గ్రామ దేవతలకు జలాభిషేకం: పట్టాల వెంట పాదయాత్రగా వెళ్తుండగా ఘోరం

29 Aug, 2021 20:36 IST|Sakshi

అభిషేకానికి తుంగభద్ర జలాలు తెచ్చేందుకు వెళ్లి.. 

పట్టాలెంబడి పాదయాత్రగా తిరిగి వస్తుండగా ఢీకొన్న రైలు

ఇద్దరు బిణిగేరి యువకుల దుర్మరణం   

సాక్షి,కర్నూలు: వరుణుడి కరుణ కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం చేసేందుకు ఊరంతా సిద్ధమవుతుండగా అంతలోనే విషాదం నెలకొంది. తుంగభద్ర జలాలు తెచ్చేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువు బారిన పడ్డారు. రాత్రి వేళ రైలు పట్టాలెంబడి పాదయాత్రగా వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పరి మండలం బిణిగేరి గ్రామంలో ఏటా శ్రావణమాసం మూడో శనివారం గ్రామదేవతలైన అంజినయ్య స్వామి, తిక్కస్వామి, మారెమ్మవ్వ, సుంకులమ్మవ్వ, పంచలింగేశ్వరస్వామికి తుంగభద్ర జలాలతో అభిషేకం చేయడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి దాదాపు 300 మంది గ్రామస్తులు 60 కి.మీ దూరంలోని మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్‌ సమీపంలోని నది వద్దకు చేరుకున్నారు. అక్కడ బిందెల్లో నీరు నింపుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కొందరు ఆటోల్లో వెళ్లిపోగా మరి కొందరు రైలు పట్టాల వెంబడి మొక్కుబడి తీర్చుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ఐరన్‌గల్లు రైల్వే స్టేషన్‌ దాటిన తర్వాత పట్టాలెంబడి దాదాపు వాగుపై 200 మీటర్ల పొడవైన వంతెన ఉంది. శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వంతెన మీదుగా భక్తులు వెళ్తుండగా రాయచూర్‌ నుంచి ఆదోని వైపు వేగంగా రైలు వస్తుండగా అందరూ అప్రమత్తమై పట్టాలుదిగారు.

కాగా ఈరన్న, ఈరమ్మ దంపతుల కుమారుడు అంజినయ్య(19), తిమ్మప్ప, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీనివాసులు (16) మాత్రం వంతెన దాటే ప్రయత్నం చేయగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండే ఇద్దరు యువకులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోçస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.  బిణిగేరి గ్రామంలో శనివారం పండుగ వాతారణం నెలకొనా ల్సి ఉండగా ఇద్దరి యువకుల మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.

చదవండి: మరో టీమ్‌కు ధోని కెప్టెన్‌.. మిగతా 10 మంది వీళ్లే!     

మరిన్ని వార్తలు