టెన్త్‌ విద్యార్థి బలవన్మరణం 

11 Jan, 2023 02:19 IST|Sakshi
ఆకాశ్‌

పాఠశాల ఆవరణలో చెట్టుకు ఉరేసుకున్న వైనం 

సిగరెట్‌ తాగుతున్నాడని మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడంటున్న స్కూలు వర్గాలు 

టై పెట్టుకురాకపోవడంతో స్కూళ్లో అవమానించారంటున్న కుటుంబ సభ్యులు 

నాగర్‌కర్నూల్‌ జిల్లా పొలిశెట్టిపల్లిలో ఘటన 

బల్మూర్‌: పదో తరగతి విద్యారి్థ.. చదువుతున్న స్కూళ్లోనే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలంలోని పొలిశెట్టిపల్లి జేఎంజే ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల యాజమాన్యం కథనం ప్రకారం.. అమ్రాబాద్‌ మండలం మాధవానిపల్లికి చెందిన మణెమ్మ కుమా రుడు ఆకాశ్‌(15) పదో తరగతి చదువుతూ..

పాఠశాలకు చెందిన హాస్టల్‌లోనే ఉంటున్నాడు. మంగళవారం అతను తరగతి గదిలో లేకపోవడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది పరిసరాల్లో వెతకగా.. పాఠశాల వెనక ఆవరణలో ఉన్న చెట్టుకు బోరుమోటార్‌ వైరుతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించి రక్షించడానికి ప్రయతి్నంచగా అప్పటికే మృతిచెందాడని పాఠశాల సిబ్బంది తెలిపారు. 

కుటుంబ సభ్యుల ఆందోళన
ఆకాశ్‌ మరణ వార్తను తెలుసుకున్న తల్లి మణెమ్మ, బంధువులు పాఠశాల వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. పదేళ్ల కితం తన భర్త కరెంటు షాక్‌తో చనిపోయాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న కుమా రుడు ఇప్పుడు ఇలా మృతి చెందడం తట్టుకోలేని విషాదమని ఆమె బోరున విలపించారు. కాగా,  పాఠశాలలో వసతులు సక్రమంగా లేవని, భోజనం నాణ్యతగా లేదని తమతో ఆకాశ్‌ చెప్పేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ప్రార్థన సమయంలో టై పెట్టుకుని రాకపోవడంతో తోటి విద్యార్థుల ముందు టీచర్లు మందలించి గంటపాటు నిల్చోబెట్టారని, ఆ అవమానంతోనే తమ పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. తమకు న్యాయం చేయా లని డిమాండ్‌ చేస్తూ కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్‌– అచ్చంపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అయితే విద్యార్థి చెడు వ్యసనాలకు (సిగరెట్‌ తాగడం) అలవాటుపడుతున్నాడని తల్లికి ఫోన్‌లో సమాచారం ఇచ్చామని.. ఆమె ఫోన్‌ చేసి కొడుకును మందలించడంతో మనస్తాపంతోనే ఆత్మహత్యకి పాల్పడి ఉంటాడని స్కూలు హెచ్‌ఎం సిస్టర్‌ అమూల్య తెలిపారు. రాస్తారోకోకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఏబీవీపీ, వీహెచ్‌పీ, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు