అమెరికా–ఉత్తరకొరియా సవాళ్లు 

7 May, 2021 03:50 IST|Sakshi

అమెరికా అధ్యక్షులుగా ఎన్నికయ్యేవారికి సొంతింటిని చక్కబెట్టుకోవడంతోపాటు ప్రపంచాన్ని కూడా ‘దారి’కి తేవడం అదనపు బాధ్యత. వేరే దేశాల అధినేతలకు ఈ బెడద వుండదు. ప్రజానీకం యోగక్షేమాలకు, సంక్షేమానికి అవసరమైన విధానాలు రూపొందిస్తే... ఇరుగు పొరుగున చికాకు పెట్టే ధూర్త దేశాలను అదుపు చేస్తే చాలు. దేశీయ పరిశ్రమలకు ప్రపంచంలో మంచి మార్కెట్‌ సృష్టించడం, బహుళజాతి సంస్థలకు స్వదేశంలో సమస్యలు లేకుండా చూడటం మాత్రం తప్పదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వదేశంలో అమలు చేస్తున్న విధానాలకు పౌరులనుంచి ప్రశంసలొస్తున్నాయి. చానెళ్లు చూసేవారిని హడలెత్తించేలా విలేకరుల సమావేశాల్లో అందరినీ దూషించడం, మహిళలపైనా, మైనారిటీ జాతులపైనా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో తరచు చూసిన ప్రజానీకం ఆయన్ను ఇక వద్దనుకున్నారు. ఇప్పుడు బైడెన్‌తో ఆ బాధ లేదు. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా కనబడతారు. చేయదల్చుకున్నది చెబు తారు. మీడియా ప్రశ్నలకు జవాబులిస్తారు. నిష్క్రమిస్తారు. అయితే స్వరం తగ్గించి, ప్రశాంతంగా కనబడినంత మాత్రాన ఆయన గత అధ్యక్షులకు భిన్నంగా ఏమీ వ్యవహరించడం లేదు. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా విధానాలను తిరగరాయడం లేదు. అఫ్ఘానిస్తాన్, ఇరాన్‌ అంశాల్లో ట్రంప్‌ మార్గాన్నే అనుసరిస్తున్నారు. ఉత్తరకొరియా అంశంలోనూ అంతే. ఇటీవల ప్రతినిధుల సభలో బైడెన్‌ మాట్లాడుతూ ప్రపంచానికి ఉత్తర కొరియా, ఇరాన్‌ అణు కార్యక్రమాలు పెద్ద బెడదగా తయారయ్యాయని అన్నారు. దానికి కొనసాగింపుగా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సైతం ఉత్తర కొరియాను గట్టిగా హెచ్చరించారు. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహిత ప్రాంతంగా మార్చడానికి ఉత్తర కొరియా దౌత్య మార్గాల్లో ప్రయత్నిస్తుందో లేదో తేల్చుకోవాలని సూచించారు. అది కుదరకపోతే వేరే మార్గాల్లో దాన్ని సాధించే యోచన చేస్తామన్నారు. ఇలా మాట్లాడితే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సహించరు. అందుకే ఇష్టానుసారం మాట్లాడితే ‘చాలా తీవ్ర పరిస్థితి’ని ఎదుర్కొనాల్సి వస్తుందంటూ అమెరికాను హెచ్చరించారు. ట్రంప్‌ హయాంలో 2019లో ట్రంప్‌–కిమ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరిగినా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఉత్తర కొరియా అణ్వస్త్ర కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని, ఆ తర్వాత దాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని, ఆంక్షలు తొలగిస్తామని ట్రంప్‌ అప్పట్లో చేసిన ప్రతిపాదనలు కిమ్‌కు నచ్చలేదు. ఇరువురూ ఒక ఒప్పందంపై సంతకాలు చేస్తారని ముందుగా ప్రకటించినా చివరకు అదేమీ లేకుండా ఆ పర్వం ముగిసింది. 

రెండు అణు కేంద్రాల్లో ఒకటి ధ్వంసం చేయడానికి కిమ్‌ అంగీకరించారు. అందుకు ప్రతి ఫలంగా మొత్తం ఆంక్షల్ని ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. కానీ రెండో కేంద్రం మాటేమిటని ట్రంప్‌ ప్రశ్నించారు. అది కూడా ధ్వంసం చేస్తేనే ఆంక్షలు ఎత్తేస్తామన్నారు. చర్చల వైఫల్యానికి కిమ్‌ వేరే కారణాలు చెప్పారు. ఉత్తర కొరియాపై విధించిన 11 ఆంక్షల్లో కేవలం అయిదింటిని మాత్రమే రద్దు చేయాలని కోరామన్నారు. అయితే ఈ అయిదూ అత్యంత కీలకమైనవి. అవి రద్దయితే ఇక ఉత్తర కొరియా మొండికేస్తుందని దాని అభిప్రాయం. నిజానికి ట్రంప్‌–కిమ్‌ చర్చలకు ఏడాది ముందు ఉభయ కొరియాల అధినేతలిద్దరూ కలుసుకున్నారు. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతల కోసం సమష్టిగా పనిచేస్తామని ప్రతినబూనారు. కనుకే ట్రంప్‌–కిమ్‌ చర్చలపై ప్రపంచ దేశాలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. కొరియాల శత్రుత్వం సుదీర్ఘమైనది. ఏడు దశాబ్దాలుగా అవి రెండూ సాంకేతికంగా యుద్ధంలోనే వున్నాయి. వాస్తవ యుద్ధం 1950–53 మధ్య జరిగినా ఇరువైపులా జరిగిన జన నష్టం అపారమైనది. దాదాపు 12 లక్షలమంది మరణించారు. ఆ తర్వాత కుదిరిన ఒప్పందంపై అమెరికా, ఉత్తర కొరియా, చైనాలు సంతకాలు చేశాయి. దక్షిణ కొరియాకు అది ససేమిరా సమ్మతం కాలేదు. పైగా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తర్వాతకాలంలో అమెరికా దక్షిణ కొరియాలో అణ్వాయుధాలు మోహరించింది. అదే సమయంలో ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియా నిరాయుధం కావాలని కోరింది. నాటి అమెరికా అధ్యక్షుడు కార్టర్‌ 1994లో దీర్ఘ శ్రేణి క్షిపణుల ఉత్పత్తిని నిలిపేయడానికి ఉత్తర కొరియాను ఒప్పించారు. ఒప్పందం కుదరబోతున్న దశలో ఆయన నిష్క్రమించి, జార్జి బుష్‌ వచ్చారు. దాంతో ముసాయిదా ఒప్పందం అటకెక్కింది. 

ట్రంప్‌ హయాంలోనైనా, ఇప్పుడైనా అమెరికా అనుసరిస్తున్న విధానంలో మౌలిక తప్పిదం ఒకటుంది. ఉత్తర కొరియాను ఒప్పించాలంటే ఆ చర్చల్లో చైనాను కూడా భాగస్వామిగా మార్చడం తప్పదు. ఎందుకంటే ఉత్తరకొరియాను అన్నివిధాలా ఆదుకుంటున్నది ఆ దేశమే. దాని ప్రమేయం లేకుండా ఒప్పందం కుదిరితే దానివల్ల ప్రమాదం చైనాకే. కొరియా ద్వీపకల్పంలో అమెరికా పలుకు బడి పెరిగితే పొరుగునున్న చైనా భద్రతకు పెను ముప్పు తప్పదు. అందువల్ల కిమ్‌ సహాయ నిరాకరణ వెనక ఖచ్చితంగా చైనా వుంటుంది. దాన్ని భాగస్వామిని చేసేవరకూ ఆయన వైఖరి మారదు. 1953లో చైనా వల్ల సాధ్యపడిన ఒప్పందాన్ని ఇప్పుడు దానికి చోటులేకుండా చేసి కుదు ర్చుకుందామని చూస్తే సాధ్యపడదు. ఆ ప్రాంతంలో శాంతి స్థాపనే నిజమైన లక్ష్యమైతే చైనాకు భాగస్వామ్యం ఇవ్వడమే వివేకవంతమైన చర్య. ఈ విషయంలో బైడెన్‌ ఒక అడుగు ముందుకే యాలి. అది అంతిమంగా ఆయనకే కీర్తి ప్రతిష్టలు తెస్తుంది.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు