స్త్రీ శక్తి: సూపర్‌ ఫైటర్‌

10 Jan, 2023 01:00 IST|Sakshi
అవని చతుర్వేది 

సవాలుకు దీటైన సమాధానం విజయంలోనే దొరుకుతుంది. ‘అమ్మాయిలు బైక్‌ నడపడం కష్టం’ అనే మాట విన్నప్పుడు పట్టుదలగా బైక్‌ నడపడం నేర్చుకుంది. ‘ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశించడం చాలా కష్టం’ అనే మాట విన్న తరువాత ఫైటర్‌ పైలట్‌ కావాలనుకునే లక్ష్యానికి బీజం పడింది. ‘మిగ్‌–21 బైసన్‌’ యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన స్క్వాడ్రన్‌ లీడర్‌ అవని చతుర్వేది జపాన్‌లో జరగబోయే ఎయిర్‌ కంబాట్‌ ఎక్సర్‌సైజ్‌లలో పాల్గొనబోతోంది...

ఇండియా, జపాన్‌ దేశాలు కలిసి ఎయిర్‌ కంబాట్‌ ఎక్సర్‌సైజ్‌లు నిర్వహించనున్నాయి. ఎయిర్‌ డిఫెన్స్‌కు సంబంధించి పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్‌), జపాన్‌ ఎయిర్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(జేఎఎస్‌డీఎఫ్‌)లు గగనతల విన్యాసాలకు శ్రీకారం చుట్టనున్నాయి. జపాన్‌లో హైకురీ ఎయిర్‌బేస్‌ కేంద్రంగా జరిగే ఎయిర్‌ కంబాట్‌ ఎక్సర్‌సైజ్‌లు (వీర్‌ గార్డియన్‌ 2023) ఈ నెల 12 నుంచి 26 వరకు జరగనున్నాయి.

మన దేశానికి సంబంధించి సుఖోయ్‌–30 ఎంకేఐ, సీ–17 హెవీ–లిఫ్ట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు దీనిలో భాగం అవుతాయి. ఈ కార్యక్రమంలోపాల్గొంటున్న ఫస్ట్‌ ఉమెన్‌ ఫైటర్‌ పైలట్‌గా స్క్వాడ్రన్‌ లీడర్‌ అవని చతుర్వేది చరిత్ర సృష్టించనుంది. మన దేశంలో జరిగిన కంబాట్‌ ఎక్సర్‌సైజ్‌లలో మహిళా ఫైటర్‌ పైలట్‌లుపాల్గొన్న సందర్భాలు ఉన్నప్పటికీ, వేరే దేశంలో జరిగే దానిలో ఒక మహిళా ఫైటర్‌ పైలట్‌పాలుపంచుకోడం ఇదే తొలిసారి.

మధ్యప్రదేశ్‌కు చెందిన అవని చతుర్వేది జైపూర్‌లో బీటెక్‌ చేసింది. విమానాలపై ఉన్న ఆసక్తితో రాజస్థాన్‌లోని వనస్థలి యూనివర్శిటీ ‘ప్లయింగ్‌ క్లబ్‌’లో చేరింది. అక్కడ మొదలైన ఆమె ప్రయాణం విజయపరంపరలతో సాగుతూనే ఉంది. ‘మిగ్‌–21 బైసన్‌’ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా 2018  చరిత్ర సృష్టించింది అవని. రాష్ట్రపతి చేతుల మీదుగా 2020లో ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకున్న అవని, వైమానిక రంగంలో  పనిచేయాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇచ్చింది.

అవని తండ్రి నీటిపారుదలశాఖలో ఇంజనీరు. సోదరుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. సోదరుడి స్ఫూర్తితోనే సైన్యంలోకి వచ్చింది అవని. భారతీయ వైమానికదళంలో పనిచేయాలనే తన లక్ష్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ‘ఫ్లైయింగ్‌ క్లబ్‌లో చేరినంత సులువు కాదు’ అని వెక్కిరించిన వాళ్లూ ఉన్నారు. అయితే వాటిని అవని సీరియస్‌గా తీసుకోలేదు. ఎఎఫ్‌సిఎటీ పరీక్షలో రెండో స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది. దుండిగల్‌(హైదరాబాద్‌)లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందింది.

సాహసాలతో చెలిమి చేసింది. అవనికి బాస్కెట్‌బాల్, చెస్‌ ఆడడం, పెయింటింగ్‌ అంటే ఇష్టం. బాస్కెట్‌బాల్‌ వల్ల తెగువ, చెస్‌తో లోతైన ఆలోచన, పెయింటింగ్‌తో సృజనాత్మక శక్తులు తనలో వచ్చి చేరాయి. ‘ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకోవాలనేది నా విధానం. మంచి ఫైటర్‌ పైలట్‌గా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం’ అంటోంది అవని చతుర్వేది. ‘కఠినమైన ఫైటర్‌–ఫ్లయింగ్‌ షెడ్యూల్స్‌’ అంటూ ఒకప్పుడు ఐఏఎఫ్‌ మహిళలను కంబాట్‌ స్ట్రీమ్‌లోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఐఏఎఫ్‌ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. దీనికి తాజా ఉదాహరణ జపాన్‌లో జరిగే ఎయిర్‌ కంబాట్‌ ఎక్సర్‌సైజ్‌కు అవని చతుర్వేదిని ఎంపిక చేయడం.

మరిన్ని వార్తలు