ఊరూవాడా.. రిజల్ట్‌పై అటెన్షన్‌!

3 Dec, 2023 03:02 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జనంలో ఉత్కంఠ 

పొలంకాడి నుంచి హోటళ్లలో ముచ్చట్లదాకా ఇదే.. 

పార్టీలు, అభ్యర్థుల గెలుపోటములపై పందేలు 

సోషల్‌ మీడియాలో వచ్చే పోస్టులపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జనం దృష్టి అంతా ఫలితాలపైనే పడింది. ఊరూవాడా పల్లెపట్నం ఎక్కడ చూసినా.. చిన్నాపెద్దా ఎవరిని కదిలించినా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎవరెవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు? కేసీఆర్, కేటీఆర్, రేవంత్, ఈటల వంటి ప్రముఖ నేతల్లో ఎవరెవరికి ఎలాంటి ఫలితం ఎదురవుతుందన్న చర్చ కూడా సాగుతోంది.

పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీల నుంచి హోటళ్లలో, బస్టాండ్లలో పిచ్చాపాటీ దాకా ఎక్కడ నలుగురు కలసినా ఇదే తీరు. చివరికి ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో పరిచయస్తులు కనిపించినా ఎలక్షన్ల ప్రస్తావన రాకుండా ఉండటం లేదు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులపై విస్తృత విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల హీట్‌ కనిపిస్తోంది. 

పందెం కాస్తావా? 
పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చలు సాగుతుంటే.. వివిధ పార్టీల అభిమానుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కనిపిస్తున్నాయి. మేం గెలుస్తామంటే, మేం గెలుస్తామంటూ అభ్యర్థులు, పార్టీల తరఫున సరదా పందేలూ జరుగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయని, ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన బుకీలు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్‌మీడియా గ్రూపుల్లో హడావుడి చేస్తున్నారని తెలిసింది. సీఎం ఎవరవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై రూ.లక్షల్లోనే బెట్టింగులు సాగుతున్నాయి. కర్ణాటక, ఏపీ వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అక్కడి వారూ బెట్టింగ్‌లు కడుతున్నట్టు సమాచారం. 

సోషల్‌ మీడియాలో జోరుజోరుగా.. 
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నికల ఫలితాల అంచనాలు, విశ్లేషణలు పోటెత్తుతున్నాయి. ఎక్కడ ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాలు, ఊహాగానాలు క్షణం తీరిక లేకుండా పోస్టు అవుతున్నాయి. ఫోన్‌లో నోటిఫికేషన్‌ సౌండ్‌ వచ్చిందంటే చాలు చేతిలోకి తీసుకుని చెక్‌చేసుకుంటున్నారు. రాజకీయ పోస్టులను చదవడమే కాదు.. వాటిపై తమ అభిప్రాయాలు, అంచనాలనూ రిప్లైలో ఇస్తున్నారు. తమకు నచ్చినవాటిని ఆయా ప్లాట్‌ఫామ్‌లపై, గ్రూపుల్లో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్నది, ఎవరు ఓడుతారన్నది గందరగోళంగా మారిపోయింది.

మరిన్ని వార్తలు