మద్యం మత్తులో కన్నబిడ్డను కడతేర్చిన తల్లి 

4 Feb, 2021 01:03 IST|Sakshi
 ధనుష్‌ మృతదేహం 

మద్యం మత్తులో మామతో గొడవ 

కొడుకు మారాం చేయడంతో గొంతు నులిమి హత్య 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం 

రామన్నగూడలో దారుణం

సాక్షి, చేవెళ్ల: మద్యం మత్తులో ఓ తల్లి.. మహిళాలోకం తలదించుకునేలా వ్యవహరించింది. తాగిన మైకం లో మామతో గొడవపడిన ఆమె.. తన కోపాన్ని కన్నకొడుకుపై చూపించింది. కొడుకు మారాం చేస్తున్నాడని విచక్షణ కోల్పోయి పసివాడిని గొంతు నులిమి హత్య చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడలో మంగళవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రామన్నగూడకు చెందిన దుంస శివకుమార్, పరమేశ్వరి దంపతులకు ఓ కూతురు, కొడు కు ధనుష్‌కుమార్‌(2) ఉన్నారు. భార్యాభర్తలు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శివకుమార్‌ ఒగ్గుకథల కార్యక్రమాల్లో డోలు కూడా వాయించేవాడు. అయితే మద్యానికి బాగా అలవాటుపడిన శివకుమార్‌ ఇటీవల కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. పరమేశ్వరి కూడా గ్రామంలో కూలిపనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ మత్తుకు బానిసైంది. దీంతో ఇద్దరూ మద్యం మత్తులో రోజూ ఇంట్లో గొడవ పడుతుండేవారు.  

గొంతు నులిమి..  
మంగళవారం డోలు వాయించే పనిమీద శివకుమార్‌ వేరే గ్రామానికి వెళ్లాడు. పరమేశ్వరి తాగిన మత్తులో రాత్రి సమయంలో ఇంటి పక్కనే ఉండే మామ వెంకటయ్యతో గొడవపడింది. ఇద్దరూ మాటామాట అనుకున్నారు. కోపంలో ఉన్న ఆమె ఇంట్లోకి వెళ్లింది. పిల్లలు మారాం చేస్తుండటంతో క్షణికావేశానికి గురైన పరమేశ్వరి విచక్షణ కోల్పోయి కొడుకు ధనుష్‌కుమార్‌ గొంతునులిమి హత్య చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఇంట్లో పిల్లల శబ్దం వినిపించకపోవడంతో అనుమానం వచ్చి పక్కనే ఉండే కుటుంబీకులు వచ్చి చూడగా బాలుడు ధనుష్‌ విగతజీవిగా కనిపించాడు. చదవండి: (భర్తతో గొడవ.. బిడ్డతో సహా భవనంపై నుంచి దూకిన తల్లి)

ఏమైందని పక్కనే మత్తులో కూర్చున్న తల్లి పరమేశ్వరిని అడిగితే.. గొడవచేస్తున్నాడని గొంతు నులిమి చంపేశానని చెప్పటంతో ఆందోళనకు గురైన పక్కింటివారు 100కు ఫోన్‌ చేయడంతో చేవెళ్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. పరమేశ్వరిని ప్రశ్నించగా మామ వెంకటయ్యతో గొడవ పడ్డానని.. ఇంట్లోకి కోపంగా వచ్చిన తనను పిల్లలు సతాయించడంతో కొడుకు గొంతు నులిమి చంపానని అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

మద్యం మత్తులోనే తండ్రి 
ఈ సంఘటనతో పోలీసులు బాలుడి తండ్రి శివకుమార్‌కు ఫోన్‌ చేయగా అతను స్పందించలేదు. బుధవారం బంధువులు, గ్రామస్తులు గాలించగా చేవెళ్లలో కనిపించాడు. జరిగిన విషయం అతనికి చెప్పగా.. తాగిన మైకంలో ఉండటంతో ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో శివకుమార్‌ను ఆస్పత్రిలో చేర్చారు. 

మరిన్ని వార్తలు