అక్రమ సంబంధం.. వితంతువుపై దాడి

10 Dec, 2020 20:10 IST|Sakshi

రాంచీ :  వివాహేతర సంబంధాలు పెట్టుకొని మహిళలను హింసిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వితంతువుపై 10 మంది గ్రామస్తులు దాడి చేసిన ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెరైకేలా-ఖర్సావన్ జిల్లాలోని గెరాబెరా గ్రామానికి చెందిన ఓ వితంతువు అంగన్‌వాడీ వర్కర్‌గా పని చేస్తున్నారు. గత సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన 10 మంది ఆమెపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న వితంతువును ముగ్గురు మహిళలు బయటకు లాక్కెళ్లారు. అనంతరం మరో ఏడుగురితో కలిసి ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టడమే కాకుండా.. ఉద్యోగం మానేసి గ్రామం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అనంతరం ఆమెను రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు.

కాగా, మంగళవారం ఉదయం వితంతువు పోలీసులను సంప్రదించి తనపై దాడి చేసి పది మందిపై ఫిర్యాదు చేశారు. టినేజ్‌ వయసున్న కొడుకుతో తాను గత కొన్నేళ్లుగా అదే గ్రామంలో నివసిస్తున్నానని, కొంతమంది తనపై కుట్రపన్ని దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే గ్రామస్తులు మాత్రం ఆమె ప్రవర్తన చెడుగా ఉందని, పెళ్లైన వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకొని మహిళలను హింసిస్తున్నారని ఆరోపించారు. ఆమె ప్రవర్తన వల్ల ఓ మహిళ రెండు సార్లు ఆత్మహత్నాయత్నం చేసుకున్నారని అందుకే ఆమెపై దాడి చేశారని పేర్కొన్నారు. వితంతువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తీవ్ర గాయాలైన ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు