Extra Marital Affair: ఓకే ఇంట్లో భార్యను మరొక వ్యక్తితో చూడటంతో..

17 Feb, 2022 14:52 IST|Sakshi
వివరాలు వెల్లడించిన డీఎస్పీ భీంరెడ్డి,  వెంకటప్ప(ఫైల్‌) 

సాక్షి, పటాన్‌చెరు టౌన్‌: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తనే హత్య చేయించింది. ఈ ఘటనలో భార్య పద్మతో పాటు మరో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో అమీన్‌పూర్‌ సీఐ శ్రీనివాసులు రెడ్డితో కలసి హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ భీంరెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పరిధిలోని చక్రపురి కాలనీలో ఈ నెల 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో తీవ్రగాయాలతో ఓ మృతదేహం లభ్యమైంది. దీంతో అమీన్‌పూర్‌ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య భర్త కనిపించడం లేదని చందానగర్‌ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు ఇవ్వడాన్ని అమీన్‌పూర్‌ పోలీసులు గుర్తించారు. వికారాబాద్‌ జిల్లా భాసీరాబాద్‌ మండలం జీవంగి గ్రామానికి చెందిన ఎరుకుల వెంకటప్ప(39) కూలి పని చేసుకుంటూ చందానగర్‌లో భార్య పద్మతో నివాసం ఉంటున్నాడు. బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తా వద్ద అడ్డపై కూలి పనికి వెంకటప్ప వెళ్తుండగా, భార్య ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో పక్కనే నివాసం ఉండే సెంట్రింగ్‌ పని చేసుకునే అబ్దుల్‌ రహమాన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పుడప్పుడు వెంకటప్పను రహమాన్‌ తనతో పనికి తీసుకెళ్లేవాడు.  
చదవండి: ప్రేమ పేరుతో కూతురు పరువు తీస్తోందని... ప్రియుడితో కలిసి తల్లి..

పక్కా ప్రణాళిక ప్రకారమే.. 
ఒక రోజు ఇంట్లో పద్మ, రహమాన్‌ ఇద్దరిని చూసిన వెంకటప్ప భార్య పద్మతో గొడవపడ్డాడు. దీంతో పద్మ భర్త అడ్డు తొలగించాలని రెహమాన్‌కు తెలపింది. దీంతో రెహమాన్‌ అతడితో పనిచేసే సుభాష్‌తో కలసి వెంకటప్ప అడ్డు తొలగించుకునేందుకు ప్లాస్‌ వేసుకున్నారు. ప్రణాళికలో భాగంగా ఈ నెల 8వ తేదీన వెంకటప్పను కొల్లూరు దగ్గర పని ఉందని చెప్పి రెహమాన్, సుభాష్‌లు వెంకటప్పను స్కూటీపై ఎక్కించుకొని వెళ్లారు. అక్కడికి వెళ్లాక పని ఈ రోజు లేదని చెప్పి మద్యం సేవించడానికి ఆలూర్‌ వెళ్లి బాగా తాగారు. తిరిగి అక్కడి నుంచి లింగంపల్లి వచ్చి అక్కడ వెంకటప్పకు మరో సారి మద్యం తాగించారు.

మద్యం మత్తులో ఉన్న వెంకటప్పను అమీన్‌పూర్‌ పరిధిలోని చక్రపూరి కాలనీలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పెద్దబండ రాయితో వెంకటప్ప తల, మొఖంపై కొట్టి చంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అమీన్‌పూర్‌ పోలీసులు మృతుడి భార్య పద్మ, అబ్దుల్‌ రెహమాన్, సుభాష్‌లను రిమాండ్‌కు తరలించారు. వారు వాడిన స్కూటీని సీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు వేణుగోపాల్‌ రెడ్డి, శ్రీనివాసులు, ఎస్‌ఐ సోమేశ్వరి, అమీన్‌పూర్‌ కానిస్టేబుళ్లు రాములు, మహేందర్‌ను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. 
చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఆరుగురి అరెస్ట్‌ 

మరిన్ని వార్తలు