తటస్థతకు తూట్లు పొడవొద్దు!

25 Oct, 2023 04:35 IST|Sakshi

పాలనా ప్రక్రియలో పాలుపంచుకునే ఉన్నతాధికార వర్గం ఆ ప్రక్రియలో పెనవేసుకుని వుండే రాజకీయ పార్శ్వానికి ఎప్పుడూ దూరంగా ఉంటుంది. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్‌)లో మంత్రులతోపాటు ఉన్నతాధికారవర్గం కూడా భాగస్వామే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మంత్రులు మారతారు. కానీ ఉన్నతాధివర్గం మాత్రం శాశ్వతం.

అందుకే పాలనాపరమైన విధి నిర్వహణ వేరు... రాజకీయ ప్రచారం వేరు అనే స్పృహ అధికార యంత్రాంగానికి ఎప్పుడూ ఉంటుంది. సివిల్‌ సర్వీసు నిబంధనలు సైతం ఉన్నతాధికారులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటానికి అంగీకరించవు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఒక సర్క్యులర్‌ ఆ విభజనను కాస్తా మటుమాయం చేస్తోంది.

గత తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ప్రచారం చేసేందుకు సీనియర్‌ అధికారులు దేశంలోని 765 జిల్లాలకూ, ఆ జిల్లాల్లోని 26 కోట్ల 90 లక్షల గ్రామాలకూ తరలివెళ్లాలని ఆ సర్క్యులర్‌ నిర్దేశించింది. జాయింట్‌ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి ఉన్నతాధికారులు ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాలట. వీరికి రథ్‌ ప్రభారీస్‌ (ప్రత్యేక అధికారులు)గా నామకరణం చేశారు.

కేంద్రంలోని రక్షణ మంత్రిత్వ శాఖ సహా  అన్ని శాఖలూ ఈ మాదిరి సర్క్యులర్‌నే విడుదల చేశాయి. రక్షణ శాఖ ఈ నెల 9న జారీ చేసిన ఉత్తర్వు మరింత విడ్డూర మైనది. వార్షిక సెలవుల్లో వెళ్లే సైనికులు తమ తమ నెలవుల్లో ‘సైనిక దూతలు’గా ప్రభుత్వ పథకా లను ప్రచారం చేయాలని ఆ ఉత్తర్వు పిలుపునిచ్చింది.

నవంబర్‌ 20 మొదలుకొని జనవరి 25 వరకూ ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ పేరుతో దీన్ని కొనసాగించాలన్నది సర్క్యులర్‌ సారాంశం. సరిగ్గా ఈ తేదీల మధ్యనే తెలంగాణ, రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికలుంటాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాక, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక ఇలాంటి యాత్రలు ఎంతవరకూ సమంజసమన్న సంగతలావుంచి... అసలు ఉన్నతాధికార వర్గం ఈ మాదిరి ప్రచారకర్తలుగా పని చేయటం సరైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

పథకాల గురించి అందరికీ తెలిసేలా అవసరమైన ప్రచార ఉపకరణాలను సంసిద్ధపరచుకో వటం ఏ ప్రభుత్వానికైనా అవసరం. అందుకోసమే ప్రభుత్వంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉంటుంది. ఆ శాఖ ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. తమ ప్రభుత్వమే మరో దఫా అధికారంలో కొనసాగేందుకు కావలసినదంతా చేస్తుంటుంది.

ఇందుకు బడ్జెట్‌లో కేటాయింపులుంటాయి. తమది ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలున్న రాజకీయ పార్టీ అని బీజేపీ చెప్పుకుంటుంది. ఆ పార్టీకి నోరున్న రాజకీయ నాయకుల లోటు కూడా లేదు. వీరందరినీ కాదని ప్రభుత్వ పథకాలనూ, వాటి ద్వారా సాధించిన ప్రగతినీ ప్రచారం చేసేందుకు ఉన్నతాధికార వర్గాన్ని దించాల నటంలో ఆంతర్యమేమిటన్నది అంతుపట్టని విషయం.

కార్యకర్తలు, నాయకుల కంటే ఈ అధికారు లకే విశ్వసనీయత ఉంటుందని పాలకులు అనుకుంటున్నారా? ‘అధికారులు కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోని కుర్చీలకు అతుక్కుపోవాలా? తాము రూపొందించిన పథకాల ప్రభావం క్షేత్ర స్థాయిలో ఎలా ఉందో తెలుసుకోవద్దా?’ అంటూ బీజేపీ నేతలు చేస్తున్న తర్కం అర్థరహితమైనది.

అలా తెలుసుకోవటానికీ, అవసరమైన మార్పులు చేసుకోవటానికీ పకడ్బందీ వ్యవస్థ అమల్లో ఉంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి. అవసరమైన సమాచారాన్ని సత్వరం పొందేందుకు ఎన్నో మార్గా లున్నాయి. ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలందరికీ అందించటానికి, అవి కేవలం లక్షిత వర్గాలకు మాత్రమే చేరేలా, దుర్వినియోగానికి తావులేకుండా చేయటానికి ఎన్నో నిబంధనలు అమల్లో కొచ్చాయి.

కానీ ఉన్నతాధికారులే స్వయానా ప్రచారకర్తలుగా మారాలనడం, అందువల్ల మాత్రమే ప్రజలంతా అన్నీ తెలుసుకోగలుగుతారనడం సమంజసం కాదు. ఈ క్రమంలో ఉన్నతాధికార వర్గం రాజకీయాలను అంటించుకుంటే పాలనావ్యవస్థకుండే తటస్థతకు జరిగే నష్టం తీవ్రమైనది.

వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఎలాగన్నది కార్యనిర్వాహక వర్గంలోని మంత్రులకు సంబంధించిన ప్రశ్న. అదే వ్యవస్థలో భాగస్థులైన ఉన్నతాధికారవర్గం పాలనా ప్రక్రియ సజావుగా సాగటానికి, పాలకుల విధానాలూ, వారి పథకాలూ లక్షిత వర్గాలకు చేరేలా చేయటంవరకూ పూచీ పడుతుంది. అంతకుమించి ఏం చేసినా దానికి రాజకీయ మకిలి అంటుతుంది. 

బ్రిటిష్‌ వలస పాలకుల హయాంలో ఉన్నతాధివర్గం పని... కేవలం శాంతిభద్రతలను పర్యవేక్షించటం, ఖజానాకు ఆదాయం సమకూర్చటం మాత్రమే! కానీ స్వాతంత్య్రం వచ్చాక అదంతా మారింది. సంక్షేమ రాజ్య భావన బలపడటంతో జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ పాలకుల సంక్షేమ విధానాల అమలు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి ఉన్నతాధికార వర్గం ప్రధాన కర్తవ్యా లయ్యాయి.

రాజకీయ అస్థిరత అలుముకున్న దశలో కూడా ఉన్నతాధికార వ్యవస్థ తటస్థంగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకత్వానికి అవసరమైన సలహాలిస్తూ పాలన సజావుగా సాగేందుకు దోహద పడుతోంది. సివిల్‌ సర్వీసు అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లో లేదా మతసంబంధ అంశాల్లో తలదూర్చరాదని ఈ సర్వీసు పథ నిర్దేశకుడైన స్వర్గీయ సర్దార్‌ పటేల్‌ హితవు చెప్పారు.

అందుకు పూర్తి భిన్నంగా పోయి పాలనావ్యవస్థకూ, సైనిక వ్యవస్థకూ రాజకీయ మకిలి అంటించి మన పొరుగునున్న పాకిస్తాన్‌ చివరికెలా అఘోరించిందో కనబడుతూనే ఉంది. అందువల్ల ఉన్నతాధికారగణాన్ని ప్రచారకర్తలుగా ఉరికించాలన్న సంకల్పాన్ని కేంద్రం విడనాడాలి. దాని తటస్థతను కాపాడాలి. 

మరిన్ని వార్తలు