మహిళతో లారీ డ్రైవర్‌ గొడవ.. సెల్‌ఫోన్‌ లాక్కుని..

21 May, 2022 13:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు రూరల్‌: పొట్ట కూటి కోసం కూలి పనులు చేసుకునే ఓ మహిళ ప్రాణాలను లారీ డ్రైవర్‌ బలి తీసుకున్నాడు. మృతురాలి పిల్లలు అనాథలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిలకలూరిపేట సుగాలీ కాలనీకి చెందిన ప్రతామ రమణమ్మ (40) భర్త కొన్ని సంవత్సరాల కిందట మృతి చెందాడు. అప్పటినుంచి చిత్తు కాగితాలు ఏరుకోవడంతోపాటు చిన్నపాటి కూలి పనులు చేసుకుంటూ తన నలుగురు పిల్లలను పోషిస్తుంది.
చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి.. వెలుగులోకి షాకింగ్‌ నిజాలు..

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తనతోపాటు తన ముగ్గురు పిల్లలు, ఆడపడుచు, ఆడపడుచు భర్త కలిసి గుంటూరు రూరల్‌ మండలంలోని నాయుడుపేటలోని డంపింగ్‌ యార్డు సమీపంలో కాగితాలు ఏరుకునేందుకు బయలుదేరారు. బస్సుకు ఎక్కువ చార్జీ అవుతుందని లారీలో అయితే తక్కువతో ప్రయాణించవచ్చని అదే దారిలో వస్తున్న వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన లారీని చిలకలూరిపేటలో ఎక్కారు.

అనంతరం నాయుడుపేట వద్ద లారీని ఆపాలని డ్రైవర్‌ను కోరారు. లారీ ఆగటంతో ఆడపడుచు, ఆమె భర్త, పిల్లలు, రమణమ్మ దిగారు. అనంతరం రమణమ్మ డ్రైవర్‌కు రూ.100 ఇచ్చింది. డ్రైవర్‌ రూ.300 ఇవ్వాలని రమణమ్మతో గొడవకు దిగాడు. ఇరువురు వాదులాడుకుంటుండగా డ్రైవర్‌ రమణమ్మ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కుని లారీని ముందుకు లాగించాడు. సెల్‌ఫోన్‌కోసం కదులుతున్న లారీని ఎక్కేందుకు ప్రయత్నించింది. లారీని డ్రైవర్‌ వేగంగా ముందుకు పోనిచ్చాడు. కాలుజారి రమణమ్మ కిందపడింది.

అదే లారీ ఆమెపైకి ఎక్కింది. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు కేకలు వేశారు. డ్రైవర్‌ లారీని ఆపకుండా పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ సీఐ బి శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఆంజనేయులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించి, బంధువుల నుంచి సమాచారం సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  డ్రైవర్‌ లారీని ప్రత్తిపాడు సమీపంలో నిలిపివేసి పరారయ్యాడు. నల్లపాడు పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ కోసం రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

  

మరిన్ని వార్తలు