ఓన్లీ సూపర్‌స్టార్‌

10 Dec, 2023 04:38 IST|Sakshi

వైరల్‌

1970లలో బొంబాయి మొత్తంలో 10 ఇంపాలా కార్లు ఉంటే వాటిలో ఒకటి జూనియర్‌ మెహమూద్‌ది. 1960–70ల మధ్య సినిమాల్లో జూనియర్‌ మెహమూద్‌ ఒక సూపర్‌స్టార్‌లా  వెలిగాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అతని ప్రాభవం వైరల్‌గా ఉండేది. శుక్రవారం జూనియర్‌ మెహమూద్‌ కన్నుమూశాడు. అభిమానులు అతని పాత పాటలను, సన్నివేశాలను మళ్లీ వైరల్‌ చేస్తున్నారు.

‘హమ్‌ కాలే హైతో క్యా హువా దిల్‌ వాలే హై’... పాట ‘గుమ్‌నామ్‌’ (1965)లో పెద్ద హిట్‌. కమెడియన్‌ మెహమూద్‌ ఈ పాటకు డాన్స్‌ చేశాడు. సరిగ్గా మూడేళ్ల తర్వాత 1968లో అదే పాటకు ‘బ్రహ్మచారి’లో జూనియర్‌ మెహమూద్‌ డాన్స్‌ చేశాడు. అతని అసలు పేరు నయీమ్‌ సయీద్‌.

అప్పటికి అతనికి ఏడెనిమిదేళ్లు కూడా లేవు. తనను ఇమిటేట్‌ చేసిన నయీమ్‌ సయీద్‌కు మెహమూద్‌ ‘జూనియర్‌ మెహమూద్‌’ అనే బిరుదు ఇచ్చి ఆశీర్వదించాడు. చనిపోయే వరకూ నయీమ్‌ అసలు పేరుతో కాకుండా జూనియర్‌ మెహమూద్‌గానే గుర్తింపు పొందాడు. 1968–70ల మధ్యకాలంలో జూనియర్‌ మెహమూద్‌ సూపర్‌స్టార్‌గా వెలిగాడు.

సినిమాకు లక్ష రూపాయలు తీసుకునేవాడు. 1969లో రోజుకు 3000 రూపాయలు చార్జ్‌ చేసేవాడు. రాజేష్‌ ఖన్నా, జితేంద్ర, సంజీవ్‌ కుమార్‌లాంటి పెద్ద పెద్ద హీరోలతో కలిసి పని చేశాడు. ఇంపాలా కారులో తిరిగేవాడు. ఇతను స్టార్‌ అయ్యే ముందు వరకూ కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. అతని తండ్రి రైల్వే డ్రైవర్‌. కాని ఆ తర్వాత జూనియర్‌ మెహమూద్‌ సంపాదనతో అందరూ స్థిరపడ్డారు.

రిలీజైన సినిమాకు ఫ్లాప్‌ టాక్‌ వస్తే జూనియర్‌ మెహమూద్‌తో పాట తీసి యాడ్‌ చేసి ఆడించిన సందర్భాలున్నాయి. శుక్రవారం 67 ఏళ్ల వయసులో జూనియర్‌ మెహమూద్‌ ముంబైలో కన్నుమూశాడు. భారతీయ చలనచిత్ర చరిత్రలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా స్టార్‌డమ్‌ను చూసిన జూనియర్‌ మెహమూద్‌ను అభిమానులు తలచుకుని అతని సినిమా సన్నివేశాలను వైరల్‌ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు