పథకం ప్రకారమే ఎన్‌కౌంటర్‌ 

17 Nov, 2021 01:28 IST|Sakshi
 పీవీ కృష్ణమాచారి, రజిని

‘దిశ’ కేసులో పోలీసుల విచారణ అంతా కట్టుకథ 

స్టేట్‌మెంట్లను కూడా సరిగా రికార్డ్‌ చేయలేదు 

సిర్పుర్కర్‌ కమిషన్‌ ముందు మృతుల కుటుంబసభ్యుల తరపు న్యాయవాదుల వాదనలు 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ తుది అంకానికి చేరింది. 53 మంది పోలీసులు, సాక్షుల విచారణ సోమవారంతో ముగియగా, మంగళవారం నుంచి మ రికొందరు పోలీసులు, నలుగురు నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు మొదలయ్యాయి. నలుగురు మృతులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్,  చెన్నకేశవులు కుటుంబసభ్యుల తరపున న్యాయవాదు లు ఇండిపెండెంట్‌ కౌన్సిల్‌ పీవీ కృష్ణమాచారి, సహాయకురాలు రజిని  కమిషన్‌కు వాదనలు వినిపించారు.  

నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు..
ఆయుధాలతో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉం డగా నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నాలేవీ చేయలేదని న్యాయవాదులు అన్నారు. పోలీసులే పథకం ప్రకారం ఎన్‌కౌంటర్‌ చేశారని కమిషన్‌కు తెలిపారు. నిందితులకు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వ కుండా కస్టడీలోకి తీసుకొని సీన్‌–రీకన్‌స్ట్రక్షన్‌ పేరిట పని పూర్తి చేశారని పేర్కొన్నారు. నలుగురిలో ముగ్గురు నిందితులు శివ, నవీన్, చెన్నకేశవులు మైనర్లని.. వారిని పోలీసులు జువెనైల్‌ కోర్టుకు పంపించకుండా తప్పుచేశారని కృష్ణమాచారి వివరించారు.

పైగా నిందితులు మరణించింది 2019, డిసెంబర్‌ 5 ఉదయం 5 గంటలలోపేనని డెత్‌ రిపోర్ట్‌ సూచిస్తుంటే.. పోలీసులు మాత్రం ఉదయం 6:15 గంటల తర్వాత జరిగిందని అబద్ధాలు చెబుతున్నారని ఆరో పించారు. పైగా విచారణలో పాల్గొన్న పోలీసుల స్టేట్‌మెంట్లు సరిగా నమోదు చేయలేదని వివరించారు. దిశ కేసులో ముందు నుంచి అన్నీ తానై నడిపించిన అప్పటి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌.. కమిషన్‌ విచారణలో మాత్రం తనకి, ఈ కేసుకు సంబంధం లేదని వాంగ్మూలం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అడ్వొకేట్‌ రజిని కమిషన్‌కు తెలిపారు. అనంతరం జర్నలిస్ట్‌ కె.సజయ తరపు న్యాయవాది వసుధ నాగరాజు వాదనలు వినిపించారు. 

మరిన్ని వార్తలు