రక్తసిక్త రైతు రాజకీయం

5 Oct, 2021 00:18 IST|Sakshi

ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయిన నిరసనను కాదంటే ఎలా? నిరసన చెబుతుంటే, వాళ్ళు శత్రువులే అన్న ఆలోచనా ధోరణితో ఉంటే ఎట్లా? ఎక్కి వచ్చిన మెట్లు మర్చిపోయి, అధికార పీఠంపై ఉన్నాం కాబట్టి ఎవరినైనా తొక్కేస్తాం, బండ్లతో తొక్కించేస్తామంటే కుదురుతుందా? ఉత్తరప్రదేశ్‌ (యూపీ)లోని లఖింపూర్‌ ఖేడీ జిల్లా తికునియా గ్రామం వద్ద పర్యటనకు వచ్చిన అధికార పక్ష బీజేపీ ఉపముఖ్యమంత్రికి నిరసన వ్యక్తం చేస్తున్న రైతు ఆందోళనకారులపైకి ఆదివారం వేగంగా వాహ నాలు ఎక్కించిన ఘటన దుస్సహం. అధికారం తెచ్చిన అహంకారానికి నిలువుటద్దం.

ఆ ఘటనలో నలుగురు రైతులు, అనంతరం కోపోద్రిక్త ఆందోళనకారుల హింసలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు సహా ఇప్పటికి 9 మంది ప్రాణాలు పోగొట్టుకున్న వైనం అత్యంత విషాదం. ఇరువర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ బీజేపీ సర్కారు శాంతి వచనాలు పలికి, లక్షల్లో నష్టపరిహారం, న్యాయవిచారణలకు ఆదేశించింది. కానీ, పోయిన అమా యక ప్రాణాలకు బాధ్యులెవరన్నది జవాబు లేని ప్రశ్న.

నాణానికి రెండు వైపులున్నాయి. మరికొద్ది నెలల్లో యూపీ ఎన్నికలున్నాయనగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రతిపక్షాలకు అనుకోకుండా అందివచ్చిన ఆయుధమైంది. బీజేపీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సహజంగానే ప్రయత్నిస్తుంటే, రక్తసిక్త ఘటనలపై రాజకీయం చేస్తున్నారంటూ అధికార పక్షం అంటోంది. ఆందోళనకారులపై బండి పోనిచ్చినవారికి సారథ్యం వహించినట్టూ, మూడు కార్లలో ఒకటి స్వయంగా నడిపినట్టూ ఆరోపణల్ని ఎదుర్కొంటున్నది మామూలు వ్యక్తి కాదు. సాక్షాత్తూ కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి గారి పుత్రరత్నం. ఆ మధ్య మోదీ మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కించుకున్న సదరు మంత్రివర్యులు అజయ్‌ మిశ్రా తేని మాత్రం ‘ఆ సమ యంలో మా వాడు (ఆశిష్‌ మిశ్రా) అసలు సంఘటనా స్థలంలోనే లేడు’ అంటున్నారు. అవసరమైతే ఫోటో, వీడియో సాక్ష్యాలు చూపిస్తానంటున్నారు. అంతటితో ఆగక, ఇందులో ఏకంగా ‘ఖలిస్తాన్‌ హస్తం’ ఉందని అంతర్జాతీయస్థాయి ఆరోపణలు చేస్తుండడం విచిత్రం.

రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షీయులు నిరసన గళం విప్పడం, ఏ ఘటన జరిగినా అక్కడ కెళ్ళి బాధితుల పక్షాన నిలబడి, నైతిక మద్దతు ఇవ్వడం సాధారణం. కానీ, లఖింపూర్‌లో ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వడానికి యోగి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాంగ్రెస్‌ యూపీ ఇన్‌ఛార్జ్‌ ప్రియాంకా గాంధీ వద్రా, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ సహా పలువురు ప్రతిపక్ష నేతలను ఆ ఊరికి వెళ్ళకుండా అడ్డుకున్నదీ, నిర్బంధించినదీ అందుకే! పొరుగున ఉన్న పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి రావాలనుకున్నవారి సంగతి వేరుగా చెప్పనక్కర లేదు. ఈ రాజకీయాల మాట అటుంచితే, ‘దెబ్బకు దెబ్బ కొట్టి, రైతు ఉద్యమకారులకు గుణపాఠం చెప్పా’లంటూ అధికారంలో ఉన్నవారు అంటున్న మాటలు, అనుసరిస్తున్న వైఖరి మరింత ఆందోళనకరం. లఖింపూర్‌ ఘటన జరిగిన ఆదివారమే హర్యానా బీజేపీ ముఖ్యమంత్రి ఖట్టర్‌ ‘రైతులను లాఠీలతో కొట్టండి. జైలు పాలైతే, మేం చూసుకుంటాం’ అని తమ శ్రేణులతో అన్నారంటే ఇంకేం చెప్పాలి! కొద్దిరోజుల క్రితం అజయ్‌ మిశ్రా సైతం ఓ సభలో ఇలాంటి మాటలే అన్నారు. చివరకు లఖింపూర్‌లో అదే జరిగింది.

వ్యవసాయాధారిత భారతదేశంలో 2020 సెప్టెంబర్‌లో చేసిన మూడు వివాదాస్పద కొత్త సాగు చట్టాలు తమకు ఉరితాళ్ళని రైతుల వాదన. దీని మీద ఇప్పటికి దాదాపు ఏడాదిగా వారు ఘోషిస్తూనే ఉన్నారు. ఢిల్లీ శివారుల్లో శిబిరాల్లో ఉంటూ, నిరసిస్తూనే ఉన్నారు. కానీ, వారి గోడు కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు పట్టించుకుందన్నది సందేహమే. తాజా లఖింపూర్‌ ఘటనలో నిందితులపై చర్యలు లేవు. కొడుకు మీద ఇంత గోలవుతూ, రాజీనామా డిమాండ్లు వస్తుంటే మంత్రి గారు కుర్చీ వదలకుండా కూర్చున్నారు. బాధితులకు బాసటగా నిలిచే నేతలను మాత్రం సర్కార్‌ నిర్బంధిస్తోంది. ‘ఇదెక్కడి న్యాయం’ అన్నది ప్రియాంక ప్రశ్న. రానున్న యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ఆమె ముందుకొచ్చే అవకాశాలు ఈ ఘటనతో మరింత పెరగడం దీని రాజకీయ పర్యవసానం.

మరోపక్క కొత్త సాగు చట్టాల అమలుపై జనవరిలోనే స్టే విధించాం కనుక, రైతులు ఇప్పటికీ నిరసన చేయడం ఏమిటన్నది సుప్రీమ్‌ కోర్టు ప్రశ్న. నిరసన తెలిపే హక్కు సర్వతంత్ర స్వతంత్రమేమీ కాదనీ, కోర్టుకెక్కాక వీధికెక్కి నిరసనలేమిటనీ అంటోంది. ఢిల్లీ శివార్లలో నిరసన చేస్తున్న రైతులు రోడ్లను దిగ్బంధిస్తున్నారనే అభియోగంపై కోర్టు ఇలా అభిప్రాయపడింది. 43 రైతు సంఘాల నేతలకు నోటీసులిచ్చింది. కానీ, అనేక అంశాలపై జోక్యం చేసుకొని, ప్రభుత్వానికి మార్గదర్శనం చేస్తున్న న్యాయవ్యవస్థ ఎందుకనో ఏడాదిగా సాగుతున్న రైతు ఉద్యమంపై ఆ పంథాలో వ్యవహ రిస్తున్నట్టు లేదు. కోరినట్టు నిపుణుల సంఘం మార్చిలోనే నివేదిక ఇచ్చినా, అతీగతీ లేదు.

కేంద్రం సైతం రైతు సమస్యల పరిష్కారంలో మధ్యేమార్గంపై శ్రద్ధ పెట్టడం లేదు. అవాంఛనీయ ఘటనలప్పుడు మాత్రం ‘మేము చేస్తే వ్యాపారం, మీరు చేస్తే మరేదో’ అన్నట్టు అధికార, విపక్షాల పరస్పర మాటల యుద్ధాలున్నాయి. నిజానికి, తాజా ఘటనపై సర్కారు వారి న్యాయవిచారణలో సంచలనాలేవో బయటపడతాయన్న భ్రమ ఎవరికీ లేదు. ఎన్నికల వేళ రక్తసిక్త శవరాజకీయాలు ఆగే సూచనా కనిపించట్లేదు. కానీ, ఒకటే ప్రశ్న. అత్యున్నత న్యాయస్థానమే అన్నట్టు్ట, లఖింపూర్‌ లాంటి ఘటనలకు ఎవరిది బాధ్యత? ఆవిరైపోయిన అమాయక ప్రాణాలకు ఎవరు జవాబుదారీ? 

మరిన్ని వార్తలు