వైరల్‌: ఆమె అదృష్టం బాగుంది.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

11 Aug, 2021 07:33 IST|Sakshi

రాంగ్‌రూట్‌లో వచ్చిన యువతి

సిగ్నల్‌ పడడంతో ముందుకువచ్చిన బస్సు

చౌరస్తాలో త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం

అనంతపురం క్రైం: అదృష్టం బాగుండి ఓ యువతి ప్రాణాలతో బయటపడింది. అనంతపురంలోని క్లాక్‌టవర్‌ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వివరాలు.. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన నాగలక్ష్మి... ఐర్లాండ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు నెల కిందట అనంతపురానికి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం టవర్‌క్లాక్‌ సమీపంలోని దుకాణంలో మందులు కొనుగోలు చేసి, సోదరి దివ్యాంజలితో కలిసి స్కూటీపై మారుతీనగర్‌కు వెళ్లేందుకు రాంగ్‌రూట్‌లోకి ప్రవేశించారు.

ట్రాఫిక్‌ సిగ్నల్‌ వెలగడంతో అప్పటి వరకూ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును డ్రైవర్‌ ముందుకు పోనిచ్చాడు. బస్సును గమనించని నాగలక్ష్మి తన స్కూటీని ఆపకుండా అలాగే ముందుకు వెళ్లనివ్వడంతో బస్సు బంపర్‌ తగిలి కిందకు పడ్డారు. బస్సు డ్రైవర్‌ బ్రేక్‌ వేసేలోపు ముందు చక్రం స్కూటీ పైకి వెళ్లింది. ఘటనలో నాగలక్ష్మి కాలు విరిగింది. వెనుక కూర్చొన్న దివ్యాంజలికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రురాలు పోలీసులతో మాట్లాడుతూ.. కేవలం తన అజాగ్రత్త కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని, దీనిపై ఎలాంటి కేసు అవసరం లేదంటూ పోలీసులకు విన్నవించారు. ఇదే విషయాన్ని ట్రాఫిక్‌ పోలీసులు ధ్రువీకరించారు.

మరిన్ని వార్తలు