నీ అంతు చూస్తా.. టీడీపీ నాయకుడి వీరంగం 

2 Jul, 2021 10:22 IST|Sakshi
ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకి ఫిర్యాదు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు  

సర్వసభ్య సమావేశంలో టీడీపీ నాయకుడి వీరంగం

చంపుతానంటూ పంచాయతీ కార్యదర్శికి బెదిరింపు  

ఎన్‌పీకుంట(అనంతపురం): మండలంలోని పి.కొత్తపల్లి పంచాయతీ సర్వసభ్య సమావేశంలో టీడీపీ నాయకుడు వీరంగం సృష్టించాడు. ఏకంగా పంచాయతీ కార్యదర్శిని చంపుతానని బెదిరించాడు. ఘటనకు సంబంధించి మన స్థాపం చెందిన పంచాయతీ కార్యదర్శులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు... పి.కొత్తపల్లి పంచాయతీ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని అల్లుగుంటివారిపల్లిలో ఇంటింటికీ కొళ్లాయి కనెక్షన్లు, ఫెర్రర్‌ కాలనీలో వేసిన సీసీ రోడ్లు, మల్లెంవారిపల్లి, హరిజనవాడలో తాగునీటి పథకం మోటారు మరమ్మతు పనులు, బ్లీచింగ్, శానిటేషన్‌ తదితర పనులపై రూపొందించిన తీర్మానంపై ఓటింగ్‌ చేపట్టారు.

పది మంది సభ్యులు ఉన్న ఈ పంచాయతీలో సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు టీడీపీ మద్దతుదారులు ఉండగా, మరో ఆరుగురు సభ్యులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆరుగురు సభ్యులు సీసీ రోడ్లు, కొళాయి కనెక్షన్లకు ఆమోదం తెలిపారు. మిగిలిన పనులకు ఆమోదం తెలపకపోవడంతో తీర్మానం వీగిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేనని సర్పంచ్‌ మల్లెం చంద్రకళ బావ, స్థానిక టీడీపీ నేత శ్రీరాములు నాయుడు, బంధువు భాస్కరనాయుడు సభ మధ్యలో ప్రవేశించి గందరగోళం సృష్టించారు. పంచాయతీ కార్యదర్శి హరీష్‌ని దుర్భాషలాడుతూ అంతు చూస్తానని బెదిరించాడు.

కేసు నమోదు:
ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం కాక, చంపుతానంటూ బెదిరించిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ శ్రీరాములు నాయుడు తీరును ఖండిస్తూ పి.కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి హరీష్‌తో కలిసి పలువురు కార్యదర్శులు గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎస్‌ఐ వెంకటేశ్వర్లు శ్రీరాములునాయుడిపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు