ఇంట్లో దొంగతనం.. విచారణలో అసలు నిజం తెలిసి షాకైన పోలీసులు

25 Jan, 2022 08:49 IST|Sakshi

తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీపంలోనీ ప్రైవేటు ఉద్యోగి ఇంట్లో చోరీకి యత్నించిన చెడ్డి గ్యాంగ్‌ సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణలో తాము నగదు నగలను ఎత్తుకెళ్ల లేదని చెప్పడంతో షాక్‌కు గురైన పోలీసులు ఇంటి యజమానిని పిలిచి తమదైన శైలిలో విచారణ చేపట్టి వార్నింగ్‌ ఇచ్చారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఎగువనల్లాటూరు గ్రామంలోని పల్లవన్‌ నగర్‌కు చెందిన రాజేష్‌(27). ఇతని ఇంట్లో ఈనెల 17న ఇద్దరు యువకులు చోరీకి పాల్పడి బైక్‌లో పరారయ్యారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కాశిమేడుకు చెందిన క్రిష్టోపర్‌(27), తిరునిండ్రవూర్‌కు చెందిన పార్థిబన్‌ (30) గుర్తించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఘటన జరిగిన రోజు తాము చోరికి యత్నించామని, అయితే చివరి నిమిషంలో ఇంటి యజమాని రాజేష్‌ రావడంతో అతడిపై దాడిచేసి పరారైనట్టు వివరించారు. రూ.5 లక్షల నగదు నగలను అక్కడే పడేసి వెళ్లిపోయినట్టు వెల్లడించారు. విస్మయానికి గురైన పోలీసులు, ఇంటి యజమాని పిలిపించి తమ దైన శైలిలో వార్నింగ్‌ ఇచ్చారు. ఐదు లక్షల నగదు, భారీగా నగలు పోయినట్లు తప్పుడు ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు