సీఎం జగన్‌కు కాపు నేతల కృతజ్ఞతలు

30 Mar, 2023 02:22 IST|Sakshi
సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కాపు నేతలు

మండపేట: అమలాపురం అల్లర్ల ఘటనలో ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకోవడంపై మండపేట కాపు అభ్యుదయ సంఘం నాయకులు హర్షం వెలిబుచ్చారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో కలిసి మండపేట కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సాయిబాబా, సంఘ నాయకుడు సిరంగు శ్రీను తదితరులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అన్ని సామాజికవర్గాల మధ్య సఖ్యతను పెంపొందిస్తుందన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కాపునేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ అమలాపురం అల్లర్ల ఘటనపై ఎంతో దూరదృష్టితో సీఎం జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. సామాజికవర్గాల మధ్య విభేదాలను రూపుమాపి పచ్చని సీమలో శాంతి, సామరస్య వాతావరణం, ఐకమత్యం పెంపొందేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు.

మరిన్ని వార్తలు