కామారెడ్డి కింగ్‌ ఎవరో.?!

3 Dec, 2023 02:39 IST|Sakshi

వీవీఐపీ సెగ్మెంట్‌లో నరాలు తెగే ఉత్కంఠ 

కేసీఆర్, రేవంత్‌తో పాటు పోటీలో కేవీఆర్‌ 

మూడు పార్టీల్లోనూ గెలుపు ధీమా 

మరికొన్ని గంటల్లో తేలిపోనున్న భవితవ్యం 

సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి కింగ్‌ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి దిగారు. వీళ్లిద్దరికీ స్థానికుడైన జడ్పీ మాజీ చైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. కేసీఆర్‌ గెలుపు ఖాయమని బీఆర్‌ఎస్‌ నేతలు, రేవంత్‌రెడ్డి గెలుస్తాడంటూ కాంగ్రెస్‌ నేతలు నమ్మకంతో ఉన్నారు. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. 

కేసీఆర్‌ తరఫున కేటీఆర్‌ ఎన్నికల బాధ్యతలు 
సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గత నెల 9 న కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేసి అదే రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కేసీఆర్‌ తరపున ఎన్నికల బాధ్యతలను మంత్రి కేటీఆర్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎమ్మెల్సీ షేరి సుభాష్రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేపట్టారు. అలాగే మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, నాయకులు కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాలమల్లు, బాల్క సుమన్, అయాచితం శ్రీధర్‌ తదితరులు ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నారు. 

రేవంత్‌కి అండగా వచ్చిన రాహుల్, కర్ణాటక సీఎం 
గత నెల 10న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అదే రోజు ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్‌ సభ ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో పాల్గొన్నారు. 26న కామారెడ్డిలో నిర్వహించి బహిరంగ సభలో ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు.  

కేవీఆర్‌ కోసం వచ్చిన ప్రధాని మోదీ 
ఇద్దరు వీఐపీల మధ్య స్థానిక నేతగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. గత నెల 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. గత నెల 4న జిల్లా కేంద్రంలో జరిగిన బైక్‌ర్యాలీ, సభల్లో బీజేపీ రా్రష్్టర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఫలితంపై ఉత్కంఠ.. 
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది గంటల్లో షురూ అయి, మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మూడు పార్టీల నేతల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తోంది. పోలింగ్‌ ముగిసినప్పటి నుంచి ఎవరిలెక్కలు వారు వేసుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా తమ పార్టీకి వచ్చే ఓట్లపై కూడికలు, తీసివేతలు చేసి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయం ఎవరిని వరిస్తుందన్నది కాసేపట్లో తేలిపోనుంది.

మరిన్ని వార్తలు