Dolly Success Story: రచ్చే కాదు... ఇంట కూడా గెలిచా!!

28 Jan, 2023 11:20 IST|Sakshi

నాకు తిక్కుంది కానీ దానికో లెక్కుంది అన్నట్లుగా ఆమె ఎంబీఏ చేసింది. దిల్లీలో చక్కటి జీతంతో సకల సదుపాయాలతో పెద్ద పేరున్న బహుళజాతి సంస్థలో ఉద్యోగం ఆమెది. అలాంటిది, బంగారంలాంటి ఉద్యోగాన్ని, అందులో కంపెనీ ఇచ్చిన హోదాని, ఆ హోదాకు తగ్గ సౌకర్యాలనూ వదులుకుని బిహార్‌లోని మారుమూల ప్రాంతమైన గయ జిల్లా షాదిపూర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచింది. తాను మెట్టిన గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఆమే డాలీ. ఎందుకలా చేశావని అడిగితే ఇలా చెప్పింది. 

‘‘నిజానికి నేనీ పని ఎప్పుడో చేసుండాల్సింది, చేశాను కూడా. అయితే అప్పుడు కుదరలేదు. 2015లో మా పెళ్లయింది. భర్త, మామగారు చాలా మంచివారు. అయితే అది పల్లెటూరు కావడంతో నేను అక్కడ ఉండలేకపోయాను. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయి, ఎప్పటిలాగే నా ఉద్యోగం చేసుకుంటూ సెలవ దొరికినప్పుడు వచ్చి కొద్దిరోజులు గడిపి వెళ్లేదానిని. అలా కొద్దికాలం గడిచింది. ఇంతలో పంచాయతీ ఎలక్షన్లొచ్చాయి. అంతవరకు జనరల్‌ స్థానంగా ఉన్న మా గ్రామ పంచాయతీని మహిళలకు కేటాయించారు. మా మామగారు, మా వారు ఆ స్థానానికి నన్ను పోటీ చేయమన్నారు. నేను ముందు ఆశ్చర్యపోయాను. తర్వాత చాలా ఆలోచించాను. 

ఢిల్లీ వంటి మహానగరంలో పెద్ద మల్టీనేషనల్‌ కంపెనీలో మంచి జాబ్‌ చేసుకుంటున్న నేను మారుమూల పల్లెటూళ్లో సర్పంచ్‌గా పోటీ చేయడమా? అనుకున్నాను. మా వారు, మా వారు నన్ను 13 వార్డులున్న ఈ పంచాయతీకి సర్పంచ్‌ పోటీ చేయడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదని, గెలవడం కూడా అంత తేలికేమీ కాదని, అయితే బాగా ఆలోచించుకోమన్నారు. ఆ ఊరికి నేను కొత్త. పైగా అప్పటికే నేను ఢిల్లీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. నా వేషభాషలు, మాటలు చూసిన గ్రామస్థులు ఇంత ఆధునికంగా ఉన్న ఈమె ఈ ఊరికి ఎంపికై ఏం చేస్తుంది అనుకున్నారో ఏమో, మా కుటుంబానికి ఎంతో పలుకుబడి, డబ్బు ఉన్నప్పటికీ వాళ్ళెవరూ నన్ను నమ్మేలా కనిపించలేదు. దాంతో నేను దానిని సవాల్‌గా తీసుకున్నాను. ఉద్యోగంలో వచ్చే సవాళ్లను ఏ విధంగా అయితే అధిగమించే దానినో, ఈ సర్పంచ్‌ పదవికోసం అదేవిధంగా కృషి చేయాలనుకున్నాను. గ్రామీణుల నుంచి ఇతరులను వేరు చేసే వాటిలో ముఖ్యమైనవి వస్త్రధారణ, భాష, సంస్కృతి. మా కుటుంబానికి రాజకీయాలు ఏమీ కొత్తకాదు. నేను అడుగుపెట్టేటప్పటికే మా అత్తగారు లేరు కానీ, మా అత్తగారు గతంలో సర్పంచిగా పని చేసినట్లు విన్నాను. అందుకే అప్పటివరకూ చాలా ఆధునికంగా ఉన్న నేను నా వస్త్రధారణను, ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నాను. 

నిండుగా చీరకట్టు, నుదుట బొట్టు, చేతులకు గాజులు, కంటికి కాటుక, తలపై ముసుగుతో నేను పూర్తిగా అక్కడి అమ్మాయిలా మారిపోయాను. మాట తీరును కూడా మార్చుకున్నాను. కనిపించిన వారినందరినీ ఆప్యాయంగా పలకరించడం, వారి కష్టసుఖాలను కనుక్కోవడం, పెద్దవాళ్లకు గౌరవప్రదంగా నమస్కరించడం వంటి పద్ధతులతో వారికి నా పట్ల నమ్మకం కలిగించాను. ఇదంతా నేను సర్పంచ్‌ పదవిని ఆశించి చేసినవి కాదు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉద్యోగంలో రకరకాల సవాళ్లు ఎదురుకాకుండా ఉండవు కదా... మన తెలివితేటలు, ఓర్పు, నేర్పుతో వాటిని ఏ విధంగా అధిగమిస్తామో, అలాగే ఇది కూడా అనుకున్నాను. అందుకే వారికి తగ్గట్టు నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. ఆ గ్రామానికి మౌలిక వసతులు కల్పించడం, అందరూ చదువుకునేలా చేయడం, గ్రామస్థుల సమస్యలు పరిష్కరించడం ముఖ్యలక్ష్యాలుగా ఎంచుకున్నాను. అంతే! వారు నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. అప్పటినుంచి నేను పూర్తి సమయాన్ని గ్రామాభివృద్ధి కోసమే కేటాయిస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఓటు వేసి గెలిపించిన వారందరూ నా వారే అనుకున్నాను. 

రకరకాల కుటుంబ సమస్యలతో నా దగ్గరకొచ్చిన వారికి నాకు చేతనైన రీతిలో కౌన్సిలింగ్‌ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాను. గ్రామంలో స్త్రీ విద్య కోసం కృషి చేశాను. పంచాయతీకి నిధుల కేటాయింపు కోసం కృషి చేశాను. అక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాకు చేతనైన రీతిలో ఆధునికీరించాను. రోడ్లు మరమ్మతు చేయించడం, వీధి దీపాలు వెలిగేలా చూడటం, పంచాయతీకి రావలసిన పన్నులను సక్రమంగా వసూలయేలా చర్యలు తీసుకోవడం వంటివన్నీ చేస్తూపోయాను. పురుషాధిక్య భావనలు ఉన్న ఆ గ్రామంలో అందరూ నన్ను గౌరవించడం, వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు నన్ను ఆహ్వానించడం వంటి వాటితో చిత్రంగా నా కార్పొరేట్‌ ఉద్యోగంలో ఉన్న పోటీ, పరుగులు తీయడం, చికాకు, ఆందోళన, టెన్షన్లు వంటివి ఇక్కడ లేవు. నేను ఉద్యోగం చేస్తే కేవలం డబ్బు మాత్రమే వచ్చేది. అదే ఇక్కడ సర్పంచ్‌గా ఉండటం వల్ల ఎందరో గ్రామీణుల జీవితాలను బాగు చేయగలిగానన్న ఆత్మసంతృప్తి, మానసిక ప్రశాంతత కలిగాయి. అప్పుడు అనిపించింది... ఇంట గెలిచి రచ్చగెలువు అన్న సామెత ఉట్టిది కాదని... నేను బయటే కాదు, ఇంట కూడా గెలిచాననీ’’

పెద్ద చదువులు చదువుకున్న ప్రతి వారూ పెద్ద కంపెనీలలోనే పని చేసి రెండు చేతులా సంపాదించాలని ఏమీ లేదు, పెద్ద మనసుతో సొంత వూళ్లో సొంత ప్రజలకు సేవ చేసినా తృప్తితో గుండెలు నింపుకోవచ్చునని డాలీ ఉదంతం చెబుతోంది. (క్లిక్ చేయండి: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్‌’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ!)

మరిన్ని వార్తలు