సచివాలయ సిబ్బంది పై హత్యాయత్నం..

8 Jul, 2021 08:29 IST|Sakshi

సాక్షి,విజయవాడ: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పైఅంతస్తును కూల్చేందుకు వెళ్లిన వార్డు సచివాలయ ఉద్యోగులపై నిర్మాణదారులు పెట్రోలు పోసి హత్యాయత్నం చేశారు. ఘటనపై విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. విజయవాడ రామకృష్ణాపురానికి చెందిన గంజి పావని కృష్ణలంక 16వ డివిజన్‌లోని 74వ వార్డు సచివాలయంలో ప్లానింగ్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయం పరిధి కళానగర్‌పాకలు ప్రాంతంలో ఎలాంటి అనుమతులూ పొందకుండా డేరంగుల రాములమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టింది.

ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు పావని.. ముగ్గురు ప్లానింగ్‌ సెక్రటరీలు వి.మౌనిక, పాలేటి తీర్థ, ఎం.రాణితో పాటు చైన్‌మన్‌ రాజు తదితరులు వెళ్లారు. పైఅంతస్తుకు వెళ్లి నిర్మాణాన్ని కూల్చబోయారు. రాములమ్మ,ఆమె కుమార్తె గోవిందమ్మ పెట్రోల్‌ బాటిల్‌తో పైఅంతస్తుకొచ్చి ఆమె మీద పోసుకోవడమే కాకుండా నగర పాలక సంస్థ సిబ్బందిపై కూడా పోసింది. పెట్రోలు వారి కళ్లల్లో, నోట్లో పడటంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆమె చేతిలో అగ్గిపెట్టె కూడా ఉండడంతో వారంతా భయభ్రాంతులకు లోనై పరుగులుతీశారు. పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాములమ్మ, గోవిందమ్మను అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు