Sagubadi: కాసుల పంట డ్రాగన్‌! ఎకరాకు 8 లక్షల వరకు పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!

20 Sep, 2022 11:51 IST|Sakshi
డ్రాగన్‌ పండ్ల తోటలో లక్ష్మీదేవి

కాసుల పంట డ్రాగన్‌! 

రెడ్‌ రకం డ్రాగన్‌ దిగుబడి బాగుందంటున్న అనంత రైతు

ఎకరానికి రెండో ఏడాదే 11 టన్నుల దిగుబడి

మొక్కల ద్వారా అదనపు ఆదాయం

ఆరోగ్యదాయినిగా పేరుగాంచిన డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతులకు కాసుల పంట పండిస్తోంది. ఉద్యాన పంటలకు నెలవైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు లాభదాయకంగా సాగు చేస్తున్న పండ్ల రకాల జాబితాలో తాజాగా డ్రాగన్‌ ఫ్రూట్‌ చేరింది. సేంద్రియ పద్ధతుల్లో డ్రాగన్‌ సాగు చేస్తూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు మంచి లాభాలు కళ్లజూస్తున్నారు.

ఈ కోవకు చెందిన వారే కేవీ రమణారెడ్డి. అనంతపురం శివారు సిండికేట్‌నగర్‌కు చెందిన రమణారెడ్డి గార్లదిన్నె మండలం మర్తాడులో 3 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌తో పాటు మరో 6 ఎకరాల్లో ఖర్జూరం సాగు చేస్తున్నారు. పదో తరగతి వరకు చదువుకున్న రమణారెడ్డి రెండేళ్ల క్రితం డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు శ్రీకారం చుట్టి, రెండో ఏడాదే మంచి దిగుబడులు సాధించారు.  

2 వేల మొక్కలు..
రెండేళ్ల క్రితం డ్రాగన్‌ ఫ్రూట్‌ రెడ్‌ రకం 6 వేల మొక్కలను తెప్పించిన రమణారెడ్డి మూడు ఎకరాల్లో నాటారు. చెట్ల మధ్య 8 అడుగులు, సాళ్ల మధ్య 10 అడుగులు దూరంలో సిమెంటు స్థంభాలు నాటి... స్థంభానికి నాలుగు మొక్కలు నాటారు. గుంత తీసి అందులో వేపపిండి, వర్మీకంపోస్టు, పశువుల ఎరువు వేసి.. ఎకరాకు 500 సిమెంటు స్థంభాల చుట్టూ 2 వేల మొక్కలు నాటారు. స్తంభం పైభాగంలోకి మొక్కలకు ఆలంబనగా పాత టైరును అమర్చారు. 

ఎకరాకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి
మొత్తమ్మీద పంటకు తొలి ఏడాది మొక్కల ఖర్చు, సిమెంటు పోలు, రింగు తదితర వాటిని పరిగణలోకి తీసుకుంటే ఎకరాకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. తర్వాత నుంచి ప్రతి ఏటా రూ.50 వేలకు కాస్త అటుఇటుగా ఖర్చవుతుంది. నీళ్లు పెద్దగా అవసరం లేదు. డ్రిప్‌ ద్వారా 15 రోజులకో తడి ఇస్తున్నాను. వర్షాకాలంలో అవసరం లేదు.

ఎకరాకు ఏటా 10 నుంచి 12 టన్నుల వరకు డ్రాగన్‌ పండ్ల దిగుబడి వస్తుందని అంటున్నారు రమణారెడ్డి. వేపనూనె పిచికారీ చేస్తే ఎర్రచీమల సమస్య అదుపులోకి వచ్చిందని రమణారెడ్డి వివరించారు. ఏడాదికి రెండు సార్లు ఐదు ట్రాక్టర్లు పశువులు ఎరువు వేశారు. కొంత కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వాడాను. పండ్ల కోతకు కూలీల అవసరం తక్కువే. తాను, తన భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు ముగ్గురు కూలీలతో సరిపోతోందన్నారు.  

మొక్కల ద్వారా ఆదాయం
అంట్లు కట్టి, మొక్కల అమ్మకం మొదలు పెట్టారు. ఒక కటింగ్‌ను రూ.70కి, రెండు నెలలు పెంచిన మొక్కను రూ.100కి అమ్ముతున్నానని రమణారెడ్డి చెబుతున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో డ్రాగన్‌ మించిన ఆదాయాన్నిచ్చే పంట మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.   

రెడ్‌ వెరైటీ.. ఎండను తట్టుకుంటుంది..
డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు అనంతపురం జిల్లా నేలలు, వాతావరణం అనుకూలమే. ఇప్పటికి 20 మందికి పైగా రైతులు 70–80 ఎకరాల్లో డ్రాగన్‌ సాగు చేపట్టారు. మొదటి ఏడాది పెట్టుబడి ఎక్కువ అయినా మున్ముందు లాభదాయకంగా ఉంటుంది.

ఒక్కసారి నాటుకుంటే గరిష్టంగా 25–30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. డిసెంబర్‌–మే మధ్య కాలంలో ప్రూనింగ్, పోషకాల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు చేపడితే ఇబ్బంది ఉండదు. మొక్కల ఎంపికలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. మర్తాడు రైతు రమణారెడ్డి సాగు చేసిన రెడ్‌ వెరైటీ డ్రాగన్‌ పండ్లు సైజు పరంగా, దిగుబడి పరంగా మంచిదే. ఎండకు తట్టుకుంటుంది. 
– డా. బి.విమల (94938 31009), ఉద్యాన శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం జిల్లా

రెండో ఏడాదే అధికాదాయం 
డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట ద్వారా రెండో ఏడాది ఊహించిన దానికన్నా అధిక దిగుబడి వచ్చింది. మూడు ఎకరాల్లో ఇప్పటికే 18 టన్నుల పండ్లు అమ్మాను. చెన్నై, బెంగళూరు వ్యాపారులతోపాటు స్థానిక వ్యాపారులు కూడా తీసుకెళుతున్నారు.


కేవీ రమణారెడ్డి

పండు సైజును బట్టి టన్ను రూ.1.35 లక్షల నుంచి రూ.1.65 లక్షల వరకు పలికింది. కాపు బాగున్నందున ఇంకా రూ.15 టన్నులకు పైగా దిగుబడి రావచ్చు. ఈ లెక్కన రూ.50 లక్షలకు పైగా రావచ్చనుకుంటున్నా. నాటిన రెండో ఏడాది నుంచే రెమ్మలు కత్తిరించి  అమ్ముతున్నా. ఇప్పటికి రూ.24 లక్షల విలువ చేసే మొక్కలు అమ్మాను. 
– కేవీ రమణారెడ్డి, డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతు , (93469 25502, 94908 56363), మార్తాడు, గార్లదిన్నె మం., అనంతపురం జిల్లా 

– గంగుల రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్‌ 
ఫొటోలు: బి.మహబూబ్‌బాషా

చదవండి: నేచర్‌ అర్బైన్‌.. అతిపెద్ద రూఫ్‌టాప్‌ పొలం!

మరిన్ని వార్తలు