వేడెక్కిస్తున్న సభాసమయం!

1 Dec, 2021 02:58 IST|Sakshi

ప్రజాసమస్యలు చర్చించడానికి అత్యున్నత వేదిక. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయడానికి వీలు కల్పించే పవిత్ర భూమిక. చట్టసభలకు, సభ్యులకు మహోన్నత లక్ష్యం, లక్షణాలు చాలానే! కానీ, పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు సోమవారం మొదలైన తీరు చూసినప్పుడు ఆవేదన కలగక మానదు. సమస్యలనూ, చేయాల్సిన చట్టాలనూ చర్చించాల్సిన వేదిక ఆ బాధ్యతలో విఫలమవు తోందా అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. వివాదం రేపిన నూతన సాగు చట్టాలను రద్దు చేసే బిల్లును చర్చ లేకుండా పార్లమెంట్‌ ఆమోదించిన తీరు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 

మరోపక్క గడచిన వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారంటూ 12 మంది రాజ్య సభ సభ్యులను ఈ సమావేశాలు మొత్తానికీ సస్పెండ్‌ చేయడం సైతం చర్చనీయాంశమైంది. బల్లల మీదెక్కి, కాగితాలు చించి విసిరికొట్టి, మార్షల్స్‌తో అనుచిత ప్రవర్తనకు పాల్పడడమే కాక ఎదురు పాఠాలు చెబుతారేమిటని రాజ్యసభ ఛైర్మన్‌ ప్రశ్నిస్తున్నారు.

సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ప్రతిపక్షాలు ఏకతాటి మీదకు వచ్చి, మంగళవారం రాజ్యసభను బాయ్‌కాట్‌ చేశాయి. క్షమాపణ చెబితే తప్ప, సస్పెన్షన్‌ ఎత్తివేయమన్నది ప్రభుత్వ వాదన. బిగుస్తున్న పీటముడిని చూస్తుంటే, ఈ పార్లమెంట్‌ సమావేశాలూ కృష్ణార్పణమేమోనన్న భయం కలుగుతోంది. చట్టసభల్లో చర్చల కన్నా వాదోపవాదాలు, గందరగోళాలే ఎక్కువ జరుగుతున్నాయన్న అప్రతిష్ఠకు ఆజ్యం పోస్తోంది. 

అధికారపక్షం నుంచి ప్రతిపక్షాల దాకా అందరికీ ఈ తిలాపాపం తలా పిడికెడు. గత సమావే శాల్లో పెగసస్‌ సహా అనేక అంశాలు సభ ముందున్నాయి. ఆ సమయంలో ఆవేశాలు పెరిగిన ఆగస్టు 11న పెద్దలసభలో సభ్యుల ప్రవర్తనకు... అప్పుడు కాక, ఈ సమావేశాల్లో కొరడా ఝళిపించడం ఏమిటన్నది ప్రశ్న. శిక్ష విధించే ముందు నిందితుల వాదనా వినడం ధర్మం. కానీ, సస్పెన్షన్‌ విధించే ముందు సదరు సభ్యులకు సమాచారమివ్వలేదు, వాదనను వినలేదన్నది మరో బలమైన విమర్శ. ఈ మొత్తంలో పార్లమెంటరీ పద్ధతులనే పాటించలేదన్న ఆరోపణకు జవాబులు వెతకాల్సి ఉంది. 

ఇక, ఏడాది పాటు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు నిరసన ప్రదర్శనకు కూర్చోవడానికి కారణం – కొత్త సాగు చట్టాలు. వాటిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఆమోదిస్తున్నప్పుడు జరిగిన చర్చ శూన్యం. ఇప్పుడా చట్టాల్ని రద్దు చేస్తూ సోమవారం బిల్లు ప్రవేశపెట్టినప్పుడూ, చర్చ హుళక్కి. దాదాపు 750 మంది దాకా రైతుల బలిదానానికి కారణమైన చట్టాలపై చర్చ అప్పుడూ లేదు, ఇప్పుడూ చేయలేదేమిటన్న ఆవేదన సమంజసమైనదే. బయటి వేదికలపై ఏడాదికి పైగా చర్చోపచర్చలు జరిగిన అంశంపై ప్రజా ప్రతినిధుల సభలో చర్చే లేకపోవడం దేనికి సంకేతం? చట్టాల రద్దు బిల్లునూ చర్చే లేకుండా నాలుగే నిమిషాల్లో లోక్‌సభలో ఆమోదించడం ఎలా చూసినా ప్రశ్నార్హమే. 

ఏకంగా 11 విడతల చర్చలు జరిపినా, రైతు నిరసనకారులను ప్రభుత్వం ఒప్పించలేకపోయిన చట్టాలవి. సుప్రీం కోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చిన అంశం అది. జాతీయ ప్రయోజనాల రీత్యా ప్రధాని వాటిని వెనక్కితీసుకోవడం హర్షణీయమంటూ మంత్రులు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. కానీ, ఆ ప్రయోజనాలేమిటో చట్టసభలో చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? పంటలకు రైతులు కోరుతున్న కనీస మద్దతు ధర చట్టం, లఖిమ్‌పూర్‌ ఖేరీ ఘటన లాంటì  వాటిపై చర్చించాలన్న కోరిక న్యాయం కాదా? జాతిని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ క్షమాపణలు చెప్పడం, ట్వీట్లు పెట్టినంత మాత్రాన అవి పార్లమెంటులో జరగాల్సిన చర్చకు ప్రత్యామ్నాయం అవుతాయా? అయినా మెజారిటీ ఉంది కాబట్టి, చర్చలతో పని లేదనుకుంటే, పార్లమెంటరీ సూత్రాలకే అది దెబ్బ!

ఎలాంటి చట్టమైనా చేసే ముందు దానిపై క్షుణ్ణంగా చర్చే ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికీ ఉన్న పెద్ద తేడా. అందుకోసమే సభలో చర్చించడమే కాక, అవసరాన్ని బట్టి సెలక్ట్‌ కమిటీలు, పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు పంపే ఏర్పాటు కూడా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ, ఇప్పుడు అలా జరుగుతోందా? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తొలి విడత పాలనలో కేవలం 25 శాతం బిల్లులు, రెండో విడతలో 10 శాతం బిల్లులే ఆ అదృష్టానికి నోచుకున్నాయట. అందుకే రాజ్యాంగం పవిత్రం, పార్లమెంట్‌ దేవాలయం అనడం బాగున్నా, దాన్ని ఏ మేరకు ఆచరిస్తున్నామో అఖిలపక్ష సమావేశానికి సైతం రాని పాలకులు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది.  

ఇక సహచర రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌ నేపథ్యంలో ఈ శీతకాల సమావేశాల్ని పూర్తిగా బహిష్కరించాలని కూడా కొన్ని ప్రతిపక్షాలు భావిస్తున్నట్టు వార్త. ఇది మరింత బాధాకరం. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చేమో కానీ, ప్రజా ప్రతినిధులు పదే పదే బహిష్కరణ మంత్రం పఠిస్తే... అది బాధ్యతను విస్మరించడమే. అలాగే, చట్టసభలో అనుచిత ప్రవర్తనను ఎవరూ సమర్థించరు. అలాంటివారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందే. అలాగని కక్ష సాధించినట్టు ఉండకూడదు.

అధికారంలో ఉన్నవారే పెద్ద మనసుతో, పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ, ఇరుపక్షాలూ భీష్మించుకొని పార్లమెంటరీ ప్రతిష్టంభనకు కారణమైతే, 26 బిల్లులు సభ ముందుకు రానున్న ఈ సమావేశాలూ వృథాగా ముగిసిపోతే అది మరింత శోచనీయం. దాని వల్ల ఆర్థిక నష్టం పదుల కోట్లలో ఉంటుందేమో కానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి కలిగే నష్టం మాత్రం కంటికి కనిపించనంత! కొలిచి చెప్పలేనంత!! అన్ని పక్షాలూ ఆలకించి తీరాల్సిన ప్రజాస్వామ్యవాదుల మొర ఇది!! 

>
మరిన్ని వార్తలు