పారదర్శకతే ప్రాణప్రదం

7 Jan, 2021 00:39 IST|Sakshi

దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగి పోయాయి. దీనికి సంబంధించి ఇంతవరకూ కొనసాగిన చర్యలన్నీ చట్టబద్ధమైనవేనని, ఇందులో రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉల్లంఘనేదీ లేదని 2–1 తేడాతో సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. ఒక న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మాత్రం ఈ తీర్పుతో ఏకీభవించకుండా విడిగా తీర్పునిచ్చారు. ఇప్పుడున్న పార్లమెంటు భవనంకన్నా విశాలంగా, మరింత సౌకర్యవంతంగా కొత్త పార్లమెంటు భవనం... దాంతోపాటు ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలు, ప్రధాని కార్యాలయం, కేంద్ర సచివాలయం భవనాలను నిర్మించటం సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగం. వచ్చే ఏడాది 75వ స్వాతంత్య్రదినోత్సవం జరగబోతోంది గనుక అప్పటికల్లా పూర్తి చేయాలని సంకల్పించిన ఈ ప్రాజెక్టును నిరుడు ఏప్రిల్‌లో సెంట్రల్‌ విస్టా కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత ఢిల్లీ అర్బన్‌ ఆర్ట్‌ కమిషన్‌(డీయూఏసీ), హెరిటేజ్‌ కన్సర్వేటివ్‌ కమిటీలు కూడా ఆమోదముద్ర వేశాయి.

ఆనాటినుంచి దీని చుట్టూ ఎన్నో వివాదాలు రాజుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు మొన్న డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకూ గల దాదాపు 4 కిలోమీటర్ల ప్రాంతంలో చేపట్టే నిర్మాణాల వల్ల అనేక కీలకమైన భవంతుల జాడలు కనుమరుగవుతాయని, అందులో యునెస్కో చరిత్రాత్మకమైనవిగా గుర్తించినవి కూడా వున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడున్న వృక్షాలను తొలగించటం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ఆ సమీప ప్రాంతాల్లోనివారికి ఉపయోగపడే పార్కులు, క్రీడా స్థలాలు, ఇతర బహిరంగ స్థలాలు మాయమవుతాయని కూడా పిటిషనర్లు వాదించారు. ఈ ప్రాజెక్టుకు మూలమైన 2019 డిసెంబర్‌నాటి నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లన్నీ దాఖలయ్యాయి. సెంట్రల్‌ విస్టా పరిధిలోని భూ వినియోగంలో మార్పులు చేయడానికి  ఆ నోటిఫికేషన్‌ వీలు కల్పించింది. 

ఈ ప్రాజెక్టు వల్ల 86 ఎకరాల భూ వినియోగంలో ‘సమూలమైన’ మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదన్నదే ధర్మాసనం తరఫున మెజారిటీ తీర్పు వెలువరించిన జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిల నిశ్చితాభిప్రాయం. ఇదొక అనుమాపనమైన ప్రాజెక్టు గనుక దీనిపై న్యాయ సమీక్ష అవసరమన్న పిటిషనర్ల వాదనతో కూడా ధర్మాసనం ఏకీభవించలేదు. అలాగే ప్రజా వసరమైన ఇతర ప్రాముఖ్యతలెన్నో వుండగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎందుకన్న ప్రశ్నను కూడా ధర్మాసనం అంగీకరించలేదు. దాఖలైన పది పిటిషన్లలోనూ ప్రధానంగా చర్చకొచ్చిన అంశాలు... ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గోప్యత, ఎవరినీ సంప్రదించకపోవటం, అనుమతుల మంజూరులో పాటించిన విధానాలు సక్రమంగా లేకపోవడం వగైరాలు. మన ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగా వున్న వర్తమానంలో ఇంత భారీ వ్యయమయ్యే ప్రాజెక్టు అవసరమా అన్న ప్రశ్న కూడా వాటిల్లో వుంది. ఈ వ్యవహారంలో తాము కేవలం చట్టబద్ధత ఎంతన్నది చూస్తాం తప్ప ప్రభుత్వ విధానం సబబా కాదా అన్న జోలికి వెళ్లబోమని, దాన్ని పార్లమెంటులో చర్చించుకోవాలని మెజారిటీ తీర్పు రాసిన న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మెజారిటీ తీర్పునిచ్చిన న్యాయమూర్తులైనా, విడిగా తీర్పునిచ్చిన న్యాయమూర్తి అయినా ఒక విషయంలో మాత్రం ఏకీభవించారు...అది పారదర్శకత. ప్రజాస్వామ్యానికి అదెప్పుడూ ప్రాణప్రదమైనది.

దురదృష్టవశాత్తూ మన దేశంలో ఆ పారదర్శకతే లోపిస్తోంది. పార్లమెంటు మొదలుకొని అసెంబ్లీల వరకూ దేనిపైనా కూలంకషమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగటం లేదు. గొడవలు, గందరగోళం తప్ప మరేం కనబడటం లేదు. పర్యవసానంగా ఎంతో కీలకమనుకున్న ఆర్థిక బిల్లులు కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతున్నాయి. వేల కోట్ల రూపాయలు వ్యయమయ్యే ప్రాజెక్టులు నామమాత్రం చర్చతో చట్టసభల్ని దాటుకొస్తున్నాయి. పార్లమెంటులో సాగు బిల్లులపై సవివరమైన చర్చ జరిగివుంటే, అవి సెలెక్ట్‌ కమిటీకి వెళ్లివుంటే రైతుల ఉద్యమం ఈ స్థాయిలో రేగేది కాదు. కనుక సుప్రీంకోర్టు చెప్పినట్టు సెంట్రల్‌ విస్టాపై పార్లమెంటులో విస్తృత చర్చ జరిగితే బాగుండేది. అందువల్ల  ప్రాజెక్టుకు సంబంధించిన సమస్త అంశాలూ ప్రజానీకానికి అర్థమయ్యేవి. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకున్నప్పుడూ ఇదే ధోరణి. అందులో ఆవగింజం తైనా పారదర్శకత లేదు. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి జరిగే నష్టమెంతో వెల్లడించలేదు.  అటు రైతులకు మాత్రం వారి భూముల విలువ అపారంగా పెరిగి కోట్లాది రూపాయలు వచ్చి పడతాయని మభ్యపెట్టారు. 

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు అవసరమన్న కేంద్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూనే...దాని నిర్మాణం వల్ల పర్యావరణానికి తలెత్తగల సమస్యలను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అందుకే కాలుష్య నియంత్రణ కోసం స్మాగ్‌ టవర్లు ఏర్పాటు చేయాలని, నిర్మాణ సమయంలో దుమ్మూధూళి వల్ల వాతావరణం దెబ్బతినకుండా స్మాగ్‌ గన్‌లు వినియోగించాలని సూచించింది. అయితే ఇవి మాత్రమే పర్యావరణానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయా అన్నది ప్రశ్నార్థకం. వృక్షాలకు హాని కలగకుండా వాటిని కొత్త నిర్మాణాలకు అనుగుణంగా అక్కడే మరోచోటుకు లేదా వేరే ప్రాంతానికి భద్రంగా తరలించగలిగితే మంచిదేమో ఆలోచించాలి. కొన్ని దేశాల్లో ఈ మాదిరి చర్యలు విజయ వంతమయ్యాయి. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో కొన్ని భవంతులను యధాతథంగా వుంచుతారని, మరికొన్నిటిని తొలగించి కొత్తవి నిర్మిస్తారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన సమస్త వివరాలనూ ప్రజానీకానికి అందుబాటులో వుంచటం అవసరమని, సుప్రీంకోర్టు తాజా తీర్పు స్ఫూర్తి కూడా అదేనని కేంద్రం గుర్తించాలి. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు