టిఫిన్‌ సెంటర్‌ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..

7 Dec, 2021 15:28 IST|Sakshi
ఉష (ఫైల్‌) 

క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు..  

చిన్నచిన్న సమస్యలకే ఆత్మహత్యకు పాల్పడుతున్న వైనం  

మూడేళ్లలో 654 మంది బలవన్మరణం  

16 ఏళ్ల వయస్సులోపు వారు 33 మంది  

జీవితం ఓ ప్రయాణం.. ఆటుపోట్లు.. కష్ట సుఖాలు కేనీడ వంటివి. ఒక్కక్షణం ఆలోచిస్తే సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నా... ఈ ప్రపంచంలో పరిష్కారంకాని సమస్య ఏదీ లేదని తత్వవేత్తలు బోధిస్తున్నా.. చాలామంది క్షణికావేశానికి లోనవుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందమైన జీవితాలను అగ్నికి ఆహుతిచేస్తున్నారు. అయినవారికి ఆవేదన మిగుల్చుతున్నారు. జిల్లాలో మూడేళ్లలో సుమారు 654 మంది ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ ఆలోచింపజేస్తున్న అంశంగా మారింది.  

విద్యార్థిని ఆత్మహత్య  
గజపతినగరం: గజపతినగరం మండలం పిడిశీల గ్రామానికి చెందిన ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థిని ఉరివేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  బొండపల్లి మండలం శ్యామలవలస గ్రామానికి చెందిన తాడ్డి ఉష (18) తాతగారి గ్రామం అయిన పిడిశీలలో ఊంటూ చదువుతోంది. ఉష తల్లిదండ్రులు పార్వతి, రమణమూర్తిలు విజయనగరం మయూర జంక్షన్‌ సమీపంలో టిఫిన్‌ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఉషను గజపతినగరంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో చదివిస్తున్నారు. చక్కగా చదువుకుని ప్రయోజకురాలు అవుతుందని ఊహించారు.

బైపీసీ గ్రూపును చదవలేక రెండురోజులుగా ఉష కళాశాలకు వెళ్లడం లేదు. మరి చదవలేనన్న బెంగతో మనస్థాపానికి గురై సోమవారం సాయంత్రం అమ్మమ్మ అప్పయ్యమ్మ పొలంపనికి వెళ్లే సమయంలో ఇంటి దూలానికి సున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పార్వతి, రమణమూర్తిలకు ఇద్దరు ఆడపిల్లలు. అందులో పెద్దమ్మాయి పావనికి వివాహం కాగా, ఉష ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉషను ప్రయోజకురాలిని చేయాలనే ఊరిని విడిచిపెట్టి కష్టపడుతున్నామని, ఇంతలో అఘాయిత్యానికి పాల్పడిందంటూ తల్లి బోరున విలపిస్తోంది. మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రమేష్, ఎస్‌ఐ గంగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.  

చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..)

సాక్షి, విజయనగరం: ప్రేమ విఫలమైందని కొందరు.. భర్త, అత్తమామలు వేధించారని.. ఆరోగ్యం మరి కుదుటపడదని.. చదువుకోమని తల్లిదండ్రులు మందలించారని.. ఇలా.. చిన్నచిన్న కారణాలకే చాలామంది క్షణికావేశానికి గురవుతున్నారు. ప్రాణాలు తీసుకుంటున్నారు. పరిష్కరించుకోగలిగే చిన్నపాటి సమస్యలే అయినా ఆలోచించకుండా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఏటా వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడతుండం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. పెద్దవారిలో పురుషులు ఎక్కువుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల్లో బాలికలు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు వైద్య గణాంకాలు చెబుతున్నాయి.  

మారిన వ్యవహారశైలి..  
జీవన వ్యవహార శైలిలో చాలా మార్పులు వచ్చాయి. సాంకేతికత పెరుగుతున్నప్పటకీ మానవ సంబంధాలు, కుటుంబ విలువల గురించి నేటితరం పెద్దగా పట్టించుకోవడం లేదు. పూర్వ కాలంలో విలువలు పాటించేవారు. తగాదాలు అనేవి చాలా తక్కువుగా వచ్చేవి. ఆత్మహత్యలు కూడా అరుదు. ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చేవారు. 10 నుంచి 20 మంది వరకు ఒకే కుటుంబంగా కలిసి జీవించేవారు. కొంతమంది అయితే 30 నుంచి 40 మంది వరకు కలిసి ఉండేవారు. కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఇంట్లోనే కూర్చొని పరిష్కరించుకునేవారు. చిన్నచిన్న గొడవలు వచ్చినా పోలీస్‌ స్టేషన్‌ గడప కూడా తొక్కేవారు కాదు. ప్రస్తుతం ఒంటరి జీవితాలకు అలవాటు పడుతున్నారు. భర్త, భార్య, పిల్లలు మాత్రమే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వారికి ఏది మంచి, ఏది చెడు అనేది చెప్పేవారు ఉండడం లేదు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదం వచ్చినా గొడవ పెద్దది చేసుకోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం చేస్తున్నారు. అధికశాతం మంది ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణంగా కనిపిస్తోంది. మనోధైర్యం లేని యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. 

జీవితం తృణప్రాయంగా..  
2019 నుంచి 2021 అక్టోబర్‌ నెలఖారు నాటికి 654 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో పెద్దవారు 621 మంది కాగా, 16 ఏళ్లలోపు వారు 33 మంది. పెద్దవారిలో మగవారు 458 మంది కాగా మహిళలు 163 మంది ఉన్నారు. 16 ఏళ్లు లోపు వారిలో బాలురు 10 మంది, బాలికలు 23 మంది ఉన్నారు. 

కౌన్సెలింగ్‌ ఇప్పించాలి  
పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలి. మనోధైర్యం కోల్పోయిన వారికి సకాలంలో ఫ్యామిలీ సపోర్టు కావాలి. పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. పిల్లలతో ప్రస్తుతం ఎక్కువుగా తల్లిదండ్రులు గడపడం లేదు. దీనివల్ల వారు స్నేహితులతో గడుపుతున్నారు. మంచి స్నేహం అయితే ఫర్వాలేదు. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం కుదిరితే చెడుమార్గంలో వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాల వల్ల ఎక్కువుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కౌన్సెలింగ్‌ సెంటర్ల ఆవశ్యకత ప్రస్తుతం ఎంతైనా ఉంది. మద్యం సేవించడం తగ్గించుకోవాలి. సకాలంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి, మందులు వాడిస్తే ఆత్మహత్యల బారినుంచి కాపాడవచ్చు.  
 – డాక్టర్‌ జాగరపు రమేష్, మానసిక వైద్యుడు, విజయనగరం 

సమస్యను ఎదుర్కొనే శక్తి లేకనే..  
ఏదైనా సమస్య వస్తే దానిని ఎదుర్కోగలిగే శక్తి లేక మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనారోగ్య సమస్యలున్న వారు వాటిని మంచి వైద్యుని దగ్గర చూపించుకుని వైద్యం చేయించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మానవజన్మ దేవుడిచ్చిన వరం. క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడకూడదు. సమస్య వచ్చినప్పడు స్నేహితులకు, బంధువులకు చెప్పి పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. మనసుకు బాధ కల్గినప్పుడు మనోధైర్యాన్ని కోల్పోరాదు. మానవ సంబంధాల గురించి నేటివారికి తెలియజేయాలి.   
– డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారి, డీఎంహెచ్‌ఓ  

►విజయనగరానికి చెందిన కాకర్లపూడి అనిత అనే మహిళ ఎంవీజీఆర్‌ కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. భర్త మందలించారన్న కారణంతో గతనెల 20న గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.  
►పార్వతీపురం పట్టణానికి చెందిన పిచ్చిక ప్రదీప్‌కుమార్‌ అనే యువకుడు మానసిక స్థితి బాగులేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  
►జామి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళ  నెలరోజుల కిందట కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  
►మధ్యప్రదేశ్‌కు చెందిన సాహు అనే వ్యక్తి గంట్యాడ మండలంలోని కరకవలసగ్రామం సమీపంలో ఉన్న తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ►పార్వతీపురం మండలానికి చెందిన సురేష్‌ అనే యువకుడు ప్రేమ విఫలమైందన్న మనస్థాపంతో పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.  

మరిన్ని వార్తలు