ఎన్నాళ్లైనా ఆస్తిలో వాటా దక్కదన్న మనోవేదన.. కొడుకులతో కలిసి

9 Aug, 2021 10:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తొగుట(దుబ్బాక): కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులకు విషం తాగించి, తానూ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం  తొగుట మండలం తుక్కాపురంలో జరిగింది. స్థాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముడికె కొమురయ్య, ఎల్లవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు కిష్టయ్య, దేవరాజు ఉన్నారు.  కొమురయ్య వ్యవసాయ భూమి మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో 4 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది.

దీంతో ప్రభుత్వం అందించిన నష్టపరిహారంతో మిరుదొడ్డి మండలంలోని ధర్మారంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఎకరం తన పేరున, ఎకరం చిన్న కొడుకు దేవరాజు పేరున రిజిస్ట్రేషన్‌ చేయించారు. అలాగే సిద్దిపేట పట్టణంలోని ప్లాటు కూడా చిన్న కుమారునికి అప్పగించాడు. ఇద్దరు కుమారులకు ఆస్తి సమానంగా పంపకాలు చేయకుండా ఒక్కడికే ఇవ్వడం ఏంటని పెద్ద కుమారుడు కిష్టయ్య,  అతని భార్య అనిత అత్తమామలను నిలదీశారు. ఈ విషయమై కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. కాగా ఆస్తి విషయాన్ని గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు.

ఇద్దరు కుమారులకు సమానంగా పంపిణీ చేయాలంటూ గ్రామ పెద్దలు తీర్మానించారు. అయినా తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రాలేదు. సాగు భూమి కోల్పోవడం తనకు రావాల్సిన వాటా ఇవ్వకపోవడంతో కిష్టయ్య అప్పు చేసి ఆటో కొనుక్కుని కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం  ఉదయం అత్తాకోడళ్లు మళ్లీ తగాదా పెట్టుకున్నారు. ఎన్నాళ్లైనా ఆస్తిలో వాటా దక్కదన్న మనోవేదనకు గురైన అనిత(28) భర్త ఆటో తీసుకుని ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఇద్దరు కుమారులను ఇంట్లోకి తీసుకెళ్లి గడ్డిమందు దీక్షిత్‌ (06)కు తాగించింది. చిన్న కుమారుడు ఆర్చి(03)కి తాగించే ప్రయత్నం చేయగా బయపడి బయటకు పరుగెత్తగా తాను తాగి అపస్మారక పరిస్థితిలో పడిపోయింది. గమనించిన ఇరుగు పొరుగు వారు చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనిత పరిస్థితి విషమంగా ఉండటంతో  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీక్షిత్‌ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాబుకు ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. కాగా అనిత పరిస్థితి విషమంగానే ఉన్నట్లు బంధవులు తెలిపారు.   

మరిన్ని వార్తలు