తొమ్మిది హత్యల కేసు : సంజయ్‌కు ఉరిశిక్ష

28 Oct, 2020 14:02 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : తెలుగు రాష్ట్రల్లో సంచలనం రేపిన గీసుకొండ మండలం  గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది హత్యలకు కారకుడైన సంజయ్ కుమార్ కి వరంగల్  న్యాయస్థానం లో ఉరి శిక్ష ఖరారు చేశారు. ఒక్క హత్యను కప్పి పుచ్చుకునేందుకు మరో 9మందిని హత్యలకు కారకుడైన మృగానికి ఉరి శిక్ష తీర్పు  వెలువడింది. కేసు నమోదైనప్పటి నుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో శిక్ష పడేవిధంగా గీసుకొండ సీఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన చతురతని ప్రదర్శించారు. 25 రోజుల్లోనే కోర్డులో నేరారోపణ పత్రము దాఖలు చేశారు. కరోనా వల్ల అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఒక నెల రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు.. తీర్పును వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష పడటం పట్ల వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. విచారణ త్వరగా పూర్తి చేసినందుకు పోలీసులను అభినందించారు. కాగా, కోర్టు తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మే 21న గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్‌ వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి బావిలో పడేశాడు. తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ మరో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

పని కోసం వచ్చాక పరిచయం
వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్‌దాన్‌ గోదాంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్‌ మక్సూద్‌ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్‌ కుమారులు షాబాజ్‌(19), సోహిల్‌ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్‌దాన్‌ పనికి వచ్చిన బీహార్‌ వాసి సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్‌ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ çసంజయ్‌ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తనకు హోటళ్లలో తినడం ఇబ్బందిగా ఉందని చెబుతూ డబ్బు చెల్లించేలా మాట్లాడుకుని రఫీకా ఇంట్లో భోజనం చేయడం ఆరంభించాడు. ఆ పరిచయం సాన్నిహిత్యానికి.. ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది.

వివాహితతో పాటు ఆమె కుమార్తెతో..
మక్సూద్‌ సమీప బంధువైన రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్‌ జాన్‌పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్‌ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీయడమే కాకుండా త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్‌ చేయసాగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్‌.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్‌ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్‌ర థ్‌ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్‌ వచ్చాడు.

ఆమె ఎటు వెళ్లింది..?
తాపీగా వచ్చిన సంజయ్‌ పని చేసుకుంటున్నాడు. అయితే, రఫీకా విషయమై నిషా సంజయ్‌ను గట్టిగా అడగసాగింది. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ కుటుంబం అడ్డు కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాడు.

కొడుకు పుట్టిన రోజే అందరికీ చివరి రోజు
సంజయ్‌కుమార్‌ యాదవ్‌.. మక్సూద్‌ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు మే 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించాడు. ప్రతీరోజూ సైకిల్‌పై వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వస్తూ పరిశీలించాడు. ఈ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కన మరో భవనం పైభాగంలో నివాసముంటున్న బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంను గుర్తించాడు. చివరకు మే 20వ తేదీన మక్సూద్‌ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్‌ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్‌ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు.

రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో చేరుకోగా ఒకరి వెంట ఒకరిని గోనె సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం – బావి మధ్య ఉన్న ప్రహరీపై ఆయన ఒక్కరొక్కరిని ఉంచాడు. ఆ పై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడవేయసాగాడు. ఉదయం 5.30 గంటలకు మృతులు వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసి వస్తువులు, సెల్‌ఫోన్లు తీసుకుని జాన్‌పాక చేరుకున్నాడు. తొమ్మిది మంది మృతి చెందిన కేసును వరంగల్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకొని ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి కోర్పుకు అప్పగించారు. దీంతో నిందితుడు సంజయ్‌కు ఉరిశిక్ష ఖరారైంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు