ఫ్రీగా కోవిడ్‌ కిట్సా.. జాగ్రత్తగా ఉండండి!!

20 Jan, 2022 11:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కీర్తి (పేరు మార్చడమైనది)కి రెండు రోజులుగా జలుబు, దగ్గు, కాస్త జ్వరంగా ఉంది. ఇంట్లో వాళ్లు కోవిడ్‌ ఏమో టెస్ట్‌ చేయించుకుంటే మంచిది అని పోరుతున్నారు. దానికి టెస్టింగ్‌ సెంటర్‌ వరకు ఎందుకు కిట్‌ తెప్పించుకుంటే సరిపోతుంది కదా! అని ఆన్‌లైన్‌లో శోధించడం మొదలుపెట్టింది. ఒక లింక్‌లో రూ.100 కే కోవిడ్‌ టెస్ట్‌ కిట్‌ అని చూసింది. కిట్‌ సమయానికి రాకపోతే మనీ బ్యాక్‌ కూడా చేస్తాం డీటెయిల్స్‌ ఇస్తే అని ఉంటే.. తన వివరాలన్నీ ఇచ్చింది. ఆ తర్వాత తన అకౌంట్‌ నుంచి డబ్బులు వేరేగా ట్రాన్స్‌ఫర్‌ అవడం చూసి బ్యాంక్‌ను సంప్రదించి, తను మోసపోయానట్టుగా తెలుసుకుంది.
∙∙ 
కరోనా మహమ్మారి ఒక విధంగా ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే మరో వైపు సైబర్‌నేరగాళ్లు రకరకాల పద్ధతులు ద్వారా వ్యక్తుల వ్యక్తిగత డేటాతో పాటు ఖాతా నుంచి నగదు కూడా దొంగిలిస్తున్నారు. 

మొదటి, రెండో వేవ్‌లలో బ్యాంకుల మారటోరియం గురించి వివరాలు సేకరిస్తున్నాం అంటూ, చారిటీ ఆర్గనైజేషన్‌ నుంచి చేస్తున్నాం అంటూ, మాస్కులు ఫ్రీగా ఇస్తున్నాం అని, ఆక్సిజన్‌ సిలండర్లు తక్కువ ధరకే అంటూ.. రకరకాల లింక్‌లను ఆన్‌లైన్‌ వేదికగా సెండ్‌ చేశారు. వాటి ద్వారా మోసపోయినవారూ ఉన్నారు. 
∙∙ 
కోవిడ్‌ బూస్టర్‌ డోసులు, కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్, డాక్టర్‌ ఆన్‌ హెల్ప్‌.. ఈ మూడింటిపై ఎక్కువ ఫ్రాడ్‌ జరుగుతున్నాయి. మీ కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే 24 గంటలు మీకు ఆన్‌లైన్‌ సపోర్ట్‌ ఉంటుంది. అవసరమైతే మీకు మనిషిని కూడా ఏర్పాటు చేస్తాం, పేదలకు సాయం చేయండి అంటూ చారిటీ ఆర్గనైజేషన్స్‌ నుంచి ఎక్కువ కాల్స్‌ వస్తుంటాయి. రూ.100లకే కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్, తక్కువ ధరలో పల్స్‌ ఆక్సిమీటర్, స్మార్ట్‌ పల్స్‌ వాచ్, పోస్టర్‌ కిట్‌ ఎట్‌ హోమ్‌... ఇలాంటివాటిని ఆధారంగా చేసుకొని రకరకాల మోసాలకు తెరలేపుతున్నారు సైబర్‌నేరగాళ్లు. (చదవండి: జెన్‌ జడ్‌... క్యాన్సిల్‌ కల్చర్‌.. యూత్‌ను పట్టేసింది!)

మోసాల నుంచి జాగ్రత్త..
► కోవిడ్‌ ఆధారిత వస్తువులను ఉచితంగా డెలివరీ చేస్తాం అనే ఎసెమ్మెస్, వాట్సప్‌ లింక్‌లు వస్తుంటాయి. వీటిని క్లిక్‌ చేయకుండా ఉండాలి.

► కోవిడ్‌–19ను ప్రస్తావిస్తూ వచ్చిన తెలియని ఇ–మెయిల్‌లను, లింక్‌లను, మ్యాప్‌లను క్లిక్‌ చేయరాదు. 

► ఇ–మెయిల్, బ్యాంకింగ్‌ వాటికి విడివిడిగా రెండు ఫోన్‌ నెంబర్లను వాడటం మంచిది.

► మీ పాస్‌వర్డ్‌లను అప్‌డేట్‌ చేస్తూ ఉండండి. పాస్‌వర్డ్‌లు సంక్లిష్టమైన వర్డ్స్‌తో ఉండేలా జాగ్రత్తపడండి.

► అక్షరదోషాలు, అదనపు పదాలు ఉన్న URLల పట్ల జాగ్రత్త వహించండి.

► విరాళం ఇచ్చే ముందు స్వచ్ఛంద సంస్థ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి.

► కోవిడ్‌–19 గురించిన తాజా సమాచారం కోసం చట్లబద్ధమైన, ప్రభుత్వ వెబ్‌సైట్‌లను ఉపయోగించండి.

► ఆన్‌లైన్‌ చాట్‌లు, సమావేశాలలో పాల్గొన్నప్పుడు మీరున్న నేపథ్య స్థానాన్ని బ్లర్‌ చేయడం, ఇతర చిత్రాలను ఉపయోగించడం మంచిది.

- అనీల్‌ రాచమల్ల, 
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, 
ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు