ఈ లెక్క తేలేదేనా?

24 Jul, 2021 00:00 IST|Sakshi

సత్యం వేరు... సాంకేతికంగా చూపించే లెక్క వేరు! ఆ సంగతి కొందరు పాలకులకు బాగా తెలుసు. ఈ మధ్యే పదవి చేపట్టిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ కూడా అప్పుడే ఆ సంగతి ఒంటబట్టించుకున్నట్టున్నారు. అందుకే కావచ్చు... సాక్షాత్తూ పార్లమెంట్‌ సాక్షిగా ఆమె కరోనా సెకండ్‌ వేవ్‌ వేళ దేశంలో ఆక్సిజన్‌ కొరతతో ఎవరూ మరణించలేదని నిష్పూచీగా చెప్పేశారు. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమైన ఆ ప్రకటన దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత తలెత్తిన మాటను ఒకపక్క ఒప్పుకుం టూనే, మరోపక్క దాని వల్ల మరణాలంటూ ఏవీ లెక్కల్లో లేవని మంత్రి గారు చెప్పడం విడ్డూరం.

ఆక్సిజన్‌ కొరత మరణాలంటూ ఎక్కడా లెక్క చూపలేదన్నది సాంకేతికంగా – మెడికో లీగల్‌ కేసుల పరంగా నిజమే కావచ్చు. కానీ, ఈ ఏప్రిల్, మే నెలల్లో ఆక్సిజన్‌ అందక ఢిల్లీ, జైపూర్‌ ఆస్ప త్రులతో సహా అనేకచోట్ల ఎంతెంత మంది అర్ధంతరంగా కన్నుమూశారో ఏకంగా అంతర్జాతీయ వార్తల్లో వచ్చింది. ఆసుపత్రుల్లో పడకల కోసం, ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం జనం పడ్డ అవస్థలు తెలుసు. సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన విజ్ఞప్తులు, సిలిండర్ల సరఫరాను ఆపారంటూ రాష్ట్రాల మధ్య పంచాయతీలూ, అధిక రేట్ల బ్లాక్‌మార్కెటింగ్‌– అన్నీ నేటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. బాధిత కుటుంబాలకు కళ్ళ నీళ్ళు తెప్పిస్తున్నాయి. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి, రాష్ట్రాలిచ్చిన లెక్కలను బట్టి, ఆక్సిజన్‌ కొరత మరణాలు లేవన్నారట. కేంద్రంలోని పాలక బీజేపీ ఇలా సమర్థించుకోవాలని చూస్తుంటే ఏమనాలి? అదేమంటే, అప్పట్లో ఆక్సిజన్‌ కొరత అంటూ కేంద్రాన్ని ఇరుకునపెట్టిన ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తీరా లెక్కల్లో మాత్రం ప్రత్యేకంగా ఆక్సిజన్‌ కొరత మరణాలంటూ పేర్కొనలేదని పాలకపక్షం విమర్శిస్తోంది. 

అసలు ఆ సమాచారం కేంద్రం అడిగిందా? అడిగినా రాష్ట్రాలు ఇవ్వలేదా అన్నది ప్రశ్న. కేంద్రం ఆ వివరాలు అడగనే లేదనీ, అడగకుండానే రాష్ట్రాలు ఇవ్వలేదంటారేమిటని కాంగ్రెస్‌ పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు గురువారం నిగ్గదీశాయి. ఉదాహరణకు, సెకండ్‌ వేవ్‌ విలయ తాండవంలో రాజస్థాన్‌లో దాదాపు 6500 మంది చనిపోతే, అందులో అధిక శాతం మంది ఆక్సిజన్‌ అందక ప్రాణాలు పోయినవారే! ఇది ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రే చెబుతున్న లెక్క. దేశమంతటా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కాగా, రాష్ట్రాలను కేంద్రం అడిగిన కరోనా లెక్కల సమాచారంలో ‘ఆక్సిజన్‌ కొరత వల్ల మరణాలు’ అనే విభాగమే లేదు. ఆ సంగతి ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ కుండబద్దలు కొట్టింది. ‘అడిగారా, ఇచ్చారా– లేదా’ అన్నది పక్కనబెడితే కరోనా మరణాలకు ప్రధాన కారణం ఏమిటో పాలకపక్షానికీ తెలుసు. కర్ణాటక, గోవా, ఢిల్లీలలో అక్కడి కోర్టులు ఆక్సిజన్‌ కొరత మరణాలపై ఇటీవల వివిధ రకాల ఉత్తర్వులు ఇచ్చిన సంగతీ చూశాం. సత్యం తెలిసి, చూసి కూడా రాష్ట్రాలిచ్చిన డేటాలో లేదనే సాంకేతికపరమైన సాకు చూపితే? ప్రత్యేకంగా నమోదు చేసే పద్ధతి లేదు కాబట్టి, అసలు ఆక్సిజన్‌ కొరత మరణాలే లేవంటే? అది అన్యాయం! ఆత్మవంచన! అందరినీ నమ్మించాలని చూస్తే నయ వంచన!

ఆ మాటకొస్తే– ఆక్సిజన్‌ కొరత మరణాలనే కాదు... అసలు కరోనా మరణాలనైనా పాలకులు సరిగ్గా లెక్క చెబుతున్నారని నమ్మలేం. దేశం మొత్తం మీద ఇప్పటికి 4.18 లక్షల మంది మరణిం చారని కేంద్రం లెక్క. కరోనా పాజిటివ్‌ అని తేలినవాళ్ళలో అది 1.34 శాతమే. అందులో 2.35 లక్షల మంది రెండో వేవ్‌ ఉద్ధృతిలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య మూడు నెలల్లోనే మరణిం చారట. అంటే, ఇప్పటి వరకు దేశంలో జరిగిన కరోనా మరణాలలో 56 శాతం ఈ మూడు నెలల్లో జరిగినవే. అసలు లెక్కలు ఈ తగ్గింపు లెక్కల కన్నా ఎక్కువేనని అనేక అధ్యయనాలు ఘోషిస్తు న్నాయి. పోనీ ఆ మాట అటుంచినా, వీటిలో ఏ ఒక్కటీ ఆక్సిజన్‌ కొరత చావు కాదంటున్న ప్రభుత్వ ఉద్ఘాటనను ఎంతటి అమాయకులైనా ఎలా నమ్ముతారు! ఇదంతా చూస్తే, ‘కళ్ళెదుటి అంతెత్తు ఏనుగూ లేదు... అది పారిపోవడమూ లేదు’ (గజం మి«థ్య, పలాయనం మి«థ్య) అనే చిన్ననాటి అసత్యవాద కథ గుర్తొస్తుంది. కరోనా కట్టడి, ఆక్సిజన్‌ సరఫరా తన చేతిలో ఉన్న కేంద్రం మాటలు వింటే, అచ్చం అలాగే... ‘ఆక్సిజన్‌ కొరత మిథ్య. దానివల్ల చావులూ మిథ్య’ అనుకోవాలి. ఇంకా నయం... ఏకంగా ‘కరోనానే మిథ్య’ అనడం లేదని సంతోషించాలి. 

కరోనా వచ్చి ఏణ్ణర్ధం దాటినా ఇప్పటికీ మన పాలకులకు సమస్యపై సరైన అవగాహన, సత్యాన్ని ధైర్యంగా చెప్పే బాధ్యత లేవేమో అని అనుమానం కలుగుతోంది. రెండో వేవ్‌ ఉద్ధృతిలో ఎదురైన సమస్యలు, వైఫల్యాలు, విజయాలు– అన్నింటినీ సాకల్యంగా సింహావలోకనం చేసుకొని, పార్లమెంట్‌ సాక్షిగా చర్చించుకోవడానికి ఇది సరైన సమయం. జరిగిన తప్పులను ఆత్మపరిశీలనతో సరిదిద్దుకొని, మరిన్ని వేవ్‌లు రావడానికి ముందే భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధం కావడం పాలకుల కర్తవ్యం. అదే ప్రజలకూ ఉపయోగం. ఆక్సిజన్‌ కొరత మరణాల అంశంతో మొదలుపెట్టి అవన్నీ నిజాయతీగా కలబోసుకొనే అవకాశాన్ని మోదీ సర్కార్‌ చేజార్చుకుంది. అదే విచారకరం. కట్టెదుటి కఠిన సత్యాన్ని అంగీకరించి, తప్పులు ఒప్పుకొని, చక్కదిద్దుకోవాల్సింది పోయి... ‘సాంకేతికంగా సరైనదే మాట్లాడాం’ లెమ్మని సంతృప్తి పడితే, ప్రజలు క్షమించరు. కొంగుతో కప్పేయాలనుకుంటే నిప్పులాంటి నిజాలు దహించివేస్తాయి. ఒళ్ళు కాలక ముందే పాలకులు కళ్ళు తెరుస్తారా? 

మరిన్ని వార్తలు