ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వింత పెళ్లి సంప్రదాయాలు మీకోసం..

24 Jul, 2022 15:09 IST|Sakshi

అయ్యో.. తప్పుగా అనుకోకండి. దక్షిణ కొరియాలోని పెళ్లి కొడుక్కి తప్పకుండా చేయాల్సిన మర్యాద ఇది. అంటే వధువు చెప్పుతో వరుడిని కొట్టడం కాదండీ! కట్టుకున్న భార్యను తనతోపాటు తీసుకెళ్లాలంటే వరుడు తన కాళ్లకున్న చెప్పులు తీసి.. అతని కుటుంబమో.. లేక అతని స్నేహితులతోనో తన అరికాళ్ల మీద కొట్టించుకోవాలి. రక్తం మాత్రం కారకూడదు. పోలీసు దెబ్బలన్నమాట. వరుడి కాళ్లను కట్టేసి.. అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పమని ప్రశ్నిస్తూ మరీ కొట్టాలట.. కర్రతో కానీ.. ఎండు చేపతో కానీ! వరుడి శక్తిసామర్థ్యాలను పరీక్షించడమే ఈ ప్రోగ్రాం సారీ.. సంప్రదాయం ఆంతర్యమట.  ఇలాంటి పలు వింత పెళ్లి సంప్రదాయాలు మీకోసం..

వంటింట్లో సామాన్లు విరగ్గొట్టాల్సిందే.. !
చేయి జారి చిన్న కప్పు పగిలిపోతేనే మనసు మనసులో ఉండదు.. అలాంటిది ఇష్టపడి కొనుక్కున్న వంటింట్లోని ఖరీదైన పింగాణి సామాగ్రిని కావాలని నేలకేసి కొట్టి.. కాళ్ల కిందేసి తొక్కితే ప్రాణం చివుక్కుమనదూ! అయినా నవ్వుతూ ఆ సంప్రదాయాన్ని పాటించాల్సిందే! జర్మనీలో ఇదీ పెళ్లి తంతేనండీ! దీన్ని పోల్టరాబెండ్‌ అంటారు. పెళ్లికి వచ్చిన అతిథులంతా పెళ్లి కూతురి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వంటింటి సామాగ్రిని చితక్కొట్టేస్తారు. దీనివల్ల నూతన జంట నూరేళ్లు కలసి ఉంటుందని విశ్వాసం. 

మొహమ్మీద ఊసి... 
దేవుడా.. ఇదీ పెళ్లి ఆచారమేనా? అవును.. కెన్యా, మాసై తెగలో! పెళ్లయిపోయి అప్పగింతలప్పుడు.. వధువు మొహమ్మీద ఉమ్మేస్తాడట ఆమె తండ్రి. అలా చేస్తే అత్తింట్లో అదృష్టం తన్నుకొస్తుందట అమ్మాయికి.

మసి పూసి.. ఊరేగించి.. 
ఎక్కడ? ఎవరిని? స్కాట్లాండ్‌లో.. కాబోయే వధూవరులను. అది పెళ్లికి సంబంధించి స్కాట్లాండ్‌లో ఉన్న ఒక సంప్రదాయం. పెళ్లికి ముందు.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు స్నేహితులు కలసి ఆ ఇద్దరి మొహాలకు చక్కెర పాకం, పిండి, మసి పూసి వీథంతా తిప్పుతారట. ఇలా చేస్తే ఆ ఇద్దరి మీదున్న చెడు దృష్టి, దుష్ట శక్తి పోయి.. వాళ్ల కాపురం పచ్చగా ఉంటుందని వాళ్ల నమ్మకమట.    

మరిన్ని వార్తలు