భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం 

24 Mar, 2022 11:44 IST|Sakshi
వేణు (ఫైల్‌)

సాక్షి, మధురవాడ (భీమిలి): మిత్రుని ఇంటిలో శుభకార్యానికి విజయనగరం వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం పాలయింది. పీఎం పాలెం పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా బూరగాం గ్రామానికి చెందిన గేదెల కృష్ణారావు రైల్వేలో క్లర్క్‌(టీఎన్‌సీ)గా విశాఖలో పనిచేస్తున్నారు. ఉద్యోగం నిమిత్తం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి మర్రిపాలెం టైప్‌ – 3 రైల్వే కాలనీలో కుటుంబంతో నివసిస్తున్నారు.

విజయనగరంలో మిత్రుడి ఇంటిలో శుభకా ర్యం నిమిత్తం బుధవారం ఉదయం 8.30 సమయంలో స్కూటీపై భార్య వేణు(31)తో కలిసి ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో వీరు పీఎం పాలెం కారుషెడ్‌ కూడలి వద్దకి వచ్చేసరికి వెనుక నుంచి ఎమ్‌కే బిల్డర్స్‌కి చెంది న కాంక్రీట్‌ మిక్సింగ్‌ వాహనం ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న వేణు రోడ్డు మీద పడిపోగా ఆమె మీద నుంచి వాహనం వెళ్లిపోవడంతో శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది.

భర్త కృష్ణారావు పక్కకు పడడంతో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వైద్యం నిమిత్తం అతడిని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. వారికి ఆరో తరగతి చదువుతు న్న కుమారుడు యుగంధర్, నాలుగో తరగతి చదువుతున్న కుమార్తె ఉదయశ్రీ సంతానం. మృతురాలి భర్త కృష్ణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పీఎం పాలెం ఎస్‌ఐ నిహార్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.  

మరిన్ని వార్తలు