మగవారూ... భాష జాగ్రత్త

23 Nov, 2023 00:35 IST|Sakshi

సందర్భం

గతంలో ఎం.ఎల్‌.ఏ అయిన ఒక పెద్ద హీరో  స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడి అసెంబ్లీలో సంజాయిషీ ఇచ్చాడు. డెబ్బయి ఏళ్లు దాటిన ఒక సీనియర్‌ నటుడు నోరు పారేసుకుని పరువు పోగొట్టుకున్నాడు. పార్లమెంట్‌ సభ్యుడుగా ఉన్న మరో నటుడు స్త్రీల దుస్తుల గురించి సుద్దులు చెప్పి నిరసన ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌.

సెలబ్రిటీలుగా ఉన్నవారు ఎంతో బాధ్యతగా ఉండి యువతకు మార్గం చూపేలా ఉండాలి. వారు ఇలా తగలడితే స్త్రీలతో ఎలా వ్యవహరించాలో ఇంటినే బడిగా మార్చి తల్లిదండ్రులు నేర్పించాల్సి ఉంటుంది. అయితే ఇంటి ఆడవారికి తండ్రి, భర్త గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారా అనేది ప్రశ్న.

అతడో ప్రసిద్ధ నటుడు. ‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’ అంటుంటాడు. కాని ఒక సభలో అభిమానులను చూసి పూనకం వచ్చి స్త్రీల గురించి అశ్లీలమైన వ్యాఖ్యలు చేశాడు. వందల సినిమాల్లో తండ్రిగానో బాబాయిగానో వేసిన ఒక నటుడు ‘స్త్రీల మీద మీ అభిప్రాయం ఏమిటి?’ అని సభలో యాంకర్‌ అడిగితే పరమ రోతగా సమాధానం ఇచ్చాడు. ఇక నటుడుగా, రియల్టర్‌గా గుర్తింపు పొందిన మరో పెద్ద మనిషి పార్లమెంట్‌ మెంబర్‌ అయ్యాక పార్లమెంట్‌లో నిలబడి మరీ ‘స్త్రీల దుస్తుల వల్లే వారికి సమస్యలు వస్తున్నాయి’ అన్నాడు.

 స్త్రీలను ఏదో ఒకటి అనేయొచ్చు, అంటే వాళ్లు పడతారు, అనడానికే మేము పుట్టాము అనే చులకనభావం పురుష సమాజంలో నరనరాన జీర్ణించుకుని పోబట్టే ఈ ప్రతిఫలాలు. అదృష్టవశాత్తు ఇలాంటి వ్యాఖ్యలకు వెంటనే నిరసన పెల్లుబుకుతున్నా పురుషుల నోటి దురుసు తగ్గడం లేదు. తాజాగా తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల త్రిషతో ‘లియో’ సినిమాలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘ఆమె హీరోయిన్‌ అని తెలిశాక (గత సినిమాల్లో తాను చేసిన) బెడ్‌రూమ్‌ సీన్‌ ఉంటుందని ఆశపడ్డాను’ అని వ్యాఖ్యానించాడు.

‘ఇది సినిమా లాంగ్వేజ్‌’ అని మన్సూర్‌ అనుకుని ఉండొచ్చుగాని దానిలోని అశ్లీల ధ్వనికి త్రిష రియాక్ట్‌ అయ్యింది. ‘ఇతనితో ఇంకెప్పుడూ సినిమాల్లో నటించను’ అని చెప్పింది. ఆ తర్వాత చినికి చినికి గాలివానై ఇప్పుడు మన్సూర్‌ మీద కేసు బుక్‌ అయ్యేంతగా వెళ్లింది. మగవాళ్లు ‘సరదాగా మాట్లాడుతున్నామని’ అనుకుంటూ కూడా స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. సరదాగా కించపరచడం ఏమిటో... కించపరచడం ఎలాంటి సరదానో వీరే చెప్పాలి.

► ప్రసిద్ధులే దారి తప్పితే
రాజకీయ నేతలు, సినిమా నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు... ఇలా సమాజంలో గుర్తింపు పొందినవారు స్త్రీల పట్ల మరింత గౌరవంతో మెలగుతూ ఆదర్శంగా నిలవాలి. కాని చాలాసార్లు రాజకీయ నాయకుల దగ్గరి నుంచి అన్ని రకాల ప్రముఖులు ఏదో ఒక సందర్భంలో చులకన మాటలు మాట్లాడుతూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఉత్తరాదిలో మంత్రులు ‘మేం వేసిన రోడ్లు ఫలానా హీరోయిన్‌ బుగ్గల్లా ఉంటాయి’ అంటూ వదరుతుంటారు. సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’ సినిమాలో కుస్తీ వీరుడిగా నటించి ‘ఈ సినిమాలో కుస్తీలు చేస్తే రేప్‌ జరిగినంత పనయ్యింది నాకు’ అని వ్యాఖ్యానించి మొట్టికాయలు తిన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రిగా ఉన్న నటిపై దారుణమైన వ్యాఖ్యలు చేసి కోర్టు కేసును ఎదుర్కొనబోతున్నాడు.

► బాల్యం నుంచి భావజాల ప్రభావం
‘కుటుంబంలో తండ్రి (మగాడు) ముఖ్యం’ అనే భావన బాల్యం నుంచి పిల్లల్లో ఎక్కించడం ద్వారా పురుష సమాజం తన ఆధిక్యతను స్త్రీలపై ఆధిపత్యాన్ని కొనసాగించేలా చేస్తుంది. తండ్రిని ‘మీరు’ అని, తల్లిని ‘నువ్వు’ అని అనడంలో ప్రేమ, గౌరవం, దగ్గరితనం ఉన్నా ‘నువ్వు’ అనడం వల్ల ‘లెక్క చేయవలసిన పని లేదు’ అనే భావన కలిగితే కష్టం. తిట్లు, బూతులు అన్నీ స్త్రీలను అవమానించేవే. వాటిని విని, పలికి స్త్రీల పట్ల అలా మాట్లాడవచ్చు అనుకుంటారు మగవారు.

ఇంట్లో చెల్లెని, అక్కని, తల్లిని తండ్రి అదుపు చేసే తీరు చూసి, తామూ బయట స్త్రీలను అలాగే అదుపు చేయవచ్చనుకుంటారు. ఫైటర్‌ జెట్స్‌ను స్త్రీలు నడుపుతున్న ఈ కాలంలో కూడా ‘మేమేమీ గాజులు తొడుక్కోలేదు’, ‘మూతి మీద మీసముంటే రా’లాంటి పౌరుష వచనాలను పురుషులు ఇంకా పలికేటంత వెనుకబాటుతనంలో ఉండటం విషాదకరం. శారీరక పరిమితులు ఉన్నంత మాత్రాన స్త్రీలు బలహీనులు, పురుషులు బలవంతులు కాబోరు.

► తల్లిదండ్రులూ జాగ్రత్త
అబ్బాయిలను ఆడపిల్లలను గౌరవించేలా పెంచడం, టీనేజ్‌లో ఉన్న అబ్బాయిలకు సరైన కౌన్సెలింగ్‌ ఇవ్వడం ఇప్పటి తల్లిదండ్రుల తక్షణ కర్తవ్యం. చట్టాలు పకడ్బందీగా ఉన్న ప్రస్తుత రోజుల్లో తెలిసో తెలియకో అహంకారంతోనో పరుష వ్యాఖ్య, అసభ్య చేష్ట నేరుగా కాని సోషల్‌ మీడియాలోగాని చేస్తే వారు ప్రమాదంలో పడతారని హెచ్చరించాలి. చైతన్యం పెరిగింది. అబ్బాయిలూ భాష జాగ్రత్త.

మరిన్ని వార్తలు