ఉగాండా మహిళ పొట్టలో కేజీ కొకైన్‌

30 Dec, 2021 06:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉగాండా దేశానికి చెందిన మహిళ నుంచి సుమారు కిలో బరువున్న కొకైన్‌ అనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ) కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికురాలు కొన్ని రోజుల క్రితం ఉగాండా నుంచి ఢిల్లీకి  వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు ఆమె కదలికలు, ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె క్యాప్యూళ్ల రూపంలో ఉన్న కొకైన్‌ను మింగినట్లు ఒప్పుకుంది.

వెంటనే ఆస్పత్రిలో ఆమెకు పరీక్షలు చేయించగా అనేక క్యాప్యూళ్లు పెద్ద పేగు వద్ద చిక్కుకుని ఉన్నట్లు తేలింది. దీంతో నిపుణుల పర్యవేక్షణలో వాటన్నిటినీ బయటకు తీసేందుకు కొన్ని రోజులు పట్టింది. మొత్తం 992 గ్రాముల బరువున్న 91 క్యాప్సూళ్లు బయటపడ్డాయి. వీటిల్లో ఉన్నది సుమారు రూ.14 కోట్ల విలువైన కొకైన్‌ అని ధ్రువీకరించుకున్నారు. ఈ మేరకు సదరు మహిళను అరెస్ట్‌ చేసి, ఈనెల 29వ తేదీన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈనెల మొదటి వారంలో నైజీరియా మహిళ నుంచి ఐజీఐ అధికారులు 2,838 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు