సజావుగా ‘పది’ పరీక్షలు

30 Mar, 2023 02:22 IST|Sakshi

అమలాపురం టౌన్‌: జిల్లాలో పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించాలి. పరీక్షా కేంద్రాలు ప్రశాంత వాతావరణంలో ఉండాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పరీక్షల నిర్వహణకు సంబంధించిన జిల్లా సమన్వయ కమిటీ సభ్యులకు సూచించారు. అమరావతి నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ పదో తరగత పరీక్షల నిర్వహణ సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ శుక్లాతో పాటు డీఈవో ఎం.కమలకుమారితో పాటు సమన్వయ కమిటీ సభ్యులైన పలువురు జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ అధికారులతో చర్చించారు. జిల్లాలో 374 ఉన్నత పాఠశాలలకు చెందిన 20,967 మంది పదో తరగతి విద్యార్థులు మొత్తం 111 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. ఏప్రిల్‌ మూడు నుంచి 18వ తేదీ వరకూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. హాల్‌ టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సులో పరీక్షా కేంద్రానికి ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రశ్నా పత్రాల తరలింపునకు జిల్లాలో పది రూట్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో రెండు సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు గుర్తించామని... ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమలుకు కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ ఎం.దుర్గారావు దొర, డీటీవో అశోక్‌ ప్రతాపరావు, ఆర్టీసీ ప్రాంతీయ అధికారి నాగేశ్వరరావు, ట్రాన్స్‌కో ఈఈ రవికుమార్‌, పోస్టల్‌ అధికారులు పాల్గొన్నారు.

సమన్వయ కమిటీ సభ్యులతో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సమీక్ష

మరిన్ని వార్తలు