ఉద్యమ దిగ్బంధం

4 Feb, 2021 00:40 IST|Sakshi

రెండునెలలుగా దేశ రాజధాని నగరం వెలుపల వేర్వేరుచోట్ల సాగుతున్న రైతుల ఉద్యమాన్ని అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు శ్రుతిమించిన దాఖలాలు కనబడుతున్నాయి. కనీవినీ ఎరుగని విధంగా పలు అంచెల్లో బారికేడ్లు నిర్మించటం, రోడ్లపై మేకులు నాటడం, ముళ్లకంచెలు, కందకాలు ఏర్పాటు వంటివి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవంనాడు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ అదుపు తప్పటం, కొందరు ఎర్రకోట ఆవరణలోకి చొరబడి అక్కడ రైతు జెండా, సిక్కు ఖల్సా జెండా ఎగరేయటం వంటి పరిణామాల అనంతరం దాన్ని అదుపు చేయటంలో విఫలమైన పోలీసుల తీరుపై విమర్శలు చెలరేగాక ఈ కొత్త పరిణామం చోటుచేసుకుంది.

ఉద్యమాలు కట్టుతప్పినప్పుడు, అవి హింసాత్మకంగా మారినప్పుడు అదుపు చేసేందుకు చాలా మార్గాలు న్నాయి. ఢిల్లీ దిశగా వస్తున్న రైతుల్ని ఆపడానికి అనేకచోట్ల లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు, వాటర్‌ కేనన్‌ ప్రయోగాలు పూర్తయ్యాయి. అదృష్టవశాత్తూ పరిస్థితి పోలీసుల కాల్పులవరకూ పోలేదు. అయితే ఇవన్నీ ఏదోమేరకు పనికొచ్చేవే తప్ప వాటివల్లే సర్వం సర్దుకుంటుందన్న అభిప్రా యానికి రావటం సరికాదు. ఇప్పుడు నిర్మిస్తున్న బారికేడ్లు, మేకులు నాటడం, ముళ్లకంచెలు, కంద కాలు... ఇంటర్నెట్‌ నిలిపేయటంవంటివి కూడా అంతే. 

గణతంత్ర దినోత్సవంనాడు జరిగిన హింస, విధ్వంసం... పోలీసులపై దాడులు వగైరాల విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. దాన్నెవరూ తప్పుబట్టరు. రైతు సంఘాల నాయ కులే ఆ మాట చెబుతున్నారు. తాము నిర్దేశించిన సమయంకన్నా చాలాముందే కొన్నిచోట్ల రోడ్లపైకి రైతులు వచ్చేలా ప్రేరేపించినవారెవరో ప్రభుత్వం తేల్చాలంటున్నారు. వారైతే దీప్‌సింగ్‌ సిద్ధూ పేరు చెబుతున్నారు. అతనితో ఉద్యమ సంస్థలకు సంబంధం లేదంటున్నారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరగటానికి, నేరం చేయదల్చుకున్నవాళ్లు జంకటానికి, నిరసనోద్యమాలు హద్దుమీరకుండా వుండేందుకు విజిబుల్‌ పోలీసింగ్‌ వ్యవస్థ వుంటుంది. భారీ సంఖ్యలో పోలీసు బలగం, వారి చేతుల్లో లాఠీలు, ఆయుధాలు, పోలీసు వాహనాలు వగైరాలు ఇందుకు తోడ్పడతాయి.

అయితే అంతకన్నా ముఖ్యం పోలీసు శాఖలోని నిఘా విభాగం. ఆ విభాగం నిరంతరాయంగా, చురుగ్గా పనిచేస్తుంటే ఎవరెవరి వ్యూహాలేమిటో, ఏం జరిగే అవకాశముందో ముందుగానే అంచనా వుంటుంది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనడం పోలీసు శాఖకు సులభమవుతుంది. కానీ గణతంత్ర దినోత్సవంనాడు ఈ రెండు అంశాల్లోనూ ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. అలాగే ర్యాలీలో పాల్గొన్న కొందరు ఎర్రకోటలోకి చొరబడుతున్నప్పుడు అక్కడ పటిష్టమైన భద్రతవున్న దాఖలా లేదు. ఆ లోపాలను సరిచేసుకుంటే మళ్లీ ఆనాటి ఘటనలవంటివి పునరావృతమయ్యే అవకాశం వుండదు. నిరసన వేదికలను దిగ్బంధించటం వాటికి విరుగుడు కాదు. ఇవి ఢిల్లీకి కొత్తగా వచ్చే ఉద్యమకారుల్ని ఆపడానికి ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పొచ్చు. కానీ ఈ చర్యలవల్ల తమకు నీళ్లు, ఆహారం అందటం, కాలకృత్యాలు తీర్చుకోవటం పెను సమస్యగా మారిందని రైతులు చెబుతున్నారు. ఈ తీరు ప్రభుత్వంపై వారిలో వున్న అసంతృప్తి, అపనమ్మకం పెరగటానికి తప్ప మరెందుకూ తోడ్పడదు.

అంతిమంగా చర్చించటం, ఒక పరిష్కారాన్ని అన్వేషించటం మాత్రమే ఉద్రిక్తతలను ఉపశమింపజేస్తాయి. ఉద్యమాలను చల్లారుస్తాయి. అసలు చట్టాలను తీసుకురావటానికి ముందే ప్రభావిత పక్షాలను విశ్వాసంలోకి తీసుకుని చర్చించివుంటే బాగుండేది. కేంద్ర ప్రభుత్వం ఆ మాదిరి చర్చించానని చెబుతోంది. కానీ అలా చర్చించివుంటే ఎంఎస్‌పీని చట్టబద్ధం చేయటం మొదలుకొని, కార్పొరేట్‌ సంస్థల పెత్తనం వరకూ అనేకానేక అంశాలపై రైతుల మనోభావాలేమిటో ప్రభుత్వానికి తెలిసేది. ఆ సంశయాలను పోగొట్టేవిధంగా చట్టాలకు రూపకల్పన చేయటం సాధ్యమయ్యేది. కనీసం బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడైనా విపక్షాలు కోరినట్టు వాటిని సెలెక్ట్‌ కమిటీకి పంపివుంటే ఇంత సమస్య తలెత్తేది కాదు.  ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గత ఆరేళ్లలో వివిధ సమస్యలపై దేశంలో అక్కడక్కడ ఉద్యమాలు తలెత్తాయి. వాటన్నిటితో పోలిస్తే ఇప్పుడు

జరుగుతున్న రైతు ఉద్యమం విస్తృతమైనది, సుదీర్ఘమైనది. పైగా రాజకీయంగా ఇది బీజేపీకి ఇబ్బంది కలిగించేది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గమైన జాట్‌లు చాన్నాళ్లుగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే హరియాణాలో కూడా రైతుల మద్దతువల్లనే బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ గలిగింది. అలాంటివారికి సైతం ఈ చర్య ఆగ్రహం కలిగించిందంటే కారణమేమిటో ఆలోచించ వలసిన అవసరం వుంటుంది. ఈ ఉద్యమంపై అంతర్జాతీయంగా పేరున్న పాప్‌ గాయని రిహానా, యువ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌ తదితర ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించటంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టీ ఈ ఉద్యమంపై పడింది. అలాగే పార్లమెంటు సమావేశాల్లో ఈ ఉద్యమ ప్రతిధ్వనులు వినబడుతున్నాయి.

ఉభయ సభలూ వాయిదాలతో సాగు తున్నాయి. మొన్న యూపీలోని ముజఫర్‌నగర్‌లోగానీ, ఇప్పుడు హరియాణాలోని జింద్‌లోగానీ జరిగిన సభలకు వేల సంఖ్యలో రైతులు హాజరయ్యారు. మహిళలు సైతం చురుగ్గా పాల్గొంటున్నారు. రెండునెలలుగా వణికిస్తున్న చలిగాలుల్ని కూడా తట్టుకుంటూ వృద్ధ రైతులు కూడా రోడ్లపైనే వున్నారు. మూడు సాగు చట్టాల రద్దు తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని రైతులు చెబుతు న్నారన్నది వాస్తవమే. అయితే సమస్యను సాగదీయటం వల్లనే ఆ పరిస్థితి ఏర్పడింది. వెనువెంటనే చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తామని చెబితే ఇలా జరిగేదికాదు.  కనుక అటు రాజకీ యంగా చూసినా, ఇటు శాంతిభద్రతల కోణంలో చూసినా రైతుల డిమాండ్లపై సాధ్యమైనంత త్వరలో పరిష్కారానికి ప్రయత్నించటం అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. 

>
మరిన్ని వార్తలు