షాకింగ్‌ వీడియో.. కారులో బర్గర్‌ తింటున్న యువకుడిపై పోలీసు కాల్పులు

8 Oct, 2022 14:48 IST|Sakshi

వాషింగ్టన్‌: కారులో కూర్చుని బర్గర్‌ తినటమే ఆ యువకుడు చేసిన నేరం. అదీ నడి రోడ్డుపై కాదు, పార్కింగ్‌ ప్రాంతంలోనే కారు నిలిపి ఉంచాడు. బర్గర్‌ తింటున్న యువకుడిపై ఓ పోలీసు అధికారి పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. పోలీసు ఇష్టారీతిన కాల్పులు జరుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన అమెరికాలోని సాన్ ఆంటోనియా ప్రాంతంలో జరిగింది. వీడియో వైరల్‌ కావటంపై సదరు పోలీసు అధికారే షాక్‌కు గురైనట్లు స్థానిక మీడియా తెలిపారు. 

ఆదివారం సాయంత్రం ఎరిక్‌ చాంటు(17) అనే యువకుడు మెక్‌డొనాల్డ్స్‌ పార్కింగ్‌ ప్రాంతంలో కారులో కూర్చుని బర్గర్‌ తింటున్నాడు. అక్కడికి వచ్చిన సాన్‌ ఆంటోనియా పోలీసు అధికారి జేమ్స్‌ బ్రెన్నాండ్‌.. కారు డోరు తీశాడు. పార్కింగ్‌ ప్రాంతంలో తినటంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. వాహనం నుంచి కిందకు దిగాలని కోరాడు. తాను ఎందుకు దిగాలని యువకుడు ప్రశ్నించాడు. ఈ క్రమంలో అతడిని బయటకు లాగేందుకు పోలీసు ప్రయత్నించాడు. కారు డోరు తెరిచి ఉండగానే రివర్స్‌ చేశాడు బాధితుడు. ఈ క్రమంలో యువకుడిపై పోలీసు అధికారి పలు రౌండ్ల కాల్పులు జరిపాడు. కారు వేగం పెంచిన యువకుడు డోర్‌ మూసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

పోలీసు కాల్పుల్లో యువకుడు గాయపడ్డాడు. కారు వెనుక సీట్లో 17 ఏళ్ల ఓ బాలిక ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసు అధికారితో యువకుడు గొడవకు దిగాడని, పోలీసుపై దాడి చేసినట్లు తొలుత ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత పోలీసు అధికారి బాడీ క్యామ్‌ వీడియో బయటకు రావటంతో అసలు విషయం తెలిసింది. పోలీసు కాల్పుల్లో గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రాణ రక్షణ కోసం మాత్రమే తుపాకీ వాడాలనేది అక్కడి నిబంధన కాగా.. అలాంటి పరిస్థితి ఏమీ కనిపించలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఇదీ చదవండి: షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు!

మరిన్ని వార్తలు