అన్నదాత..అదరహో.. | Sakshi
Sakshi News home page

అన్నదాత..అదరహో..

Published Sun, Dec 24 2023 2:26 AM

కొత్తపల్లిలో ఒకే మడిలో రకరకాల పంటలు  - Sakshi

పిఠాపురం: విభిన్నంగా ఆలోచించేవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు. ధైర్యంగా చొరవతో అడుగేసేవారు విజయతీరానికి చేరతారు. వ్యవసాయమూ ఇందుకు భిన్నం కాదని నిరూపిస్తున్నారు కొందరు ఆదర్శ అన్నదాతలు. రసాయన ఎరువులకు స్వస్తి పలుకుతూ ప్రకృతి వ్యవసాయ బాటలో నడుస్తూ వీరు లాభాలు ఆర్జిస్తున్నారు. వైవిధ్య సాగు పద్ధతులతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఇలాంటి కొందరు రైతుల గురించి తెలుసుకుందాం.

తోటి రైతులకు ఆదర్శంగా

● కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన పెనుమల్లు సమీర్‌రెడ్డి తనకున్న మూడెకరాల తీర ప్రాంతం భూమిలో ప్రయోగాత్మకంగా డ్రాగన్‌ ఫ్రూట్స్‌ సాగు చేపట్టారు. సేంద్రీయ పద్దతిలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా పండ్ల తోటలను సాగు చేసి లాభాలను అర్జిస్తున్నారు. ఉప్పుతో కూడుకున్న ఇసుక నేలలోనూ బంగారు పంటలు పండించి శేభాష్‌ అనిపించుకుంటున్నారు.

● ఓదూరి నాగేశ్వరరావుది రైతు గొల్లప్రోలు మండలం చేబ్రోలు. జపాన్‌లో మాత్రమే పండే మియాజాకీ రకం మామిడి పండును ఈయన పండించాడు. తనకున్న నాలుగెకరాల పొలంలో ప్రపంచంలో పేరొందిన, ఖరీదైన, అరుదైన రకాలకు చెందిన మామిడితో పాటు కొబ్బరి, నేరేడు, స్ట్రాబెర్రీ గోవా, జామ, సీతాఫలం, అల్జీరా, అరటి, సపోటా, రెడ్‌ పనస, పీనెట్‌ బటర్‌ ప్రూట్‌, మల్బరీ ఫ్రూట్‌, హైబ్రీడ్‌ బాదం, రామఫలం, లక్ష్మణ ఫలం, రాసి ఉసిరి, బొప్పాయి, మునక్కాడ, రేగు వంటి సుమారు వంద రకాల పండ్ల తోటలతో పాటు మసాలా దినుసులు, కూరగాయలు, బ్లాక్‌ బాస్మతి రైస్‌ సాగు చేపట్టి విజయం సాదించారు.

● పిఠాపురం మండలం నర్శింగపురానికి చెందిన యువ రైతు జవ్వాది వీరబాబు. ఈయన కొలంబియా జాతీయ పుష్పం అయిన ఆర్కిడ్‌ ఏషియాటిక్‌ లిల్లీ ఆర్కిడ్‌ పూల సాగులో సఫలీకృతులయ్యారు. పెట్టుబడికి వెనుకాడకుండా ధైర్య సాహసాలతో సాగు చేసి లాభాలు సంపాదిస్తున్నారు. బ్యాంకాక్‌ నుంచి విత్తనాన్ని కొనుగోలు చేసి ఇక్కడ దానికి తగ్గ వాతావరణాన్ని సృష్టించి పంటను విజయవంతంగా నిర్వహిస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే ఆర్కిడ్‌ పూలను ఇక్కడి వ్యాపారులకు స్థానికంగా అందిస్తున్నారు.

● గుండ్ర అంబయ్య కొత్తపల్లి మండలం యండపల్లికి చెందిన రైతు. కేరళలో మాత్రమే పండే జాజికాయ,జాజిపువ్వు పంటను ఆయన ప్రయోగాత్మకంగా ఇక్కడ సాగు చేసి విజయం సాధించారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. తన పొలంలో అంతర పంటగా వేసి ప్రస్తుతం మంచి దిగుబడులు సాదిస్తున్నారు.

రైతులకు అండగా ఆర్బీకేలు

అన్నదాతను వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాదు సహకారం అందించడంలోనూ ప్రభుత్వం ముందుటోంది. గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది. దీంతో సాగులో రైతు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆర్బీకేల సిబ్బంది రైతులకు తగిన సూచనలు సలహాలు ఇస్తున్నారు. దీంతో ఉత్సాహమున్న రైతులు ఇబ్బందులు లేకుండా సాగు చేస్తున్నారు.

చౌదరి చరణ్‌ సింగ్‌ రైతుల కోసం చేసిన అనేక ఉద్యమాల ఫలితంగా జమీందారి చట్టం పోయి కౌలు దారి చట్టం అమలులోకి వచ్చింది. ఆయన ఉద్యమాల వల్ల ప్రభుత్వాలు రైతుల గురించి, వ్యవసాయం గురించి ఆలోచించే పరిస్థితి రావడంతో రైతుల కోసం పాటుపడిన ఆయన జన్మదినాన్ని డిసెంబర్‌ 23ని జాతీయ రైతుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

విభిన్న పద్ధతులతో సాగు

వ్యవసాయంలో ముందడుగు

ఆర్బీకేల అండదండలు

అద్భుతాలు ఆవిష్కరిస్తున్న రైతులు

1/1

Advertisement
Advertisement