అనుమానాస్పదంగా యువకుడి మృతి.. కన్న తల్లే కారణమా?

4 Mar, 2022 20:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,చిత్తూరు: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. తల్లి, మరికొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు.. మండలంలోని కృష్ణాపురం పంచాయతీ, దిగువ మల్లవరానికి చిట్టేటి చంద్రయ్య, లక్ష్మి అలియాస్‌ యశోదకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు శ్రావణ్‌కుమార్‌(24) ఉన్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలయ్యాయి. కొన్నేళ్ల కిందట చంద్రయ్య మృతి చెందడంతో ఇంట్లో తల్లీకుమారుడు ఉంటున్నారు. బీటెక్‌ వరకు చదివిన శ్రావణ్‌కుమార్‌ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండేవాడు.

గత సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లిన శ్రావణ్‌కుమార్‌కు తల్లి యశోద అన్నం పెట్టింది. అది తిన్న కొంత సేపటికే వాంతులు, విరేచనాలు కావడంతో బంధువులు హుటాహుటిన తిరుపతి మార్గంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కన్న తల్లే అల్లుళ్లు ప్రసాద్, బాలకృష్ణతో కలసి పథకం ప్రకారం భోజనంలో విషం పెట్టి హతమార్చేందుకు యత్నించిందని మృతుడు తన చిన్నానతో మాట్లాడిన వీడియో సంభాషణలు బయటకు వచ్చాయి.

ఆస్పత్రి వైద్యులు కూడా విషాహారం తినడం వల్లే శ్రావణ్‌కుమార్‌ మృతి చెందాడని పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తల్లిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదును మృతుడి చిన్నాన రాధయ్య, పెదనాన్న చెంగయ్య రేణిగుంట పోలీసులకు అందించారు. అయితే దీనిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. గురువారం సాయంత్రం శ్రావణ్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు