పిల్లలు ఫోన్‌కు అడిక్ట్‌ అయ్యారా? టైమ్‌ లేదని తప్పించుకోకుండా ఇలా చేయండి!

3 Apr, 2022 17:04 IST|Sakshi

చాక్లెట్‌ ఇస్తే స్కూలుకెళ్తా... ఒకప్పటి డిమాండ్‌ ఇది. సైకిల్‌ కొనిస్తేనే స్కూలుకెళ్తా... ఇప్పుడిదీ పాతబడిపోయింది. ‘స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వకపోతే స్కూలుకెళ్లను’ కరోనా మార్పు ఇది. 

పిల్లలు సెల్‌ఫోన్‌కి అడిక్ట్‌ అయిపోవడం గురించి దశాబ్దకాలంగా మాట్లాడుతున్నాం. కానీ ఈ రెండేళ్ల కాలం పిల్లలకు సెల్‌ఫోన్‌ ఇచ్చి తీరాల్సిన అవసరాన్ని తెచ్చింది కరోనా. ఇప్పుడు ఆన్‌లైన్‌ క్లాసుల శకం ముగిసింది. ఆఫ్‌లైన్‌ క్లాసులు మొదలవుతున్నాయి. అయినా పిల్లలు మాత్రం సెల్‌ఫోన్‌ వదలడానికి ఇష్టపడడం లేదు. ఈ అడిక్షన్‌ నుంచి పిల్లలను బయటకు తీసుకురావడం పెద్ద సవాల్‌. ఇందుకు ‘పిల్లల దృష్టిని మళ్లించడం, మరొక విషయం మీద దృష్టిని కేంద్రీకరించేటట్లు చూడడమే పరిష్కారం’ అన్నారు చైల్డ్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ సుదర్శిని. 

మనిషి సామాజిక జీవి. మనుషులతో కలవకపోతే మానసిక రోగి అవుతాడు. కరోనా దేహ ఆరోగ్యంతో చెలగాటం ఆడుకుని సరిపెట్టలేదు. వ్యాధి బారిన పడిన వాళ్లను, పడని వాళ్లను కూడా మానసికంగా వేధిస్తూనే ఉంది. పిల్లల్లో ఆ దుష్ప్రభావాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. పిల్లలు స్కూలుకెళ్లినప్పుడు క్లాస్‌లో ఇతర పిల్లలతో ఎలా మెలగుతున్నారనే విషయాన్ని తరచూ టీచర్లను అడిగి తెలుసుకునే వాళ్లు పేరెంట్స్‌.

ఈ కరోనా సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులే కావడంతో పిల్లలు కళ్ల ముందే ఉన్నారుగా అనే ఉద్దేశంలో పిల్లల బిహేవియర్‌ మీద దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ఇవి కాకుండా తల్లిదండ్రుల్లో ఇద్దరూ చెరో లాప్‌ట్యాప్‌లో ఆఫీస్‌ పనిలో నిమగ్నం కావడం లేదా ఒకరు ఇంటి పనిలో మునిగిపోవడంతో పిల్లల్లో మానసిక పరమైన అవాంఛనీయ ధోరణులను గమనించలేకపోవడం కూడా కాదనలేని విషయమే. ఇక పిల్లల విషయానికి వచ్చేటప్పటికి... గతంలో పేరెంట్స్‌ని సెల్‌ఫోన్‌ అడిగితే కొద్దిసేపు ఇచ్చి టైమ్‌ కండిషన్‌ పెట్టేవాళ్లు. ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా ఫోన్‌ అధికారికంగా చేతికి వచ్చేసింది.

ఇక ఏం కావాలి? హ్యాపీగా ఫోన్‌తో పండగ చేసుకున్నారు. క్లాస్‌ పూర్తయిన తర్వాత కూడా బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితి లేకపోవడంతో ఫోన్‌కు అడ్డు చెప్పలేని పరిస్థితి పేరెంట్స్‌ది. కరోనా నుంచి ప్రపంచం బయటపడింది. ఆన్‌లైన్‌ శకం ముగిసింది. ఆఫ్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌తో పనేముంది? కానీ పిల్లలు అలా అనుకోలేకపోతున్నారు. 
 
స్మార్ట్‌ ఫ్రెండ్‌ 
‘‘పిల్లలను సరిదిద్దడానికి అనుసరించాల్సిన ప్రధాన సూత్రం ఏమిటంటే... వాళ్ల చేతి నుంచి ఒకటి తీస్తున్నప్పుడు ఆ చేతిలో మరొకటి పెట్టడమే. డిస్ట్రాక్షన్, డైవర్షన్‌ ద్వారా వాళ్ల చేత మనం ఏం చేయించాలనుకుంటున్నామో ఆ పని చేయించడం అన్నమాట. పది–పన్నెండేళ్లలోపు పిల్లలను దారిలో పెట్టడం, టీనేజ్‌ పిల్లలను దారిలో పెట్టడం దేనికదే భిన్నం. ఇటీవల మా దగ్గరకు వస్తున్న కేసులను పరిశీలిస్తే కొంతమంది చిన్న పిల్లల్లో ఆటిజమ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి.

సమగ్రంగా పరీక్షించి, గతంలో వాళ్ల ప్రవర్తనను విశ్లేషించి చూస్తే నిజానికి వాళ్లకు ఆటిజమ్‌ లేదని నిర్ధారణ అవుతుంది. పిల్లలు హైపర్‌ యాక్టివ్‌గా ఉంటూ, వాళ్లడిగినప్పుడు ఫోన్‌ ఇవ్వకపోతే చేతిలో ఉన్న వస్తువును విసిరికొట్టడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం కరోనా కారణంగా భౌతికదూరం పాటించడం కోసం విపరీతమైన సామాజిక దూరం పాటిస్తూ ఉండడమే.

వాళ్ల వయసు పిల్లలను కలవాల్సిన దశలో స్నేహితులకు దూరంగా ఉండాల్సి రావడం కూడా. నెలలు, సంవత్సరాలపాటు ఇంట్లో ఇద్దరు– ముగ్గురు పెద్దవాళ్ల మధ్య వాళ్ల ఆంక్షల మధ్య గడపాల్సి రావడంతో పిల్లల్లో లోలోపల విసుగు ఎక్కువైపోయింది. టీనేజ్‌లో అయితే ఇరిటేషన్‌ యాంగర్‌ పెరిగిపోతుంది. దాని నుంచి బయటపడడానికి ఫోన్‌తో స్నేహం చేస్తూ, ఫోన్‌తోనే సాంత్వన పొందడానికి అలవాటు పడ్డారు.  
(చదవండి: చద్దన్నం ప్రయోజనాలు ఇవే.. రోజూ తిన్నారంటే..)

ప్రశంస పని చేస్తుంది! 
ఇప్పుడు ఫోన్‌ వాడకం మీద ఆంక్షలు పెట్టక తప్పని పరిస్థితి. అయితే పిల్లలు ఆ ఆంక్షలను స్వీకరించడానికి సిద్ధం కావడం లేదు అసహనం పెరిగిపోతోంది. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే చేతిలో ఉన్న వస్తువులను విసిరి కొట్టడం, పుస్తకాలను చించేయడంతోపాటు పుస్తకాలను మాయం చేస్తున్నారు. ఆ కండిషన్‌ నుంచి బయటపడాలంటే పేరెంట్స్‌ ఆంక్షలు పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

రిలాక్సేషన్‌ టెక్నిక్‌ ని ఫాలో అవ్వాలి. కుటుంబంలో ఒకరితో ఒకరు కలిసి గడిపే సమయాన్ని పెంచుకోవాలి. ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా పాఠాలు సరిగ్గా అర్థం కాకపోయి ఉంటే ఆ పిల్లలు స్కూలుకు వెళ్లడానికి అస్సలు ఇష్టపడరు. నిజానికి అది మొండితనం కాదు, ఎస్కేప్‌ కావడానికి మార్గాలు వెతుక్కోవడం అన్నమాట. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుని ‘నిద్ర సరిపోకపోతే ఉదయం లేవలేవు’ అని చెప్తే చాలు.

అలాగే టైమ్‌కి నిద్రపోయిన రోజు తెల్లవారి ఉదయం పిల్లలతో ‘స్క్రీన్‌కు దూరంగా ఉండడంతో రాత్రి బాగా నిద్రపోయావు, ఆవలింతలు రావడం లేదు కూడా. ముఖం కూడా తాజాగా ఉంది, ఉత్సాహంగా కనిపిస్తున్నావు’ అని ప్రశంసాపూర్వకంగా మాట్లాడాలి. 

ఈ అడిక్షన్‌ చిన్నది కాదు! 
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓవర్‌నైట్‌ మారిపోవాలనుకోవడం అత్యాశే. మార్పు వచ్చే వరకు ప్రయత్నాలు చేయాలి. మద్యం అలవాటును మాన్పించడం వంటిదే ఇది కూడా. ఒక్కసారిగా ఫోన్‌ ఇవ్వడం ఆపేస్తే విత్‌డ్రాయల్‌ సింప్టమ్స్‌ మొదలవుతాయి. నిదానంగా తగ్గిస్తూ రావాలి. మొదట్లో చెప్పుకున్నట్లు ఒకటి తీసేయాలంటే ఆ చేతిలో మరొకటి పెట్టాల్సిందే. ఫోన్‌ బదులు షటిల్‌ రాకెట్‌ ఇచ్చి వాళ్లతోపాటు పేరెంట్స్‌ కూడా ఆడుకోవచ్చు. ఈ విషయంలో ‘టైమ్‌ లేద’ని తప్పించుకోవద్దు. పిల్లలను దారిలో పెట్టుకోవడం కంటే మించి ఏ పనులూ ప్రధానమైనవి కావని గుర్తించాలి’’ అని వివరించారు చైల్డ్‌ సైకాలజిస్ట్‌ సుదర్శిని. 
(చదవండి: ముఖంపై మృతకణాలు తొల‌గిపోవాలంటే...)

‘ఆట’విడుపు 
ఫోన్‌ నుంచి దృష్టి మళ్లించడానికి ఫిజికల్‌ యాక్టివిటీని పెంచాలి. పార్క్‌కు తీసుకువెళ్లాలి. పేరెంట్స్‌ కూడా వాళ్లతోపాటు ఆడాలి లేదా ఆ వయసు పిల్లలను కలుపుకుని ఆడుకునే వీలు కల్పించాలి. దేహం బాగా అలసిపోయినప్పుడు ఎండార్ఫిన్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. మెదడు... ఒత్తిడిని దూరం చేసుకోవడానికి స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ప్లెజర్‌ పీలవడం అనే మార్గానికి అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్‌ యాక్టివిటీ, స్నేహాలను పెంచుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెంచుకోవడం ద్వారా ప్లెజర్‌ అందుతుందన్నమాట.

స్కూలు పాత్ర కూడా పెద్దదే! 
కొంత మంది పిల్లలు అమ్మానాన్నలకు తెలియకుండా ఫోన్‌ను స్కూల్‌కి తీసుకువెళ్లిపోతుంటారు. ఆ అలవాటును ఇంట్లో కంట్రోల్‌ చేయలేనప్పుడు స్కూల్‌ యాజమాన్యానికి తెలియచేయాలి. టీచర్‌లు ‘ఇక ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవు, ఆఫ్‌లైన్‌ క్లాసులే. కాబట్టి ఫోన్‌ వాడాల్సిన పని లేదు’ అని ఒకటికి పదిసార్లు మామూలుగా చెప్పాలి. ఆ తరవాత కొన్నాళ్లకు ‘స్కూల్‌కి ఫోన్‌ తెస్తే పనిష్మెంట్‌ ఉంటుంద’ని కూడా హెచ్చరించాలి. పిల్లలను క్విజ్, డ్రాయింగ్‌ వంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీల్లో నిమగ్నం చేయాలి. 
– వాకా మంజులారెడ్డి 

మరిన్ని వార్తలు