మ్యాట్రిమోనిలో బయోడేటా.. పెళ్లి పేరుతో భార్యాభర్తల మోసం

14 Nov, 2021 12:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భర్త పరారీ, భార్య అరెస్టు

సత్తెనపల్లి: పెళ్లి పేరుతో మహిళను భార్యాభర్తలు మోసగించిన సంఘటన ఇటీవల వెలుగుచూసింది.  భర్త పరారీలో ఉండగా, భార్యను సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఓ మహిళ అబ్బూరులోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు రెండో వివాహం నిమిత్తం ఇటీవల మ్యాట్రిమోనిలో తన బయోడేటా పెట్టింది.

ఈ బయోడేటా చూసిన కార్తీక్‌ అనే వ్యక్తి తన అమ్మ వాళ్లది తెనాలి అని, ఉద్యోగం రీత్యా చెన్నైలో పనిచేస్తున్నానని, తనకు బాగా నచ్చావని మాటలు కలిపి రోజూ ఫోన్‌ చేయడం మొదలు పెట్టాడు. తరచూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని భరోసా కల్పిచాడు. కొద్దిరోజుల తరువాత తన కుటుంబానికి చెందిన ఆస్తులు నోట్ల రద్దు సమయంలో విక్రయించామని, వచ్చిన కోట్ల రూపాయల నగదు బ్యాంకులో ఉందని నమ్మించాడు.

పెద్ద మొత్తం కావడంతో లెక్కలు చెప్పాలంటూ ఆ నగదును ఐటీ అధికారులు నిలిపివేశారని, ప్రస్తుతం అది చెన్నై కోర్టులో ఉందన్నాడు. ఐటీ అధికారులకు కొంత నగదు చెల్లించాలని, నీవద్ద ఉంటే అప్పుగా ఇస్తే తిరిగి మళ్లీ ఇస్తానని చెప్పాడు. అది నమ్మి తెలిసిన వారి వద్ద నుంచి బ్యాంకు ఉద్యోగి రూ.32 లక్షలు కార్తీక్‌ మేనత్త బ్యాంక్‌ ఖాతాకు నగదు బదిలీ చేసింది. రోజులు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోగా, సాకులు చెప్పి తప్పించుకుంటుండటంతో అనుమానం వచ్చిన బ్యాంకు ఉద్యోగి తెనాలి వెళ్లి విచారించగా అసలు విషయం బట్టబయలైంది.

కార్తీక్‌ అసలు పేరు మహరాజ్‌ జానీరెక్స్‌ అని, అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలియడంతో మోసపోయానని గ్రహించింది. కార్తీక్‌ తన మేనత్త అని పరిచయం చేసి ఇచ్చిన బ్యాంక్‌ ఖాతా నంబరు అతని భార్యది కావడంతో ఆమె వెంటనే తెనాలి పోలీసులను ఆశ్రయించింది. తెనాలి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును సత్తెనపల్లి రూరల్‌ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.

నమ్మించి మోసం చేసిన కార్తీక్, అతని భార్య మహరాజ్‌ ప్రియపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్తీక్‌ పరారీలో ఉండగా, అతని భార్య మహరాజ్‌ ప్రియను అరెస్టు చేశారు. భార్యాభర్తలు ఇద్దరు గతంలో కూడా అనేక మందిని మోసం చేసినట్లు సమాచారం. ఇదిలావుండగా ఇచ్చిన నగదు తిరిగి రాకపోతే తనకు చావే శరణ్యమంటూ బ్యాంకు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వార్తలు