద్రోణంరాజు సత్యనారాయణ నియమితులయ్యారు. ఆ సమయంలో విశాఖ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అనంతరం వుడా పరిధి పెరిగి వీఎంఆర్‌డీఏగా రూపాంతరం చెందింది. 5 జిల్లాలకు విస్తరించిన వీఎంఆర్‌డీఏ తొలి చైర్మన్‌ పదవిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్రోణంరాజు శ్రీనివాస్‌కు అప్పగించారు. ఇలా.. వుడా, వీఎంఆర్‌డీఏలకు తండ్రీ కొడుకులు తొలి చైర్మన్లుగా నియమితులై రికార్డు సృష్టించారు.  (ద్రోణంరాజు శ్రీనివాస్‌ మృతిపై ముఖ్యమంత్రి జగన్‌ విచారం)

వీఎంఆర్డీఏ తొలి చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ప్రతి కుటుంబం సుపరిచయమే. కార్యకర్తలనే కాదు.. వార్డు పర్యటనకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించి అక్కున చేర్చుకునేవారు. అటువంటి వ్యక్తి దూరం కావడంతో విశాఖ నగర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు దశాబ్దాల పాటు ఉత్తరాంధ్ర రాజకీయాన్ని ప్రభావితం చేసిన ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడిగా వచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్‌.. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు.  

గ్రామ కరణంగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి.. ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ తనయుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌. ద్రోణంరాజు శ్రీనివాస్‌ 1961 ఫిబ్రవరి ఒకటిన జన్మించారు. తండ్రిని రాజకీయ గురువుగా భావిస్తూ.. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 1980–81లో డాక్టర్‌ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో చదువుతున్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించి, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడయ్యారు. శ్రీనివాస్‌ న్యాయ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఆయన అనేక రాజకీయ పదవులు నిర్వహించారు.

1994లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని.. పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2001 నుంచి 2006 వరకు విశాఖ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యేగా ఉన్న తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ మరణించడంతో 2006లో విశాఖ ఒకటో నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ద్రోణంరాజు శ్రీనివాస్‌ ప్రభుత్వ విప్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా పనిచేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌లో అనేక కీలక పదవులు చేపట్టారు. 

వైఎస్సార్‌ కుటుంబంతో అనుబంధం 

ద్రోణంరాజు కుటుంబానికి.. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. 2006లో తండ్రి మరణానంతరం ద్రోణంరాజుకు టికెట్‌ ఇచ్చి.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సహించారు. 2009లో జరిగిన ఎన్నికల్లోనూ దక్షిణ నియోజకవర్గం టికెట్‌కు పోటీ ఉన్నప్పటికీ.. ద్రోణంరాజుపై నమ్మకం ఉంచి.. వైఎస్సార్‌ టికెట్‌ ఇచ్చి.. గెలిపించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు.. రాజకీయ పునర్జన్మనిచ్చారు వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరిన ద్రోణంరాజుకు దక్షిణ నియోజకవర్గం టికెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా కీలక పదవిని అప్పగించి ప్రోత్సహించారు. 

ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్న నాయకుడు 
తండ్రి సత్యనారాయణకు ఉన్నంత రాజకీయ చతురత, దుందుడుకు స్వభావం శ్రీనివాస్‌కు లేకపోయినా.. ప్రజల నాయకుడిగా మన్ననలు పొందారు. గెలిచినా, ఓడిపోయినా.. ప్రజలతో అదే తీరుగా వ్యవహరిస్తూ.. నిస్వార్థంగా సేవలందించారు. ప్రతి నిమిషం అందుబాటులో ఉంటూ ప్రజలకు చేరువయ్యారు. తండ్రి పేరును నిలబెట్టిన వారసుడిగా పేరు సంపాదించుకున్నారు. రెండు మార్లు ఎమ్మెల్యేగా, వివిధ కీలక పదవులు అలంకరించినా.. అవినీతి మరక అంటకుండా.. సేవలందించడం శ్రీనివాస్‌కు పేరు సంపాదించి పెట్టింది.  

ఆస్పత్రి వద్దకు అభిమానులు 
ఆరిలోవ: వీఎంఆర్డీఏ తొలి చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ హెల్త్‌సిటీలోని పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆగస్టు 29వ తేదీ రాత్రి పినాకిల్‌లో చికిత్స కోసం చేరారు. కొద్ది రోజుల తర్వాత కరోనా తగ్గి .. నెగిటివ్‌ వచ్చింది. అయితే కిడ్నీల సమస్య ఉండటంతో వైద్యం కొనసాగించారు. రెండు రోజుల కిందట ఆయన ఆరోగ్యం విషమించింది. ఆదివారం మధ్యాహ్నం ఆయన చివరి శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త వినగానే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు ఆరిలోవ, పెందుర్తి, నగరంలో పలు ప్రాంతాల నుంచి అభిమానులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
 
వైఎస్సార్‌ సీపీ నగర కార్యాలయంలో ద్రోణంరాజు శ్రీనివాస్‌ చిత్ర పటం వద్ద మౌనం పాటిస్తున్న  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్, అదీప్‌రాజ్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌
మంత్రి ముత్తంశెట్టి ఆరా 
ద్రోణంరాజు శ్రీనివాస్‌ చికిత్స పొందుతున్న పినాకిల్‌ ఆస్పత్రికి ఆదివారం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వచ్చారు. ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, ఆయన కుమారుడు శ్రీవాత్సవ్‌తో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఆరోగ్యం విషమించిందని, గంటల వ్యవ«ధి కంటే ఎక్కువ సమయం బతికే అవకాశం లేదని వైద్యులు మంత్రికి చెప్పారు. ఆయన కిడ్నీలు పాడవడంతో పాటు బ్రెయిన్‌ ఫంక్షనింగ్‌ నిలిచిపోయిందని, వైద్యానికి ఆయన శరీరం సహకరించడంలేదని వారు వివరించారు. దీంతో మంత్రి విచారం వ్యక్తం చేశారు. అనంతరం రెండు గంటల్లోనే ద్రోణంరాజు చనిపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement