స్పందనలో 222 అర్జీల స్వీకరణ

28 Mar, 2023 00:38 IST|Sakshi

ఏలూరు(మెట్రో): స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, అగ్రికల్చర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, డ్వామా పీడీ రాంబాబు, ఆర్డీఓ పెంచల కిషోర్‌ తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి అర్జీ గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కార నివేదికకు అర్జీదారుని సమస్యకు సంబంధించిన ఫొటోలను తప్పనిసరిగా జతచేయాలన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో 222 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఏలూరు 15, 18 డివిజన్లలోని మురుగునీరు, ఇతర సమస్యలు పరిష్కరించమని మణి రాజు అర్జీ అందజేశారు. బుట్టాయగూడెం మండలం అలివేరు గ్రామానికి చెందిన కారం లక్ష్మి స్కూలుకి వాటర్‌ ట్యాంకు, మరుగుదొడ్లు మరమ్మతు లేదా కొత్తగా నిర్మించడం చేయాలని అర్జీ సమర్పించారు. దెందులూరు మండలం పోతునూరుకు చెందిన సీహెచ్‌ హరికృష్ణ ఊరికి మధ్యలో పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేస్తున్నారని దాని పక్కనే వాటర్‌ ట్యాంక్‌ ఉందని పెట్రోల్‌ బంకు నిర్మాణం నిలిపివేయాలని అర్జీ సమర్పించారు.

మరిన్ని వార్తలు