కృష్ణా నదిలో దూకి జెన్‌కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య 

24 Jul, 2021 01:06 IST|Sakshi

రెండు రోజుల కింద అదృశ్యమైన రామయ్య దంపతులు, కుమారుడు 

ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు రామయ్య సూసైడ్‌ నోట్‌ 

ఆన్‌లైన్‌ వ్యాపారాలతో నష్టపోయినట్లు అనుమానం

సాక్షి, నాగార్జునసాగర్‌: జెన్‌కో ఉద్యోగి, ఆయన భార్య, కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నాగార్జునసాగర్‌ విద్యుదుత్పాదన కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మండాది రామయ్య (36), భార్య నాగమణి (30), కుమారుడు సాత్విక్‌ (13) గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. సాగర్‌ ప్రాజెక్టు దిగువన కృష్ణానది వంతెనపై రామయ్య బైక్, సెల్‌ఫోన్‌ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రామయ్య నివాసంలో వెతకగా, సూసైడ్‌ నోట్‌ దొరికింది. తర్వాత బైక్‌ కన్పించిన ప్రాంతం వద్ద గజ ఈతగాళ్ల సాయంతో వెతికారు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. దీంతో పోలీసులు శుక్రవారం ఉదయం మరోసారి గాలించగా, ముగ్గురి మృతదేహాలు నదిలో తేలుతూ కన్పించాయి. నాగార్జునసాగర్‌ ఆనకట్టకు దిగువన కృష్ణానది తీరంలోని చింతలపాలెంకు చెందిన రామయ్య భూమి సాగర్‌ ప్రాజెక్టు టెయిల్‌పాండ్‌లో ముంపునకు గురికావడంతో భూ నిర్వాసితుల కింద ఆయనకు జెన్‌కోలో ఉద్యోగం వచ్చింది. 

ఆత్మహత్యకు కారణం ఏంటి? 
మండాది రామయ్య కుటుంబం నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటనేది స్పష్టం కావట్లేదు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు రామయ్య సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నా.. ఆ విషయాల గురించి తమతో ఎప్పుడూ చర్చించలేదని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఆన్‌లైన్‌ యాప్‌ల వ్యాపారంలో రామయ్య పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు కొందరు చెబుతున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు